31.2 C
Hyderabad
May 3, 2024 00: 08 AM
Slider సంపాదకీయం

సాగిల పడుతున్నా మీడియానే తిడుతున్న కేసీఆర్

#cm kcr with mask

కరోనా విషయంలో మీడియా పాత్రపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ప్రభుత్వ పరంగా జరిగిన తప్పిదాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడటం తదితర కారణాలన్నీ మీడియా మీదకు నెట్టేయడం కేసీఆర్ లాంటి వ్యక్తి చేయాల్సిన పని కాదు.

ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక్కడే చేసిన పనిని ఆయనను మంత్రిగా తీసేసిన తర్వాత ముగ్గురు చేయాల్సి వచ్చింది. ఆరోగ్య శాఖ ను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టాస్క్ ఫోర్సు పేరుతో ఆయన కుమారుడు కేటీఆర్, రోజూ వారీ ఆరోగ్య సమీక్షలు చేసేందుకు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావులు పని చేయాల్సి వచ్చింది.

దీనిపై విమర్శనాత్మకంగా కథనాలు రాసేందుకు ఎంతో అవకాశం ఉంది. అయితే ఏ మీడియా కూడా ఒకరు చేయాల్సిన పనిని ముగ్గురు చేస్తున్నారు అని రాయలేదు. అంటే రాజకీయాల జోలికి వెళ్లి మీడియా తన పని తాను చేసుకున్నట్లుగా భావించాల్సి వస్తుంది.

గాంధీ లో శవాలు కుళ్లిపోతున్నా ఎవరూ రాయలేదు… చూపలేదు కదా

గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఒక దశలో 300 శవాలు పడి ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దుర్వాసన వచ్చినా కూడా మీడియా రాలేదు. రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో ప్రభుత్వ (కేంద్ర, రాష్ట్ర) వైఫల్యాన్ని ఎత్తి చూపలేదు.

ఆక్సిజన్ తీసుకురావడానికి సైనిక విమానాలను వినియోగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే అది కూడా తమ ఘనతగానే కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకున్నా ఎవరూ విమర్శిస్తూ వార్తలు రాలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని విషయాన్ని సిద్దిపేట ఆసుపత్రిలో సిద్దిపేట టీఆర్ఎస్ మధ్య స్థాయి నాయకులే వీడియో తీసి పెట్టినా కూడా ప్రధాన స్రవంతి మీడియా చూపలేదు. సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ తెలిశాయి.

గర్భిణి మహిళను చంపేసిన కార్పొరేట్ ఆసుత్రులపై చర్యలు తీసుకున్నారా?

ఒక గర్భిణిస్త్రీని చేర్చుకోవడానికి (కరోనా పేషంట్ కాదు) ఆసుపత్రులు నిరాకరిస్తే ఆ అభాగ్యురాలు అంబులెన్సులోనే చనిపోయినా జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది తప్ప తెలుగు పత్రికలు కానీ, తెలుగు ఛానెళ్లు కానీ దానికి రాజకీయ రంగుపులమలేదు. ఒక గర్భిణి మరణానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం అని వ్యాఖ్యానాలు చేయలేదు.

కేసీఆర్ తో ఉన్న రాజకీయ అవసరాల దృష్ట్యానో, పోలీసు కేసుల భయంతోనే ఏ మీడియా కూడా చాలా విషయాలు వారి దృష్టికి వచ్చినా రాయడం లేదు. మీడియా ప్రభుత్వం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని సోషల్ మీడియాలో జనాలు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.

అయినా….. కేసీఆర్ మాత్రం కరోనా వ్యాప్తి విషయంలో మీడియా కారణంగానే ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారనే అపవాదు వేశారు. పాండమిక్ సమయంలో ఫక్తు రాజకీయ డ్రామా నడిపి ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించిన వ్యవహారంలో మీడియా ఏ మాత్రం విమర్శలు చేయలేదు.

ఇది మీడియా దౌర్బల్యం

ఇది మీడియా దౌర్బల్యం అని ప్రజలు సరిపెట్టుకున్నారు. ఇంత ‘సబ్ సర్వెంట్’ లా వ్యవహరిస్తున్న మీడియాను గేలి చేయడానికి కేసీఆర్ కు మనసు ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు. ప్రయివేటు ఆసుప్రతులు కరోనా రోగుల్ని దోచుకుతింటుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది.

నామమాత్రపు కేసులు తప్ప ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రయివేటు ఆసుప్రతుల దోపిడిని ఒక్క ఎన్ టి వి తప్ప మరే ఛానెల్ ఫోకస్ గా ప్రసారం చేయలేదు. ఎన్ టి వి కూడా ఆధారాలతో సహా చాలా కేసుల్ని బయటపెట్టింది. ఇవేవీ కేసీఆర్ కు కనిపించలేదు. 

కరోనా సమయంలో మాస్కులు పెట్టుకోవాలని ఛానెళ్లు చెబితే చాలు అంటూ కేసీఆర్ మీడియాకు హితవు పలికారు. రోడ్డు మీద పోలీసులు, మీడియా వారు తప్ప మంత్రులు గానీ, రాజకీయ నాయకులు గానీ ఎవరైనా మాస్కులు పెట్టుకోవాలని ప్రజల్ని కోరారా? లేదే?

కోట్లాది రూపాయలు సంపాదించే ఎమ్మెల్యేలు, మంత్రులు తమ సంపాదన నుంచి మాస్కులు కొని ఎవరైనా పేదవారికి ఇచ్చారా? (ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లాంటి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు) మాత్రమే ఈ పని చేశారు.

అదీ కూడా తొలి దశ కరోనా సమయంలో. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా పోతుందని చెప్పిన కేసీఆర్ మరి కార్పొరేట్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లారు? ఆయనకు కరోనా వచ్చి ప్రయివేటు ఆసుపత్రికి వెళితే సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు తప్ప ఏ ప్రధాన స్రవంతి మీడియా కూడా కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నించలేదు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కరోనా రావాలని కోరుకున్నారు… వచ్చిందా?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కరోనా రావాలని కేసీఆర్ కోరుకున్నారు. ఆయనకు రాలేదు కానీ కేసీఆర్ కు వచ్చింది. ఈ విషయాన్ని పాపం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా విమర్శించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలుగులో ప్రధాన స్రవంతి మీడియా కేసీఆర్ భజనలోనే మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిన బహిరంగ రహస్యం.

ఇంతలా మీడియా సాగిలపడి పని చేస్తున్నా ఇంకా విమర్శిస్తే ఈ ఛానెళ్లు ఏం చేయాలి? కేసీఆర్ మీడియాను తిడితే వరంగల్ సభలో పాల్గొన్న కొందరు టీఆర్ఎస్ వాళ్లు చప్పట్లు కొట్టారు. దీన్ని ఉదాహరణగా చెబుతూ మీడియాను తిడితే ప్రజలు చప్పట్లు కొడుతున్నారు అంటూ కేసీఆర్ సూత్రీకరించారు.

సాగిలపడిన ప్రధాన స్రవంతి మీడియా స్థానంలో వచ్చిన సోషల్ మీడియా కేసీఆర్ కు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులకు లక్షల కొద్దీ లైక్ లు వస్తాయి. ఈ విషయాన్ని తీన్మార్ మల్లన్నను అడిగితే మరింత వివరంగా చెబుతారు. బ్లాక్ ఫంగస్…. ఎల్లో ఫంగస్ అంటూ… కేసీఆర్ ఎగతాళిగా మాట్లాడారు. కరోనా వచ్చిన కొత్తలో కరోనా గురించి కూడా ఇలానే మాట్లాడారు.

అవసరం లేని స్టెరాయిడ్లు వాడే ఆసుపత్రులపై చర్య తీసుకోవాల్సింది ఎవరు?

కరోనా రోగులకు అవసరం లేని స్టెరాయిడ్లు వాడి ప్రజల ఆరోగ్యంతో కార్పొరేట్ ఆసుపత్రులు చెలగాటం ఆడుతున్నాయని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆరోగ్యమంత్రి కూడా అయిన కేసీఆరే చెబుతున్నారు.

మరి ప్రభుత్వం అలాంటి ‘‘పనికి రాని’’ వైద్యం అందిస్తున్న ఆసుపత్రులలో ఎన్నింటిపై చర్య తీసుకున్నారు? పనికి రాని వైద్యం చేస్తున్న ఆసుప్రతులపై చర్య తీసుకోవాల్సింది మీరే కేసీఆర్….మీడియా కాదు.

తెలుగు ఛానెళ్ల యజమానులు ఎంత మంచి వారంటే వారిని నేరుగా తిట్టినా కనీసం తమ నిరసన కూడా తెలపడం లేదు…. అంత మంచి అసమర్థులు… వారిని ఇలా తిట్టవచ్చా కేసీఆర్?

Related posts

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఎమ్మెల్యే భీరం ఆర్థిక సహాయం

Satyam NEWS

భావితరాలకు ఆదర్శం వాల్మీకి మహర్షి: రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS

Leave a Comment