39.2 C
Hyderabad
April 28, 2024 14: 20 PM
Slider విజయనగరం

మహిళల భద్రతకు ‘దిశా’ యాప్ తో పూర్తి భరోసా

#deepika ips

విజయనగరం లో ‘దిశా’ యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు 5రోజుల పాటు ఉచితంగా ప్రయాణించేందుకు ఏర్పాటు చేసిన బస్సు సదుపాయం నేటితో ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఉచిత బస్సు ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక నెల్లిమర్ల మిమ్స్ నుండి విజయనగరం ఆర్టీసి కాంప్లెక్స్ వరకు ఉచిత బస్సులో ప్రయాణించి, కళాశాల విద్యార్ధినులు, మహిళలకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  దీపిక ఎం పాటిల్ మాట్లాడుతూ “దిశా యాప్ మనతో ఉంటే రక్షణ మన వెంటే” అని అన్నారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం దిశా యాప్ ను రూపొందించిందని, ఈ యాప్ ను ప్రతీ మహిళ, విద్యార్ధిని తమ స్మార్ట్ ఫోనులో నిక్షిప్తం చేసుకొని, ఆపద సమయాల్లో యాప్ లోని ఎస్ ఓస్ బటన్ ను సకాలంలో నొక్కినట్లయితే, క్షణాల్లో మీరున్న ప్రదేశానికి పోలీసులు చేరుకొని, రక్షణ కల్పిస్తారన్నారు. మహిళలపై మన జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసుశాఖ మహిళలకు యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు వినూత్నంగా కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 14న పోలీసుశాఖ ఆధ్వర్యంలో రెండు పోలీసు బస్సులను ఏర్పాటు చేసి, ‘దిశా’ యాప్ చూపిన వారికి నగరంలో ఉచితంగా ప్రయాణించే ఏర్పాటు చేసామన్నారు. ఆర్టీసి కాంప్లెక్సు నుండి బాలాజీ జంక్షన్, కోట, మూడు లాంతర్లు, కొత్త పేట, పూల్ బాగ్, మిమ్స్, నెల్లిమర్ల వరకు మరోవైపు ఆర్టీసి కాంప్లెక్సు నుండి ఆర్ అండ్ బి జంక్షన్, ఆసుపత్రి జంక్షన్, కలెక్టరేట్ వరకు ‘దిశా’ యాప్ చూపిన మహిళలు, విద్యార్థినులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే విధంగా చర్యలు పట్టామన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, యాప్ పట్ల అవగాహన పొందారన్నారు.

అదే విధంగా మహిళల భద్రతకు ‘దిశా’ యాప్ లో అనేక ఫీచర్లు ఉన్నాయని, వాటి గురించి ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా ఆపద సమయంలో ఈ యాప్ ను సకాలంలో వినియోగిస్తే, తప్పనిసరిగా వారు పోలీసు రక్షణ పొందవచ్చునన్నారు. మహిళల భద్రతకు మహిళా కానిస్టేబుళ్ళు, మహిళా పోలీసులతో ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోని కళాశాలలను సందర్శించి, అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

గతంలో మహిళలపై అవాంఛనీయ సంఘటనలు జరిగిన ప్రాంతాలను గుర్తించి, వాటి పై నిఘా ఏర్పాటు చేయడం, గస్తీ తిరగడం చేస్తున్నామన్నారు. అంతేకాకుండా, గుర్తించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతోపాటు, రాత్రి సమయాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో టార్చిలైట్లుతో కాలి నడకన పెట్రోలింగు నిర్వహించడం, గతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారి పై ‘దిశా’ హిస్టరీ షీటులను ప్రారంభించి, వారి ప్రవర్తనపై నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మహిళల రక్షణకు దిశా యాప్ తో భరోసా కల్పిస్తామని ప్రజలను చైతన్య పరుస్తున్నామని, డౌన్ లోడు చేసుకున్న ‘దిశా’ యాప్ ను డిలీట్ చేయడం వలన అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయాన్ని పొందలేమన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాల్సిందిగా మహిళలకు, కళాశాల విద్యార్ధినులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక విజ్ఞప్తి చేసారు. దిశా యాప్ ముద్రించిన మాస్క్ లను కళాశాల విద్యార్దినులకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, రూరల్ సీఐ టిఎస్ మంగ వేణి,వన్ టౌన్ సీఐ జె.మురళి, టూటౌన్ సీఐ సిహెచ్. లక్ష్మణరావు, ఎస్ఐలు పి. నారాయణరావు, దుర్గాప్రసాద్, రవీంద్రరాజు, ఆర్టీసి ఆర్ఎం అప్పలరాజు, ఆర్టీసీ డీఎం బాపిరాజు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు మహిళా రక్షక్ పోలీసులు పాల్గొన్నారు.

Related posts

కల్నల్ సంతోష్ కుటుంబానికి కేసీఆర్ ఓదార్పు

Satyam NEWS

జ‌ల్‌ప‌ల్లి క‌మాన్ ద‌గ్గ‌ర యువ‌తి దారుణ‌ హ‌త్య‌..

Sub Editor

నిరాశ్రయులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment