38.2 C
Hyderabad
May 2, 2024 20: 33 PM
Slider ప్రత్యేకం

ప్రభుత్వాలను ఆడిస్తున్న కార్పొరేట్ కాలేజీ మాఫియా

#Online Class

కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు తెరుస్తారా? అమ్మో ఎలా తెరుస్తాం? కరోనా సెకండ్ వేవ్ వస్తున్నది కదా? పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా? ఒక్క ప్రశ్నకు ఇన్ని సమాధానాలు చెబుతారు కానీ వసూలు చేసే ఫీజుల దగ్గర మాత్రం ఒక్కటే సమాధానం వస్తున్నది.

కరోనా కాలంలో మూసివేసిన స్కూళ్లను కాలేజీలను మళ్లీ తెరవకుండా బడా బడా కార్పొరేట్ కాలేజీలు అడ్డుకుంటున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. చిన్న స్కూళ్లు, కాలేజీలు తెరిచినా ఆయా యాజమాన్యాలకు పెద్దగా నష్టం లేదు.

అయితే ఇప్పటికే స్టాఫ్ ను తీసేసిన కార్పొరేట్ కాలేజీలకు ఇప్పుడు స్కూళ్లు కాలేజీలు తెరిస్తే భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుంది. కరోనా పేరుతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చాలా కార్పొరేట్ కాలేజీలు టీచర్లను, లెక్చరర్లను, ఆఫీస్ స్టాఫ్ ను తొలగించారు.

ఇలా తొలగించిన వారు నానా అగచాట్లు పడుతున్నారు. కొందరైతే తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయి వేరే పనుల్లో చేరిపోయారు. కార్పొరేట్ కాలేజీల్లో, స్కూళ్లలో పని చేసే సమయంలో ఒక్కో లెక్చరర్ కు 18 నుంచి 25 వేల రూపాయల జీతం వచ్చేది. ఇప్పుడు రోడ్డుపైన బజ్జీలు అమ్ముకున్నా నెలకు 30 వేలు వస్తున్నది.

కొబ్బరి బోండాలు అమ్మే ఒక మాజీ లెక్చరర్ మళ్లీ కాలేజీ తెరిచినా లెక్చరర్ గా వెళ్లేది లేదని కరాఖండిగా చెబుతున్నాడు. ఈ పరిస్థితుల్లో మళ్లీ కాలేజీలు తెరిస్తే ఈ పూర్తి కాలానికి జీతం అన్నా ఇవ్వాలి. లేదా కొత్త ఫాకల్టీని తయారు చేసుకోవాలి.

ఈ రెండు పనులు కుదరని కార్పొరేట్ కాలేజీల వారు ప్రభుత్వం పై వత్తిడి తీసుకువచ్చి సెకండ్ వేవ్ పేరుతో కాలేజీలు తెరవనివ్వడం లేదు. అలాగని ఫీజల్లో తల్లిదండ్రులకు ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు. పదో తరగతి విద్యార్ధికి (డే స్కాలర్) కు 36 వేల రూపాయలు కట్టించుకునేవారు. గత ఆరు నెలలుగా ఆన్ లైన్ క్లాస్ లకు ఆ విద్యార్ధి హాజరు అవుతున్నా ఫీజులో మాత్రం ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు.

ఫీజలు మాత్రం తగ్గించడం లేదు

గతంలో కన్నా జీతాల భారం బాగా తగ్గిపోయినా కూడా కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు ఫీజలు మాత్రం తగ్గించడం లేదు. దాంతో కార్పొరేట్ కాలేజీలకు ఆన్ లైన్ క్లాసుల వల్ల భారీ ఎత్తున ఆదాయం వస్తున్నది. ఖర్చుపూర్తిగా తగ్గిపోయింది.

దాంతో కార్పొరేట్ కాలేజీల వారు కరోనా సెకండ్ వేవ్ పేరు చెప్పి ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు తమకెందుకు ఈ గోల అంటూ బడా కార్పొరేట్ కాలేజీలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. సినిమా హాళ్లలో సీటుకు సీటుకు గ్యాప్ తో ఏర్పాట్లు చేసినట్లు 50 మంది విద్యార్ధులు ఉండే స్కూలు గదిని 25 మందితో ఏర్పాటు చేయవచ్చు.

బెంచ్ కి బెంచ్ కి మధ్య విండ్ షీల్డ్ ఏర్పాటు చేయవచ్చు. విదేశాలలో ఇదే విధంగా ఏర్పాటు చేసి స్కూళ్లు నడుపుతున్నారు. అలా చేయడం వల్ల చిన్న కాలేజీలు, స్కూళ్లు ఫర్వాలేదు కానీ కార్పొరేట్ కాలేజీలు ఇంత ఖర్చు భరించలేక దివాలా తీస్తాయి.

అందుకోసమే ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో ఈ మూడు నెలలు గడిపేస్తే ఆ తర్వాతి విద్యా సంవత్సరానికి మళ్లీ ఫీజలు గుంజుకోవచ్చునని కార్పొరేట్ విద్యా మాఫియా ప్లానింగ్ చేస్తున్నది. ప్రభుత్వాలు కూడా తలకాయలు ఊపుతున్నాయి. ప్రభుత్వానికి కార్పొరేట్ కాలేజీలతో లాలూచీ లేకపోతే ఆన్ లైన్ లో విద్యా బోధన జరుగుతున్నప్పుడు ఫీజులు కట్టడి చేయలేదా?

Related posts

విద్యార్హతను పెంచుకునేందుకు ఓపెన్ స్కూల్ మంచి అవకాశం

Satyam NEWS

ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్

Satyam NEWS

కామెంట్: దేవుడిపై కూడా జగన్ కు నమ్మకం లేదు

Satyam NEWS

Leave a Comment