నెత్తి నోరూ బాదుకుంటున్నా టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్‌ను ఆర్టీఏ అధికారులు వదలడం లేదు. మరే పనీ లేనట్లు దివాకర్ ట్రావెల్స్ పై మరోసారి కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ జిల్లా వ్యాప్తంగా ఆరు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.
సీజ్ చేసిన బస్సులను అనంతపురం ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. గతంలో కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తమ బస్సులను అక్రమంగా సీజ్ చేశారంటూ జేసీ దివాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం సీజ్ చేసిన ట్రావెల్స్ బస్సులను రిలీజ్ చేయాలంటూ వారం రోజుల క్రితం తీర్పునిచ్చింది.
ఈ తీర్పు మేరకు మూడు రోజుల క్రితమే సీజ్ చేసిన బస్సులను అధికారులు రిలీజ్ చేశారు. గతంలో సీజ్ చేసి రిలీజ్ చేసిన బస్సులనే తాజాగా మరోసారి ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఈ విషయంలో అధికారుల తీరుపై దివాకర్ ట్రావెల్స్ యాజమన్యం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కక్షసాధింపుతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తోంది.