26.7 C
Hyderabad
May 3, 2024 10: 08 AM
Slider ప్రత్యేకం

విజయసాయి రెడ్డి ట్రస్టు లావాదేవీలపై విచారణ జరపాలి

#raghuramakrishnam raju

విశాఖపట్నం భూ కుంభకోణంలో వేలాది ఎకరాల భూములు ఆక్రమించిన వారిని పిలిపించుకుని ‘‘సెటిల్ మెంట్’’ చేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల వ్యవహారంపై పూర్తి స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు కోరారు.

అక్రమ భూమిలో తనకు వాటా ఇవ్వాలని ‘‘ఆయన’’ చేస్తున్న డిమాండ్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిపోతున్నదని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నిజమైన ప్రజానాయకుడు అనిపించుకోవాలంటే తక్షణమే విశాఖ భూ కుంభకోణంలోని నిందితులను ‘‘బ్లాక్ మెయిల్’’ చేస్తున్న ‘‘ఆయన’’పై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిర్వహిస్తున్న ప్రగతి భారతి ట్రస్టు లావాదేవీలపై కూడా విచారణ జరపాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. రఘురామకృష్ణంరాజు లేఖ పూర్తి పాఠం:

ముఖ్యమంత్రి గారూ,

కోట్లాది రూపాయల విలువైన విశాఖపట్నం భూ కుంభకోణంపై, మన ప్రభుత్వం, ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేసిన విషయాన్ని మీ జ్ఞాపకాల దొంతర నుంచి బయటకు తీసి మళ్లీ మీకు గుర్తు చేయాలని నేను భావిస్తున్నాను. 2017 జూన్ లో ఈ విశాఖ పట్నం భూ కుంభకోణం బయటకు వచ్చింది. విశాఖపట్నం జిల్లాలో ఎన్నో ఎకరాల భూమి ఆక్రమణలకు గురికావడం, భూ రికార్డులను తారుమారు చేయడం తదితర అంశాలపై వందలాది ఫిర్యాదులు వచ్చి ఉన్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ SIT లో పదవి విరమణ చేసిన అధికారిణి వై వి అనూరాధ, రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి టి.భాస్కరరావు సభ్యులుగా ఉన్నారు. ఈ అధికారుల బృందం మన ప్రభుత్వానికి తన నివేదికను కూడా సమర్పించింది.

మధురవాడ, కొమ్మాది ప్రాంతాలలోని వేలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు వెలికివచ్చిన ఈ కుంభకోణం అప్పటిలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సంచలనం కలిగించింది. దీనిపై అప్పటి ప్రభుత్వం ఒక SIT ను ఏర్పాటు చేసింది. 2018 నవంబర్ లో ఆ తొలి SIT అప్పటి ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. భూ కుంభకోణం బయటకు వచ్చిన కొత్తలోనే పోలీసులు పలువురు అధికారులను అరెస్టు చేశారు కూడా. వీరిలో తాసిల్దార్ నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకూ ఉన్నారు.

వీరంతా రికార్డులు తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులకు ఇందులో భాగస్వామ్యం ఉందని మీరు పలుమార్లు ఆరోపించారు. నిజా నిజాలు నిగ్గుతేల్చేందుకు సీబీఐ లాంటి సంస్థ దర్యాప్తు అవసరమని కూడా చెప్పారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల మన పార్టీ ఇన్ చార్జి SIT నివేదికలో పేర్కొన్న వారిని ఒక్కొక్కరిగా పిలిచి సెటిల్ మెంట్లు చేసుకుంటున్నారని ఇప్పుడు ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. SIT నివేదికలో పేర్లు ఉన్న వారిని పిలిపించుకుని వారి నుంచి వివాదాస్పద భూమిలో పెద్ద వాటా తనకు ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఈ సందర్భంగా మరొక ముఖ్య విషయంపై మీరు దృష్టి పెట్టాల్సి ఉంది. గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి చెందిన ప్రగతి భారతి ట్రస్టు లావాదేవీలపై పూర్తి వివరాలు ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం వుంది. ఆ ట్రస్టు ఎంత మేరకు నిధులు సేకరించింది? ఆ నిధులను దానం చేసిన వారు ఎవరు? ఆ ట్రస్టు పెట్టిన ఖర్చులు ఏమిటి? లాంటి అతి ముఖ్యమైన అనేక వివరాలను బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఇలాంటి విషయాలలో గోప్యత పాటించకుండా ప్రజలకు నిజాలను బహిరంగంగా వెల్లడించడం ద్వారా మన పార్టీ ప్రతిష్ట ఇంకా బాగా పెరుగుతుంది.

ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఉండనే ఉండదని గట్టిగా వాదించే మనం, విశాఖ భూ కుంభకోణంలో జరుగుతున్న పరిణామాలపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజధాని మార్పు తదనంతర పరిణామాల నేపథ్యంలో విశాఖ భూ కుంభకోణం విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పేర్కొన్న వ్యక్తులు, అంశాలతో బాటు ఈ తాజా ఆరోపణలపై కూడా విచారణ జరపాలి.

భూ కుంభకోణంలో పాలుపంచుకున్న రాజకీయ నాయకులపైనా, అధికారులపైనా చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం. రాజధాని మార్పు జరుగుతుందో లేదో ఇప్పటి వరకూ తెలియకపోయినా కూడా విశాఖపట్నం అనేది ఎప్పటి నుంచో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అలాంటి అతి ముఖ్యమైన నగరంలో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉన్నది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ లావాదేవీలలో ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి స్వార్ధపూరిత ఆలోచనా లేదని ప్రజలకు నమ్మకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి భూ భాగోతాలపై తక్షణమే చర్య తీసుకుంటే మీరు నిజమైన ప్రజానాయకుడు అనే భావన ప్రజలలో మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

మైనాస్వామికి అరుదైన గుర్తింపు

Satyam NEWS

High alert: టెర్రర్ లింక్ కారణంగా పిఎఫ్ఐ పై నిషేధం  

Satyam NEWS

Analysis: ఇప్పుడు వస్తున్న బర్డ్ ఫ్లూ ప్రమాదమా?

Satyam NEWS

Leave a Comment