మద్యం మత్తులో ఓ అటవీశాఖ అధికారి తన కారుతో బీభత్సం సృష్టించాడు. ప్రైవేట్ పాఠశాలకు సంబందించిన వాహనాన్ని ఢీకొట్టాడు. తృటిలో ప్రమాదం తప్పడంతో విద్యార్థులు బయటపడ్డారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలోని శివాజీ విగ్రహం వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబందించిన టాటా ఏసీ వాహనం విద్యార్థులను తీసుకుని లింగపూర్ వెళ్తుంది.
దేవునిపల్లి గ్రామం వద్ద నిజాంసాగర్ నుంచి వస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ కారు పాఠశాల వాహనాన్ని వేగంతో ఢీకొట్టింది. దాంతో విద్యార్థుల వాహనం ముందు టైర్లు పగిలిపోయాయి. కారు ముందు భాగం కొద్దిగా ధ్వంసం అయింది. అయితే ఈ ప్రమాదంలో విద్యార్థులు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. కారు నడిపిస్తున్న వెంకటస్వామి అటవీశాఖ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడని తెలిసింది.
ఈ రోజు తాను సెలవులో ఉన్నానని, తన భార్య ఆరోగ్యం బాగాలేదని, అందుకే మద్యం సేవించానని వెంకటస్వామి తెలిపాడు. విద్యార్థులను ఇతర ఆటోలో గ్రామానికి పంపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంకటస్వామిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు