Slider సంపాదకీయం

మునుగోడులో కాంగ్రెస్ సీనియర్ల ‘‘సహాయ నిరాకరణ’’

#revanthreddy

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా రేవంత్ రెడ్డి పదవి వదిలిపెట్టి పారిపోయేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ ‘‘సీనియర్’’ నాయకులు భావిస్తున్నారు. అందుకు తగిన వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ గెలవలేదని సాధికారికంగా చెప్పేందుకు కుట్ర పన్నుతున్నారు.

పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయకుండా జాగ్రత్త పడుతూ ‘‘సహాయ నిరాకరణ’’ కొనసాగించాలనేది సీనియర్ నాయకుల వ్యూహంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ జెండాకు తామే నిజమైన వారసులమని, వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ జెండాను సొంతం చేసుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు గా వచ్చిన నాటి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎన్నో వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీకి బలమైన అభ్యర్ధులు లేని చోట్ల కొత్త నాయకులను దగ్గరకు తీసుకోవడం లాంటి చర్యలతో ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం కూడా మంచి అభిప్రాయం కలిగి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాలలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయ అభ్యర్ధులను సిద్ధం చేసుకున్నారు.

అదే విధంగా సాంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా ఆయన దృష్టి సారించారు. అక్కడ కొత్త క్యాడర్ ను అభివృద్ధి పరచుకుంటూ ఉన్న వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి జరిపిన సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని తేలింది.

టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ స్థానాల సంఖ్య పెరగవచ్చునని కూడా సర్వేలలో తెలిసింది. భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ 70 నియోజకవర్గాలలో అభ్యర్ధి లేని వాతావరణమే కనిపిస్తున్నది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నదని రేవంత్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో వెల్లడి అయింది. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి చెబుతూ ఉన్నారు.

క్షేత్ర స్థాయిలో మెరుగవుతున్న కాంగ్రెస్

క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉన్న విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం గమనించింది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన నాటి నుంచి ఇప్పటి వరకూ 10 నుంచి 15 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. రాహుల్ గాంధీ ఆదిలాబాద్, వరంగల్ బహిరంగ సభలలో జనం రియాక్షన్ ను తెలుసుకుని సంతృప్తి చెందారు. దాంతో రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ ఎంతో నమ్మకంతో ఉన్నారు.

ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా రేవంత్ రెడ్డిని వదులుకోవడానికి గానీ, స్థాయి తగ్గించడానికి గానీ రాహుల్ గాంధీ ఒప్పుకోవడం లేదు. రాహుల్ గాంధీ తమ మాట వినడం లేదని తెలుసుకున్న సీనియర్లు ఢిల్లీ స్థాయిలో భారీ కుట్ర జరిపారు. ఉత్తరప్రదేశ్ వ్యవహారాలు చూస్తున్న ప్రియాంక గాంధీని తెలంగాణ వ్యవహారాలు కూడా చూసే విధంగా ఒప్పించాలని ప్రయత్నించారు.

సీనియర్ల కుట్రలు ఫలించడం లేదు

అయితే ఆ వ్యవహారం సఫలీకృతం కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తన వర్గాన్ని పెంచుకుంటున్నాడనేది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా చెప్పుకునే కొందరి వాదన. అలా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయివేటు లిమిటెడ్ కంపెనీగా మారుతుందని, ఇది కాంగ్రెస్ మూల సిద్ధాంతానికి విరుద్ధమని వారు అంటున్నారు. అయితే ‘‘ పాత చెత్త’’ ను వదిలించుకోకపోతే ముందుకు వెళ్లలేమని రేవంత్ రెడ్డి స్థిరమైన అభిప్రాయం.

ఆ దిశగానే ఆయన పాత నాయకులను ఒక్కొక్కరిగా వదిలించుకుంటున్నారు. మల్లు రవి, దామోదర్ రాజనర్సింహ, షబ్బీర్ అలి, మధు యాష్కీ లాంటి కొందరినే రేవంత్ రెడ్డి దగ్గరకు రానిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కుళ్లబొడుస్తున్న ‘‘రెడ్డి’’ నాయకులను దూరం పెడుతున్నారు. వారికి చెప్పకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పదవి నుంచి సాగనంపాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.

అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ దశలో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సహాయ నిరాకరణ మొదలు పెట్టారు. పైగా శల్య సారధ్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీని కుళ్లబొడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పని చేసే అద్దంకి దయాకర్ లాంటి వారిని పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కూడా ‘‘సీనియర్’’ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు కానీ రేవంత్ రెడ్డి అడ్డుకోవడంతో కుదరలేదు.

దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇప్పుడు రేవంత్ సైన్యం తయారైంది. ఈ ‘‘రెడ్డి’’ నేతలకు తమ జిల్లాల్లోనే పక్క వారితో పడదు. అందువల్ల వీరిని నమ్ముకోవడం కన్నా రేవంత్ రెడ్డి బెటర్ అనే అభిప్రాయానికి మెజారిటీ కాంగ్రెస్ నాయకులు వచ్చారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ రావాలంటే రేవంత్ రెడ్డితో మంచిగ ఉండాలనే అభిప్రాయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులలో ఉంది.   

Related posts

శుభం

Satyam NEWS

బిర బిరా కృష్ణమ్మా పరుగులిడుతుంటేను….

Satyam NEWS

మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment