34.7 C
Hyderabad
May 5, 2024 02: 59 AM
Slider సంపాదకీయం

అప్పుల తిప్పలు: రాజ్యంగ ఉల్లంఘన : సంకటంలో బ్యాంకులు

#Y S Jaganmohan Reddy

ఏదో ఒక విధంగా అప్పులు తీసుకువచ్చి కాలం గడుపుదామనుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మింగుడుపడటం లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడం ఒక ఎత్తయితే రాజ్యాంగ ఉల్లంఘనలు మరొక వైపు జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి.

‘‘కేంద్రం మాత్రం అప్పులు చేయడం లేదా?’’ అంటూ జగన్ ప్రభుత్వం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఎదురుదాడి చేసినందున బిజెపి పెద్దలు మరింత సీరియస్ గా రాజ్యాంగ ఉల్లంఘనలపై దృష్టి సారించాలని నిర్ణయించారని ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలిసింది.

రాష్ట్ర ప్రభుత్వం తనకు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు తీసుకురావడం తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వం ఆస్తులు అంటే ప్రభుత్వ భవనాలు తాకట్టుపెట్టి అప్పులు తీసుకురావడం తీవ్ర అభ్యంతరకరం.

కలెక్టర్ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలు కుదువ పెట్టి అప్పులు తీసుకురావడం అంటే అంతకన్నా పరువు తక్కువ పని ఇంకొకటి ఉండదు. అలాంటిది ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టడం, భవిష్యత్తు రాబడిని కూడా తనఖా పెట్టడం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనలుగా చెబుతున్నారు.

రాజ్యాంగంలోని 266 అధికరణ లోని క్లాజు 1 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ రుణం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో ముందుగా జమ కావాలి. ఆ తర్వాత అక్కడ నుంచి అవసరాలకు ఖర్చు చేయాలి. అయితే జగన్ ప్రభుత్వం అలా చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతా రిజర్వు బ్యాంకు ఆధీనంలో ఉంటుంది.

రిజర్వు బ్యాంకు వారు అంతకు ముందే ఇచ్చిన అప్పులు, వాటి వడ్డీలు తదితరాలకు డబ్బులు కట్ చేస్తున్నారనే ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఎకౌంట్ లో కాకుండా వేరే ఎకౌంట్లలోకి అప్పు తెచ్చిన డబ్బులు మళ్లించుకుంది.

ఇది రాజ్యాంగ ఉల్లంఘన కావడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణిస్తున్నది. ఇలా అన్ని రాష్ట్రాలూ చేయడం మొదలు పెడితే దేశం మొత్తం అప్పుల కుప్పగా మారి వెనుజులా దేశంలా మారిపోతుంది. వెనుజులాలో ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడంతో దేశం మొత్తం దివాలా తీసింది.

ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలుపకుండా, వారి అనుమతి లేకుండా రుణాలు తీసుకురావడం రాజ్యాంగంలోని 293 అధికరణ ఉల్లంఘన కిందికి వస్తుంది.

కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరితే పాత బకాయిలను చెల్లు వేసుకుంటున్నారని, రుణ పరిమితి అంటూ అభ్యంతరాలు చెబుతున్నారని జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రుణాలు తీసుకున్నది. ఈ రెండు రాజ్యాంగ ఉల్లంఘనలు అత్యంత తీవ్రమైనవిగా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

ఈ రాజ్యాంగ నిబంధనలు తెలుసుకోకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంత పెద్ద ఎత్తు రుణాలు ఎలా ఇచ్చాయనేది మరో పెద్ద తప్పిదంగా చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులపై వత్తడి తెచ్చింది ఎవరు? అనే అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.

దాంతో జగన్ ప్రభుత్వానికి అడ్డగోలుగా రుణాలు ఇచ్చిన  బ్యాంకు అధికారుల గుండెల్లో కూడా రైళ్లు పరుగెడుతున్నాయి.

Related posts

అన్ని దానాల కన్న అన్నదానం మిన్న

Satyam NEWS

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలి

Satyam NEWS

32.477 లక్షల మొక్కలు నాటుట లక్ష్యం

Murali Krishna

Leave a Comment