33.4 C
Hyderabad
March 9, 2021 15: 04 PM
Slider ప్రత్యేకం

Analysis: ఇప్పుడు వస్తున్న బర్డ్ ఫ్లూ ప్రమాదమా?

#BirdFluInAP

కరోనా వైరస్ కలకలం ఇంకా పూర్తిగా సమసిపోకముందే “బర్డ్ ఫ్లూ” అంటూ కొత్త కలకలం మొదలయింది. దీనిపై రకరకాలుగా ఊహగానాలు, ఆందోళనలు వ్యాప్తి చెందుతున్నాయి. ఫ్లూ వ్యాప్తి కంటే ఈ వ్యాప్తి ఎక్కువై పోతోంది. ఇప్పటి దాకా అందిన నివేదికలను అనుసరిస్తూ నిజానిజాలు తెలుసుకోవడం అవసరం.

బర్డ్ ఫ్లూ  అంశం మనదేశంలో కొత్తదేమీ కాదు.2005-2006 మధ్యే దీన్ని మనం గుర్తించాం. శాస్త్రీయంగా దీని పేరు  ” ఏవియన్ ఇన్ ఫ్లూయంజా”. అప్పుడు పలు రాష్ట్రాల్లో కేసులు నిర్ధారణ కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సూచించింది. నియంత్రణ కోసం పలు సూచనలు చేసింది.

అప్పటిలోనే సంచలనం సృష్టించింది

తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళికలను  తయారు చేస్తూ, ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ అప్రమత్తం చేయడంతో అది సమసి పోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ అంశం మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. పౌల్ట్రీ కేంద్రాల్లో సరియైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, ఆయా ప్రాంతాల్లో క్రిమి సంహారక మందులు వాడకపోవడం నమూనాలాను సేకరించి నిర్ధారణ పరీక్షలు సక్రమంగా చెయ్యక పోవడంతో అప్పట్లో ఇది విజృంభించింది.

పక్షులకు ప్రాణాంతక  వ్యాధిగా రూపాంతరం చెందింది. అయితే, ఇది పక్షులు, జంతువులకు వ్యాపించింది కానీ, మానవులకు సంక్రమించిన దాఖలాలు లేవని అప్పట్లోనే కేంద్ర పాడి పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కలుషిత పౌల్ట్రీ ఉత్పత్తుల వల్ల ఈ వైరస్ మానవులకు వ్యాప్తి చెందుతాయని చెప్పడానికి ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది.

జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది

అయితే, పశు సంవర్ధక శాఖ పలు జాగ్రత్తలు తెలియచెప్పింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, క్రిమి సంహారక పద్ధతులను అవలంబించడం, ఆహార శుద్ధి ప్రమాణాలను పాటించడంలో అప్రమత్తంగా ఉండడం, పచ్చి గుడ్డు తినకుండా ఉండడం, ఉడికించిన మాంసాన్నే తీసుకోవడం మొదలైన చర్యల వల్ల మనుషులకు ఎటువంటి నష్టం జరగదని, అదే విధంగా వైరస్ ను అరికట్టవచ్చునని తెలిపింది.

వీటిని పాటించడం వల్ల తక్కువ కాలంలోనే వైరస్ నియంత్రణలోకి రావడంతో ప్రజలు బర్డ్ ఫ్లూ అంశాన్ని ఎప్పుడో మరచిపోయారు.ప్రస్తుతం, బర్డ్ ఫ్లూ ఆందోళన మళ్ళీ పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ వ్యాధి కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఆరు రాష్ట్రాలలో ఇప్పటికే ఆనవాలు

కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల ప్రదేశ్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ వ్యాధి వ్యాప్తిలో ఉన్నట్లుగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, అనుమానస్పదంగా మరణించిన పక్షులను గుర్తిస్తున్నారు. పరీక్షల నిమిత్తం వాటి నమూనాలను ల్యాబ్ లకు పంపిస్తున్నారు.

ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో క్రిమి సంహారక ప్రక్రియ కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరలోనే కట్టడి దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో  పౌల్ట్రీ యజమానులకు, ప్రజలకు కలిగే ఆందోళనలను తొలగించడానికి అవగాహనా కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.

అధిక ఉష్ణోగ్రత దగ్గర బర్డ్ ఫ్లూ బతకదని గతంలోనే తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) నేడు కూడ అదే వ్యాఖ్యలు  చేస్తోంది.పక్షుల్లో ప్రాణంతకమైన బర్డ్ ఫ్లూ కేవలం కొన్ని సందర్భాల్లోనే మానవులకు సోకే ప్రమాదముందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం లేదు

కేంద్ర పాడి, పశు సంవర్ధక శాఖ ఇప్పటి వరకూ సూచించిన జాగ్రత్తలను పాటిస్తే, మనుషులకు ఎటువంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏవియన్ ఇన్ ఫ్లూయంజా టైప్ -ఏ వైరస్ మనదేశంలో బర్డ్ ఫ్లూగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు, బాతులతో పాటు టర్కీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు.

మన దేశ వాతావరణం దృష్ట్యా విదేశీ పక్షులెన్నో మన దేశానికి వలస వస్తూ ఉంటాయి. అది కూడా చలికాలంలో వచ్చే వలస పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ మన దగ్గర వ్యాప్తి చెందుతోందని నివేదికలు చెబుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఏ ప్రమాదం ఉండదనీ, ముఖ్యంగా వ్యక్తుల నుండి వ్యక్తులకు సోకే లక్షణం లేదని డబ్ల్యూ హెచ్ ఓ కూడా అంటోంది.

వైరస్ సోకిన పక్షులను నేరుగా తాకడం, ఉడికించని మాంసం తినడం ద్వారానే మనుషులకు సోకే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ, మనుషులకు సోకినా ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి తప్ప పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం కలవరం సృష్టిస్తున్న బర్డ్ ఫ్లూ విషయంలో జాగ్రత్తలు పాటించడమే శ్రేయస్కరం. అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్ధమవుతోంది. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటే సరిపోతుంది.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

అరాచ‌క శ‌క్తుల కుట్ర‌లు.. పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Sub Editor

కేస్-30 చిత్ర బృందానికి సుధీర్ బాబు అభినందనలు

Satyam NEWS

50 వేల కుటుంబాలను రోడ్డున పడేసిన జగన్ సర్కార్

Satyam NEWS

Leave a Comment