ప్రజల అకాంక్షలను అనుగుణంగా సీయం కేసీఆర్ పరిపాలన కోనసాగిస్తున్నారని, ప్రజా, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, నిర్మల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ… ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వృద్దులను, మహిళలను అప్యాయంగా పలుకరిస్తూ… అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు కేసీఆర్ మెనిపెస్టో ను వివరిస్తూ మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు.
అంతకుముందు ఇంద్రకరణ్ రెడ్డి ప్రచార రథంలో బంగల్ పేట్ కు రాగా బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీగా ఆయన వెంట వచ్చారు. డప్పులతో, బ్యాండు మేళంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇస్తూ… బొట్టిపెట్టి తమ కాలనీకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. కేసీఆర్ భరోసా పేరుతో ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో 93 లక్షల మంది రేషన్‌కార్డు దారులకు బీమా సౌకర్యం, సన్న బియ్యం, సౌభాగ్య లక్ష్మి కింద రూ.3వేలు భృతి, రూ. 400లకే సిలిండర్, రైతుబంధు, ఆసరా ఫించన్ల పెంపు వంటి పథకాలను ప్రతి ఇంటికెళ్ళి వివరిస్తూ ఓట్లు అడగాలని బీఆర్ఎస్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సొమలింగయ్య అన్నట్లు కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగియక ముందే కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని, ఇప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు, సీయం అయినట్లు భ్రమల్లో ఉన్నారని కాంగ్రెస్ నాయకుల తీరుపై ద్వజమెత్తారు.
రైతుబంధు ఆపాలని కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పుతారని వెల్లడించారు. రైతు వ్యతిరేఖ కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని కోరారు. కాంగ్రెస్ మెనిపెస్టోను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. నిర్మల్ కాంగ్రెస్ స్థానిక అభ్యర్థికి 15 ఏళ్ళుగా నియోజకవర్గం గుర్తుకు రాలేదని, ఇనేళ్ళు ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఇక బీజేపీ కేవలం మతం ఆధారంగా ఓట్లు దండుకోవాలని చేస్తుందని, ప్రజలు బీజేపీని నమ్మె పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
బంగల్ పేట్ లోని మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.