Slider సంపాదకీయం

రాజకీయ అపరిపక్వత: రాజ్యసభ సీట్ల వ్యవహారం

#Y S Jaganmohan Reddy

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుల ఎంపిక రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తున్నది. రాజకీయంగా అత్యంత కీలకమైన పరిస్థితిలో ఉన్న పార్టీ మరింత ఆచితూచి రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసుకోవాలి. కానీ అలా కాకుండా అధినేత ఇష్టం వచ్చినట్లు అభ్యర్ధులను ఎంపిక చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

పైకి ఎవరూ ఏమీ మాట్లాడకపోయినా కూడా వైసీపీలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. రాజ్యసభ సభ్యుల ఎంపికపై వ్యతిరేకత వచ్చినట్లు పసిగట్టిన వైసీపీ అగ్రనాయకులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు కూడా. సామాజిక న్యాయం పాటించామని, 50 శాతం బిసిలకు ఇచ్చామని చెప్పుకోవడం ప్రారంభించారు కానీ అది అంతగా ఆ పార్టీ వారికే రుచించడం లేదు.

రెడ్లతో నిండిపోయిన పోస్టులు

ముఖ్యంగా ఇప్పటి వరకూ ఇచ్చిన నామినేటెడ్ పదవులు కానీ, సలహాదారుల పోస్టుల్లో పెట్టుకున్న వారు కానీ, పాలనా వ్యవహారాలు, పోలీసు వ్యవస్థలో కానీ రెడ్డి కులస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా రెడ్డి కులస్తులలో కూడా తమకు అనుకూలంగా ఉండేవారినే పదవులకు ఎంపిక చేసుకుంటున్నారనే విమర్శలు ఎక్కువగా వున్నాయి. దాంతో రెడ్డి కులంలో కూడా వ్యతిరేకత వస్తూనే ఉన్నది.

మొన్నీమధ్య కాలంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడ్డాయి. అసమ్మతిని చల్లార్చడానికి వైసీపీ నాయకులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అసమ్మతి ఎక్కడా లేదు… అదంతా ఎల్లో మీడియా సృష్టి అని బుకాయించవచ్చు కానీ జరిగింది మాత్రం అందరూ చూశారు.

మంత్రి వర్గం కాబట్టి వ్యతిరేకత కనిపించింది. రాజ్యసభ ఎన్నికలలో అలా జరిగే అవకాశం లేదు. రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్ధుల ఎంపికపై చాలా మంది ఆశలు పెట్టుకోరు కాబట్టి దానిపై అసమ్మతి చెలరేగే అవకాశం చాలా తక్కువ. అయితే ఎంపిక చేసిన అభ్యర్ధులను బట్టి నాయకుల ఆలోచన ఏ విధంగా ఉందో అంచనా వేసుకుంటారు.

తెలంగాణ బిసిలు… ఏపి వ్యాపారులు

అధికారంలో ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎంపిక ఎంత వరకు ఉపయోగిస్తుంది అనేది ఇప్పుడు ఏపిలో విస్తృతంగా జరుగుతున్న చర్చ. 50 శాతం బిసిలకు ఇచ్చాం అని చెప్పుకోవడాన్ని చాలా మంది ఎద్దేవా చేశారు. ఉన్న నాలుగు సీట్లలో రెండు రెడ్లకు అంటే 50 శాతం రెడ్లకు ఇచ్చిన విషయం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.

50 శాతం బిసిలకు ఇచ్చామని చెప్పుకోవడాన్ని కూడా చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. తెలంగాణ నుంచి అరువు తెచ్చుకున్న బిసిలకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బాగా డబ్బు ఉన్న వారికి సీటు కేటాయించి వారిని బిసిల కింద లెక్కిస్తే ఎలా అని కూడా ప్రశ్నించేవారు ఉన్నారు. ఇద్దరు రెడ్లలో కూడా పార్టీకి ఉపయోగపడే వారు ఒక్కరే కావడం రెండో రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం పై రెడ్డి కులస్తులే వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ వారికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడాన్ని ఎందుకో గానీ జగన్ మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు. సలహాదారులలో కూడా తెలంగాణ వారికి, తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న వారికి జగన్ ఏపిలో స్థానం కల్పిస్తున్నారు. తెలంగాణలో ఒక్క ఏపి వ్యక్తికి అయినా ఇలా చేశారా అనే ప్రశ్ని ఇక్కడ ఉదయిస్తున్నది.

పైగా ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తి తెలంగాణకు న్యాయమూర్తిగా రావడాన్ని కూడా తెలంగాణ వారు వ్యతిరేకించి ఇటీవలె పెద్ద గొడవ చేశారు. తెలంగాణ రాష్ట్రంతో తెగతెంపులు చేసుకోవాల్సిన అంశాలు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ అటుంచి హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల్ని కూడా తెలంగాణ కు జగన్ ఇచ్చేశారు. ఇవన్నీ జనం మర్చిపోయారు కానీ ఈ రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల ఎంపికతో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు.

తెలంగాణ వారు ఏపి ప్రయోజనాలను ఎలా కాపాడతారు?

తెలంగాణ కు చెందిన ఇద్దరు రాజ్యసభ అభ్యర్ధులు ఏపి ప్రయోజనాలను ఏ విధంగా కాపాడతారనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మాత్రమే వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిదానికీ చంద్రబాబు బాధ్యుడు అయితే ఇక మీరెందుకు అనే ప్రశ్న ఇప్పుడిప్పుడే జనబాహుళ్యంలో వస్తున్నది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది.

ఈ మొత్తం సెలెక్షన్ అంతా చెత్తగా ఉన్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వాటిలో తెలంగాణా నుంచి వచ్చిన ఆర్ క్రిష్ణయ్య వల్ల ఏపీలో ఉన్న బీసీలకు ఏమి జరుగుతుందని అంటున్నారు. ఇక తెలంగాణాలోనే క్రిష్ణయ్య ఈ మధ్య చూస్తే అవుట్ డేటెడ్ లీడర్ అయిపోయారు అని అంటున్నారు.

ప్రతీ సారి అధికారం కోసం ఆయన వివిధ పార్టీల  నాయకులను పొగుడుతారు అని అంటారు. ఒకసారి కేసీయార్ ని పొగుడుతారు. అలాగే మరోసారి సీఎం క్యాండిడేట్ గా తనను ముందు పెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుని పొగిడి ఎమ్మెల్యే అయ్యారు.  ఇక 2018లో కేసీయార్ కి వ్యతిరేకంగా పిలుపు ఇచ్చినా కూడా నాటి రాజకీయ పరిస్థితులు పరిణామాలలో ఆయన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నాడు టీయారెస్ ని గెలిపించారు కూడా.

ఇక మరో బీసీ నేత బీద మస్తాన్ రావు కరడు కట్టిన తెలుగుదేశం వాదిగా చెబుతారు. అతనికి శ్రీకాకుళం నుంచి చెన్నై వరకూ పెద్ద ఎత్తున ఫిషరీస్ కి సప్లై చేసే ఫుడ్ మెటీరీల్ బిజినెస్ లు ఉన్నాయి. ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పెద్ద ఎత్తున చంద్రబాబుకు ఆర్ధిక సాయం కూడా చేశారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ గా పోటీ చేసి వైసీపీ చేతిలో ఓడిపోయారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక  తన బిజినెస్ ల పై సీబిఐ దాడులు జరగడం తో పార్టీలో చేరిన మస్తాన్ రావు రాజ్య సభ ఎంపీ అయిపోతే వైసీపీలో ఉన్న అసలైన  బీసీ లీడర్ల సంగతేంటి వారు ఏమి కావాలని కూడా  అంటున్నారు. బిజినెస్ ల కోసం పార్టీలో చేరిన వారిని అవసరార్ధం అధికార పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తూ పోతే వైసీపీలో ఉన్న అసలైన బీసీలు ఎలా నమ్ముతారు అని కూడా అంటున్నారు.

నలుగురిలో ముగ్గురు విజయసాయిరెడ్డి మనుషులే

ఇక నిరంజన్ రెడ్డి జగన్ విజయసాయిరెడ్డిల సీబీఐ ఈడీ కేసులు చూసే పెద్ద లాయర్. ఆయన వల్ల వైసీపీకి కానీ ఏపీలో పార్టీకి కానీ ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు. ఒక వేళ రెడ్డి కోటాలో ఎంపీ సీటు ఇవ్వాలీ అంటే రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం నుంచి పెద్ద నాయకులు  రెడ్లు చాలా మంది ఉన్నారు కదా అన్నది పార్టీలో మాట.

ఇక నాలుగవ సీటు విజయసాయిరెడ్డికి రెన్యూవల్ చేశారు. ఈయన పార్టీకి పట్టుకొమ్మలాంటి వారు. వైసీపీలో నంబర్ టూ స్థానం ఇతనిదే అని అంతా అంటూ ఉంటారు. ఇది వాస్తవం కూడా. ఎందుకు అంటే ఈ నాలుగు ఎంపీ సీట్లు కూడా ఆయన కోటాలోనే ఇచ్చారు అని పార్టీలో వినిపిస్తున్న మాట.

బీద మస్తాన్ రావు నిరంజన్ రెడ్డి ఆయన మనుషులే. ఇక బీసీ నేత ఆర్ క్రిష్ణయ్యకు ఇవ్వాలన్న ఐడియా కూడా విజయసాయిరెడ్డిదే అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీలో విజయసాయిరెడ్డి హవా జోరుగా సాగుతోంది అంటున్నారు. పార్టీలో ఎవరికైనా ఏ  సీటు అయినా  రావాలీ అంటే విజయసాయిరెడ్డి దర్శనం కోసం చూడాలి ఆయన మాటతోనే దక్కించుకోవాలి అన్న మాట అయితే పార్టీ వర్గాలలో ఉంది.

Related posts

ఆండ్రలో దొంగత‌నం ప‌ని ఆక‌తాయిల ప‌నే….!

Satyam NEWS

ఆషాఢమాసం బోనాలు

Satyam NEWS

ఏపీ గవర్నర్‌గా ప్రమాణం చేసిన జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

Satyam NEWS

Leave a Comment