కొల్లాపూర్ పురపాలక కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడ జరుగుతున్న వ్యవహారాలపై సీరియస్ అయ్యారు. సిస్టం ప్రకారం పని చేయాలి తప్ప ఇష్టారీతిన పని చేయడం సరికాదని ఆయన చెప్పారు. కొల్లాపూర్ మునిసిపాలిటీలో జరుగుతున్న విషయాలపై త్వరలో నే పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని ఆయన అన్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు అకస్మాత్తుగా మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. కొల్లాపూర్ పురపాలక అభివృద్ధి కి సంబంధించిన ముఖ్య పత్రాలను ఆయన పరిశీలించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్స్ ఏవిధంగా చేస్తున్నారు? కార్యాలయంలో స్టాఫ్ ఎంత? పర్మనెంట్ ఎంత? ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఎంత? అని ఆయన ప్రశ్నించారు. రాజా బంగ్లా చుట్టూ ఉన్న ప్రాంతంలో లేఅవుట్ పర్మిషన్ లేని వాటిపై సంతకం ఎలా పెడతావు అంటూ మునిసిపల్ కమిషనర్ వెంకటయ్యను ఆయన ప్రశ్నించారు. కోర్టులో ఉన్న సంగతి తెలిసి ప్లాట్లకు అనుమతి ఎలా ఇస్తావు? అంటూ ఆయన సూటిగా కమిషనర్ ను జూపల్లి ప్రశ్నించారు. బాధ్యతగల కుర్చీలో కూర్చుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాజకీయాల వత్తిడులు మస్తువుంటాయి..మీరు బాధ్యత గా వ్యవహరించాలి అంటూ కమీషనర్ కు మాజీ మంత్రి హితవు చెప్పారు. అవసరమైతే కార్యాలయంపై దండయాత్ర చేయాల్సి వస్తుంది అంటూ రాష్ట మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.
