త్వరలో జరగ బోయే పురపాలక ఎన్నికల కోసం కొల్లాపూర్ ను 20వార్డులు గా విభజన చేశారు. అయితే ఇది పద్ధతి ప్రకారం జరగలేదు. కేవలం అధికార పార్టీలో ఉన్నఎమ్మెల్యే చెప్పినట్లు అధికారులు వార్డుల జాబితా తయారు చేశారని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జూపల్లి వర్గీయులు విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం కొల్లాపూర్ పురపాలక కార్యాలయంలో అధికారులకు తమ వాదనలు వినిపించారు. జరిగిన వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలిపారు. వార్డు విభజన పద్దతి ప్రకారం జరగలేదని, కేవలం ఎమ్మెల్యే వర్గానికి అనుకూలంగా వుండే విధంగా వార్డు విభజన జరిగిందని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం అంటున్నది.
ఈ మేరకు తాలూకా ప్రచార కార్యదర్శి పసుపుల నరసింహ్మ, మాజీ సర్పంచ్ మేకల నాగరాజు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎక్బాల్, రహీం, బోరెల్లి మహేష్, కే శ్రీనివాస్ రెడ్డి, సత్యం, అన్వర్, వెంకటస్వామి కమిషనర్ వెంకటయ్యతో వాగ్వాదానికి దిగారు. మా అభిప్రాయాలను తెలుసుకోకుండా విభజన ఎలా చేశారని కమిషనర్ వెంకటయ్యను జూపల్లి వర్గీయులు ప్రశ్నించారు.
ఎమ్మెల్యే వర్గం నుండి పోటీ చేసే అభ్యర్థులు తమకు అనుగుణంగా వారి ఓట్లను వార్డులో ఉండే విధంగా చూసుకొని విభజన చేశారని మండిపడ్డారు. వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను దూరం చేసి వారికి అనుగుణంగా ఉండే ఈ విధంగానే ఈ విభజన చేశారని ఆరోపిస్తూ కమిషనర్ ముందు ఆందోళన చేశారు.
పాత మ్యాప్ ప్రకారం తయారు చెయ్యకుండా ఎలా కొత్త నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. పాత 20, 13, 7 మిగతా వార్డులను అంతా మోసపురితంగా విభజన చేశారన్నారు. ఈసారి కూడా పురపాలక ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశ్యం విభజన చేశారన్నారు. కమిషనర్ వెంకటయ్య సమాధానం ఇచ్చారు.78కొత్త జీవో ప్రకారం విభజన జరిగిందన్నారు. అభ్యంతరాలు ఉంటే తెలియచేయవచ్చన్నారు. కార్యక్రమంలో శేఖర్, బాబా, రాందాస్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.