33.7 C
Hyderabad
April 29, 2024 23: 36 PM
Slider సంపాదకీయం

కోమటిరెడ్డి ని ఇంకెంత కాలం భరిస్తారు….?

#revanthreddy

ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై నీళ్లు చల్లుతున్న కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంత కాలం ఉపేక్షిస్తారు? ఈ ప్రశ్న తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలపై నీళ్లు చల్లడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అలవాటుగా మారింది.

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాణాలకు తెగించి మరీ రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ పార్టీతో పోరాడుతుంటే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందనే అర్ధం వచ్చేలా కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి వ్యాఖ్యానించడం ఒక్క సారిగా తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. ఈ వ్యాఖ్య నేరుగా బీజేపీకి లాభం చేకూర్చేలా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆందోళన చెందారు.

దీనిపై కాంగ్రెస్ అధిష్టానవర్గం తీవ్ర చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరేవారి సంఖ్య పెరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పెల్లుబుకింది. ఇది సహించలేని కొందరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభించారు.

తెరవెనక నుంచి పని చేస్తున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరపైకి వచ్చి మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ లాంటి వారిని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సీనియర్ల పేరుతో కొందరు నాయకులు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన విధానం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనిస్తున్నాయి. ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీని తమ సొంత పార్టీగా భావిస్తూ కొత్తవారి చేరికలను తీవ్ర వ్యతిరేకిస్తున్న సీనియర్లు పరోక్షంగా బీఆర్ఎస్ కు సహకరిస్తున్నారు.

రేవంత్ రెడ్డి స్వతంత్రించి ఏ నిర్ణయం తీసుకున్నా ఈ సీనియర్లు తిరగుబాటు చేస్తూ రేవంత్ రెడ్డి ఉత్సాహం పై నీళ్లు చల్లుతున్నారు. రేవంత్ రెడ్డి తన మనుషులను చేర్చి పార్టీని హైజాక్ చేస్తున్నాడని భావిస్తున్న ఈ సీనియర్ల మొహం చూసి కొత్తవారు రారు కదా అని కాంగ్రెస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెరగకుండా ఎక్కడికక్కడ నిరుత్సాహ పరుస్తూ వేరే పార్టీలకు ఈ సీనియర్లు పూర్తిగా సహకరిస్తున్నారని అంటున్నారు.

రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన కొత్తలో నిర్వహించిన బహిరంగ సభలు అన్నీ సక్సెస్ అయ్యాయి. దాంతో ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చి వరంగల్ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా చెప్పుకునే వారే రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేశారు.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని అప్పుడే రేవంత్ రెడ్డిని మార్చి తనను పిసిసి అధ్యక్షుడుగా చేస్తారని అప్పటిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని, తన తమ్ముడిని గెలిపించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మాట్లాడిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతుంటే వారించాల్సింది పోయి, అన్న కూడా బీజేపీలోకి వచ్చేస్తాడని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నా కూడా వెంకట్ రెడ్డి ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండు పోతే పో అంతే కానీ ఇలా వెన్నుపోటు పొడవద్దు అని కుండబద్దలు కొట్టిన అద్దంకి దయాకర్ పైనే చర్య తీసుకోవాలని అప్పటిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పని చేసే అద్దంకి దయాకర్ పై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ కోమటిరెడ్డిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల పేరుతో చెలామణి అవుతున్న వారు అందరూ ఉండగానే కదా పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది? మరి వీరి గొప్పతనం ఏమిటి? సీనియర్ల పేరుతో పార్టీని కుళ్లబొడిచే వారిని పార్టీ నుంచి తీసేస్తే తప్ప తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదని కాంగ్రెస్ పార్టీ సాధారణ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పార్టీలోనే ఉంటూ పార్టీకి పలుదఫాలుగా వెన్నుపోటు పొడిచి రేవంత్ రెడ్డిని బయటకు నెట్టాలని చూస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వారిని తక్షణమే పార్టీ నుంచి బయటకు పంపాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

హంస వాహనంపై కొలువుదీరిన ఆది దంపతులు

Satyam NEWS

ములుగులో పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పర్యటన

Satyam NEWS

ఆన్‌లైన్‌ తరగతులతో సరికొత్త చరిత్రకు నారాయణ శ్రీకారం

Satyam NEWS

Leave a Comment