38.2 C
Hyderabad
April 29, 2024 20: 55 PM
Slider ప్రత్యేకం

డేంజర్ బెల్స్: మన రాజ్యాంగం ప్రమాదంలో పడిందా!

CAA protest

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

సుమారు మూడేళ్ళ పాటు లోతైన సమాలోచనలు అనంతరం ప్రపంచంలోనే అతి పెద్దదిగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్దాల కాలం గడించింది. భారత దేశ చరిత్రలో ఇదొక్క మహోజ్వల మైన ఘట్టం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా, ప్రజలందరికి స్వేచ్ఛ, స్వాతంత్రాలను, సమన అవకాశాలను కలిగిస్తూ, ఎటువంటి వివక్షతకు అవకాశం లేకుండా మనలను మనం రూపొందించుకున్న మహత్తర ఘట్టం. 

ఒక వంక దేశం అంతా రిపబ్లిక్ డే ఉత్సవాలను జరుపుకొంటుండగా, దేశంలో కొందరు, ముఖ్యంగా ప్రతిపక్షాలు, పలు అంశాలలో వాటి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్న వివిధ ప్రజా సంఘాలు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనే నినాదాలు ఇస్తున్నారు. `రాజ్యాంగాన్ని కాపాడండి’ అంటూ కొన్ని రోజులుగా దేశంలో పలు నగరాలు, పట్టణాలలో నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఒక దేశపు రాజ్యాంగం ఆ దేశం ప్రజల సాంస్కృతిగా, భావాత్మక ఆలోచనలకు, విలువలకు అడ్డం ఆడుతుందా?

లేదా రాజ్యాంగం మేరకు ఆ దేశ ప్రజలు నడుచు కుంటారా? అన్నది ఈ సందర్భంగా తలెత్తే ప్రధాన ప్రశ్న. నేడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని చెప్పడానికి ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 అమలును నిర్వీర్యం చేయడం, ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు రావడం. 

వాస్తవానికి ఈ రెండు అంశాలపై తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు నుండి వివిధ పార్టీలు, నేతలు స్పష్టమైన హామీలే ఇస్తూనే ఉన్నారు. రాజ్యాంగంలో కేవలం ఒక తాత్కాలిక ఏర్పాటుగా తీసుకొచ్చిన ఆర్టికల్ 370ని ఇదివరకే ఇందిరా గాంధీ, పివి నరసింహారావు వంటి ప్రధానులు రాజ్యాంగ సవరణల ద్వారా నిర్వీర్యం చేశారు.

ఇక పౌరసత్వ సవరణకు సంబంధించి నెహ్రు నుండి ఇందిరా వరకు పొరుగు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగానే ఉంది. వామపక్షాలతో సహా అన్ని పక్షాలు ఈ అంశంపై పార్లమెంట్ లో గతంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని జాతి సమగ్రత, భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోకుండా సంకుచిత రాజకీయ అవసరాల మేరకు అన్వయించుకొనే ప్రయత్నం జరుగుతూ ఉండడంతో నేడు నరేంద్ర మోదీ చేస్తున్న చర్యలు తమ విభజన రాజకీయాలకు ముగింపు కాగలవని ఆందోళన చెందుతున్నట్లు ఉన్నది.

అదే సమయంలో, నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం మౌలిక అంశాలు,  సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుండడం కూడా పలు వర్గాలలో ప్రభుత్వ చర్యలు అనుమానాస్పదంగా మారుతున్నాయి. 

ఇక, ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జనాభా రిజిస్టర్, పౌరసత్వ రిజిస్టర్ వంటి చర్యలు సహితం వివాదాస్పదంగా మారడంతో రాజ్యాంగంపై ప్రమాదం అంటూ నినాదాలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి కొన్ని మౌలిక అంశాలపై జాతీయ ఏకాభిప్రాయం ఏర్పరచే ప్రయత్నం చేయకుండా, రాజకీయ ప్రయోజనాలకే రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. 

ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాలే ఒక జాతిని నడిపిస్తాయి. కేవలం రాజ్యాంగంలో హామీలు ఇచ్చినంత మాత్రం చేత ప్రజలకు భరోసా ఏర్పడదు. ఉదాహరణకు భారత దేశంతో పాటే సుమారు 60 ఆసియా, పసిఫిక్ దేశాలు స్వతంత్రం పొందాయి. అవన్నీ ప్రజాస్వామ్య ప్రక్రియను అనుసరించాయి. అయితే నేడు భారత్ లో మినహా మరే దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా మనుగడలో లేదని చెప్పాలి.

నిరంకుశ వ్యవస్థలో, మత రాజ్యాలలో ఆయా దేశాలలో నెలకొన్నాయి. మన పొరుగున ఉన్న పాకిస్థాన్, బాంగ్లాదేశ్ లు మొదట్లో లౌకిక, ప్రజాస్వామ్య దేశాలుగా ఆవిర్భవించాయి. కానీ తొందరలోనే అవి మత రాజ్యాలుగా మారాయి. తరచూ సైనిక పాలనాలను చూస్తున్నాయి.

కాబట్టి కేవలం రాజ్యాంగ నిబంధనలో ఏ దేశంలో కూడా స్వేచ్ఛ, స్వాతంత్రాలను కాపాడలేవు. అందుకు బలమైన సామాజిక, సాంస్కృతిక నేపధ్యం కూడా అవసరం. నేడు మన రాజ్యాంగానికి ఏర్పడుతున్న ముప్పు విధాన నిర్ణయాలు తీసుకొనే రాజకీయ పార్టీలు మౌలిక రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వడం వల్లనే అని అర్ధం చేసుకోవాలి.

నేడు దేశంలో రెండు, మూడు పార్టీలు తప్ప దాదాపు అన్ని ఒక కుటుంబం  లేదా ఒకరిద్దరు వ్యక్తుల చేతులలో అధికారం కేంద్రీకృతం అవుతూ ఉంటున్నది. అంతర్గత ప్రజాస్వామ్యం దాదాపు ఏ పార్టీలో కనిపించడం లేదు. నేడు రాజ్యాంగానికి కీలకమైన ముప్పు మన రాజకీయ పార్టీల వ్యవస్థ నుండే తలెత్తుతున్నదని గమనించాలి.

చలసాని నరేంద్ర

Related posts

మండపేటకు 16న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాక

Satyam NEWS

రజకుల చెరువుపై రాజకీయం: కోర్టు ఆదేశాలతో వేలం

Bhavani

నెల్లూరు జిల్లాలో కాకరేగుతున్న రాజకీయాలు

Satyam NEWS

Leave a Comment