కరోనా వైరస్ వ్యాప్తి భయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తాకింది. అమరావతి పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలను తక్షణం నిలిపివేయాలని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా నుంచి వచ్చిన వృద్ధ దంపతులు మంగళగిరి పట్టణంలో వారం రోజుల క్రితం సంచరించారని వారికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వీరు అమరావతి ఉద్యమానికి కూడా సంఘీభావం తెలిపినట్లు స్థానికులు చెబుతున్నారు. దాంతో మంగళగిరి తదితర ప్రాంతాలలో జనం జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా మంగళగిరికి సోకకుండా అధికారులు చర్యలు ప్రకటించారు.
రోడ్ల పక్కన ఉండే అల్పాహార శాలలు, చికెన్, మటన్ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లను మూసివేయాలని సూచించారు. ఈ నెల 31 వరకూ అన్ని బహిరంగ వ్యాపార సముదాయాలనూ మూసి వేయాలని అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. తమ ఉత్తర్వులు అతిక్రమిస్తే, కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు.
అయితే ఆ తర్వాత మంగళగిరి నుంచి కరోనా లక్షణాలతో వచ్చిన జంటకు నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిద్దరినీ ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు.