ఢిల్లీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ అగ్నిప్రమాదంలో తొలుత 10 మంది మరణించి ఉంటారని భావించారు. ఆ కాస్సేపటికే ఈ సంఖ్య 35కు పెరిగింది. ప్రస్తుతం 43 మంది ఈ ఘోర అగ్నిప్రమాదంలో సజీవ దహనమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ధృవీకరించారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వారు అనుమానిస్తున్నారు. న్యూఢిల్లీలోని రాణి ఝాన్సీ మార్గంలో ఉన్న అనాజ్ మండి ప్రాంతంలోని ఓ కర్మాగారంలో ఆదివారం తెల్లవారు జామున భీకర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
అనాజ్ మండి ప్రాంతం ఇరుకుగా ఉండటం, మంటలు చెలరేగిన వెంటనే సురక్షితంగా తప్పించుకోవడానికి అవసరమైన అత్యవసర మార్గాలు లేకపోవడం వల్ల కార్మికులు మంటల్లో చిక్కుకుని ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కర్మాగారం నుంచి 59 మందిని సురక్షితంగా బయటకు తెచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిప్యూటీ చీఫ్ ఫైర్ అధికారి సునీల్ చౌదరి తెలిపారు.