29.7 C
Hyderabad
April 29, 2024 09: 51 AM
Slider ప్రత్యేకం

మోదీని గద్దె దించడమే లక్ష్యం: సిపిఐ జాతీయ మహాసభ

#draja

భారతదేశాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎల్లకాలం పరిపాలించలేవని, వచ్చే 2024 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె నుండి కూలదోస్తామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రకటించారు. ఇదే తమ ముందున్న అతి పెద్ద సవాలు అని, ఇందుకు ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్ష శక్తులను కూడగడతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎర్రజెండా మాత్రమే భారతదేశ ఆశ, భవిష్యత్తు అని  పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, దేశంలోని భిన్నత్వాన్ని కాపాడడం, రాజ్యాంగాన్ని కాపాడడం మన ముందు ఉన్న చరిత్రాత్మక కర్తవ్యమని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.  విజయవాడలో సిపిఐ 24వ జాతీయ మహాసభల ప్రారంభ సూచికగా  శుక్రవారం భారీ ర్యాలీ అనంతరం   కామ్రేడ్‌ చండ్ర రాజేశ్వరరావు మైదానం (ఎం.బి.స్టేడియం)లో  భారీ బహిరంగ సభ జరిగింది. 

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో డి.రాజాతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి,  జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అతుల్‌ కుమార్‌ అంజాన్‌, అమర్‌జీత్‌ కౌర్‌, కానం రాజేందర్‌, రమీందర్‌ కుమార్‌,కాంగో, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ  వెంకట్‌  రెడ్డి, సయ్యద్‌ అజీజ్‌ పాషా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌ రెడ్డి, ఇతర జాతీయ నాయకులు వేదికపై ఆసీనులయ్యారు. 

తొలుత డి.రాజా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభిస్తూ ‘సోదర సోదరీమణులారా . అందరూ బాగున్నారా?’’ అంటూ ఉత్సాహపరుస్తూ,  కమ్యూనిస్టు శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణను మార్గదర్శనం చేశారు.  విజయవాడ నగరం మహోజ్వల కమ్యూనిస్టు ఉద్యమానికి నిలయమని, ఈ నగరంలో సిపిఐ మహాసభలు జరగడం మూడవ సారి అని తెలిపారు. చండ్ర రాజేశ్వరరావు వంటి గొప్ప నాయకుడు, ఇతర పోరాట యోధులకు సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు.

మహాసభ సందర్భంగా జరిగిన భారీ ప్రదర్శన అద్భుతంగా సాగిందని కొనియాడారు. ఇదే రోజు డాక్టర్‌ సాయిబాబాను నిర్దోషిగా ముంబై హైకోర్టు ప్రకటించిందన్నారు. ఢల్లీి యూనివర్సిటీలో బోధించే సాయిబాబు 90 శాతం వైకల్యం కలిగి ఉన్నారని, ఆయన కదలలేని స్థితిలో ఉన్నారని, అయినపటికీ బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఏళ్ళ తరబడి జైళ్ళో పెట్టారని అన్నారు.

మోడీ విధానాలను ప్రశ్నిస్తే అర్బన్‌ నక్సలైటా?

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజాస్వామిక హక్కులు, మానవ హక్కులను అణివేస్తున్నారని రాజా మండిపడ్డారు. ఎవరైనా మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే, ఆ వ్యక్తిపై అర్బన్‌ నక్సలైటు, మావోయిస్టు, ఉగ్రవాది, దేశ ద్రోహి అని ముద్ర వేస్తున్నారని అన్నారు. ఇదే దేశ ప్రజలు, కమ్యూనిస్టుల ఎదుట ఉన్న పెద్ద సవాలు అని చెప్పారు. మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు స్పష్టంగా చెబుతున్నాం.

మీరు దేశ ప్రజల హక్కులను అణిచివేస్తే అంగీకరించేది లేదు. అంబేడ్కర్‌, ఇతర మహనీయులు రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎర్రజెండా అనుమతించబోదు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక హక్కులను అణిచివేస్తే ఊరుకోబోమ’ని రాజా హెచ్చరించారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను, వామపక్షాలను, దేశంలోని అన్ని రకాల ఉద్యమాలను ఏకం చేస్తామని, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా పోరాడుతామని, ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తున్నారు

ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతృత్వంలోని కేంద్రంలో అత్యంత వినాశకరమైన ప్రభుత్వం ఉన్నదని, ఇది వినాశకర పరిపాలన అందిస్తోందని  రాజా విమర్శించారు. కనిష్ఠ ప్రభుత్వమంటూ మోడీ పార్లమెంటును నడపడం లేదని, పార్లమెంటును జీరో చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమేనని రాజా ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రజలు లౌకికవాదులని, భిన్నత్వంలో సైతం అద్భుతమైన ఏకత్వం కలిగి ఉన్నారని, అయితే ఒకే సంస్కృతి పేరుతో దానిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సభకు యువత, పిల్లలు, ఎర్ర చీరలతో మహిళలు విజయవాడలో కదం తొక్కడం ఉజ్వల భవిష్యత్తును సూచిస్తున్నదని రాజా పేర్కొన్నారు. సభకు సిపిఐ ఎపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, అక్కినేని వనజ స్వాగతం పలికారు. వేదికపై విదేశీ సౌహార్థ ప్రతినిధులు సభికులకు అభివాదం చేశారు.

Related posts

ద‌స‌రా కానుక‌గా అజ‌య్ దేవ్‌గ‌న్ మైదాన్‌

Sub Editor

రాక్షస రాజ్యం: టీడీపీ కార్యకర్తల్ని దారుణంగా హింసించిన వైసీపీ నేతలు

Satyam NEWS

మహిళలు ఆర్థికంగా ఇంకా ఎదగాలి

Satyam NEWS

Leave a Comment