24.7 C
Hyderabad
July 18, 2024 07: 52 AM
ముఖ్యంశాలు

దేశంలో జోక్ గా మారిపోయిన అభివృద్ధి

developing India

అగ్ర రాజ్యాలతో పోటీ పడి అభివృద్ధి చెందుతున్నాం అనే స్లోగన్ నుంచి మనదే అభివృద్ధి చెందిన దేశం అనే స్లోగన్ కు ఈ మధ్య కాలంలో ఎదిగాం. ఇంకా ఎదుగుతున్నాం. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా కూడా అవతరిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దేశం అభివృద్ధి చెందడం లేదా మనిషి అభివృద్ధి చెందడం అంటే ఏమిటి? సుఖాలు అందించే యంత్ర పరికరాలను సిద్ధం చేసుకోవడమే అభివృద్ధా? గత మూడు దశాబ్దాలుగా దేశం యావత్తు శారీరక శ్రమ లేకుండా ఎలా జీవించాలి అనేదే ధ్యేయంగా అత్యంత వేగంగా పరుగులు పెట్టింది.

అందులో భాగాలే రకరకాల వాహనాల వినియోగం, శీతల యంత్రాల వినియోగం, వివిధ రకాల విద్యుత్ గృహోపకరణాల వినియోగం, ఆడంబర వస్తు వినియోగం, తయారు చేసిన ఆహార పదార్ధాల వినియోగం, నిలవవుంచిన ఆహార వినియోగం, మద్యపాన వినియోగం,  విలాసావంతమైన నివాసాలు సమకూర్చు కోవడం అత్యవసరంగా భావిస్తున్నాం. ఇదే వ్యక్తిగత, దేశ అభివృద్ధికి కొలమానంగా భావిస్తున్నాం. మూడు దశాబ్దాల కిందట ఫ్యాన్ వాడే ఇంటిని దారిద్యరేఖకు ఎగువకు వెళ్లిన కుటుంబాలుగా పరిగణించే వారు. ఇప్పుడు ఏసీ ఉన్న ఇళ్లకు కూడా కిలో రూపాయి బియ్యం అందిస్తున్నారు.

మరి అభివృద్ధి చెందినట్లా లేదా? ఏసీ పెట్టుకోవడమే అభివృద్ధి అయితే కిలో రూపాయ బియ్యం ఇవ్వ కూడదు. కిలో రూపాయి బియ్యం తీసుకుంటే అభివృద్ది చెందినట్లు కాదు. ఏది నిజం? ఏది పేదరికానికి, ధనికత్వానికి కొలమానం? ఈ అంశంపై అమార్త్యసేన్ లాంటి సామాజిక ఆర్ధిక శాస్త్రవేత్తలు తమ తమ సిద్ధాంతాలు ప్రతిపాదించారు కానీ వాటిని ప్రభుత్వం గుర్తించి అనుసరిస్తున్న దాఖలాలు లేవు. పేదరికానికి సంబధించిన పెరామీటర్లను ఆ మధ్య కాలంలో లక్డావాలా కమిటీ తిరగరాస్తే ఒక్క సారిగా దేశం మొత్తం భగ్గుమన్నది.

మా ఇంట్లో ఫ్యాన్, ద్విచక్ర మోటారు వాహనం ఉన్నంత మాత్రాన మేం అభివృద్ధి చెందినట్లు కాదు అని చాలా మంది రోడ్లెక్కారు. అంటే మారిన పరిస్థితుల దృష్ట్యా పేదరికానికి కొత్త నిర్వచనం చెప్పుకోవడానికి కూడా మన సమాజం అనుకూలంగా లేదు. అంటే మనం అభివృద్ధి చెందినట్లేనా? ప్రభుత్వానికి సంబంధించిన ఈ విషయాలు వదిలేద్దాం. వ్యక్తిగతంగా చూసుకుంటే మనిషికి సుఖాన్నిచ్చే (సౌకర్యాన్ని ఇచ్చే) అన్ని పరికాలు మనకు ఏం తెచ్చిపెడుతున్నాయో తెలుసా? ఊబకాయాలు, రక్తపోటు, చెక్కెర వ్యాధి, కీళ్ల వ్యాధులు, గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, అకాల మరణాలు, సంతాన సమస్యలు.

శారీరక శ్రమను తగ్గించే ఈ యంత్రాల వల్ల మనకు లభించిన సౌకర్యం ఇది. పైగా ఈ వస్తువులు (ఎయిర్ కండిషనర్లు, ఫ్రిజ్ లు) ఎక్కువగా వాడటం వల్ల గాలి కలుషితం అయిపోతున్నది. కంప్యూటర్ వ్యర్ధాలతో పర్యావరణం నాశనం అవుతున్నది. ప్లాస్టిక్ భూతం వాతావరణాన్ని కబళించి వేస్తున్నది. దాంతో వాతావరణంలో కాలుష్యం, అకాలవర్షాలు, ప్రకృతి విపత్తులు, భూగర్భ జలాలు అడుగంటి పోవడం, నీటిలో కాలుష్యం, పండ్లు కూరగాయల్లో కాలుష్యం అధికం అయిపోతున్నాయి. మన దేశం ఎంత అభివృద్ధి చెందింది అంటే ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పే స్థాయి నుంచి సింగిల్ టై యూజ్ ప్లాస్టిక్ వాడద్దు అనే స్థాయికి వచ్చాం.

అంటే ప్లాస్టిక్ వాడకంపై ఉన్న నిషేధాలను మనం అమలు చేసుకోలేకపోయినట్లే కదా. ఈ పరిణామాలతోనే  విస్తుపోయే సంఖ్యలో వైద్యులు, వైద్యశాలలు, ఔషధ పరిశ్రమలు అవసరం అవుతున్నాయి. ఇదే అదనుగా వస్తున్న కల్తీ ఔషధాలు మనిషి జీవితాన్ని మరింత ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మనముందు ఎదురుగా నిలుచున్న “సవాల్” మనిషి మనుగడ ప్రస్నార్ధకమవటం. ఇప్పుడు దేశమంతటా “మాంద్యం” అంటున్నారు.  “అభివృద్ధి” అనే నినాదం క్రింద మనం నిఖరంగా  సాధించింది ఇదేనా ??

రఘురాం మాగంటి

Related posts

తిరుమలలో మరో అయిదు చిరుత‌ల క‌ద‌లిక‌లు

Bhavani

మందుపాతర పేల్చిన మావోలు

Bhavani

సజ్జల పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి

Satyam NEWS

Leave a Comment