24.2 C
Hyderabad
July 15, 2024 00: 56 AM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ లో మొండిపట్టే బదిలీకి కారణమా?

l v subrahmanyam

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్ వి సుబ్రహ్మణ్యం ను మరింత కాలం కొనసాగిస్తే రాజకీయ పరమైన చిక్కులు కూడా వస్తాయనే ఉద్దేశ్యంతోనే అత్యంత అవమానకరమైన రీతిలో సాగనంపారనే చర్చ నడుస్తున్నది. ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో తాడికొండ అసెంబ్లీ ఎస్ సి రిజర్వుడు నియోజకవర్గం నుంచి వైసిపి తరపున గెలిచిన ఉండవెల్లి శ్రీదేవి కుల వివాదంలో చిక్కుకున్న వ్యవహారం ఎల్ వి సుబ్రహ్మణ్యం చేతికి రావడమే ఆయన బదిలీకి కారణమనే అంశం వెలుగులోకి వచ్చింది.

ఉండవెల్లి శ్రీదేవి ఎస్ సి నియోజకవర్గం నుంచి ఎస్ సి సర్టిఫికెట్ తో పోటీ చేశారని అయితే ఆమె క్రిష్టియన్ అయినందున ఆమె ఎన్నిక చెల్లదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏ ఎస్ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వ్యవహారం చినికి చినికి గాలి వాన అయిన చందంగా మారింది. సంతోష్ ముందుగా ఈ ఫిర్యాదును జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ కు పంపారు. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు. ఆయన మళ్లీ సంతోష్ ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కే పంపారు.

జిల్లా కలెక్టర్ నుంచి సమాధానం రాకపోవడం, మళ్లీ కేసు జిల్లా కలెక్టర్ కే చేరడంతో సంతోష్ ఇక చేసేదేమీ లేక భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం కు నేరుగా పంపారు. పరిపాలనా సంబంధిత విషయాలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాజ్యాంగ సంబంధిత విషయాలను నేరుగా గవర్నర్ కు పంపడం రాష్ట్రపతి కార్యాలయం చేసే సాధారణ ప్రక్రియ.

రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చే అంశాలు దాదాపుగా రాష్ట్రపతి ఆదేశాలతో సమానం. ఉండవెల్లి శ్రీదేవి విషయంలో రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు కాపీని సాధారణ పరిస్థితుల్లో అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత జిల్లా కలెక్టర్ కు పంపి విచారణ జరిపించి సమాచారం తెప్పించుకుని రాష్ట్రపతి కార్యాలయానికి నివేదిక పంపుతారు. అయితే ఫిర్యాదులో సంబంధిత జిల్లా కలెక్టర్ విచారణ జరపలేదని ఉన్నందున మళ్లీ అదే కలెక్టర్ కు పంపడానికి ఎల్ వి సుబ్రహ్మణ్యం మొగ్గు చూపలేదు.

స్వతంత్రంగా ఒక ప్రత్యేక అధికారిని నియమించి కేసు పూర్వాపరాలను రాష్ట్రపతికి నివేదించాలని ఎల్ వి సుబ్రహ్మణ్యం నిర్ణయించుకున్నారు. అలా చేయవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ఐఏఎస్ అధికారి ఎల్ వి సుబ్రహ్మణ్యంపై వత్తిడి తీసుకువచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రపతి నుంచి వచ్చిన ఆదేశాలకు తాను తూతూ మంత్రంగా సమాధానం చెప్పలేనని, పూర్తి విషయాలు తనకు తానుగా తెలుసుకున్న తర్వాతే నివేదిక పంపుతానని ఎల్ వి కరాఖండిగా ఆయనతో సమాధానం చెప్పారని తెలిసింది.

తాను క్రైస్తవరాలిని అని అంగీకరించిన ఉండవెల్లి శ్రీదేవి బిసి కిందికి వస్తారు కానీ ఎస్ సి గా ఉండే వీలులేదని సంతోష్ వాదన. మతానికి కులానికి సంబంధం లేదని ఉండవెల్లి శ్రీదేవి వాదన. తన తండ్రి ఎస్ సి అయినందున తాను ఎస్ సి కిందికే వస్తానని తన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లలో ఎస్ సి అనే ఉందని ఆమె చెబుతున్నారు. రాజ్యాంగంలోని (షెడ్యూల్డ్ క్యాస్ట్ ల) ఆర్డర్ 1950 ప్రకారం హిందూ మతానికి కాకుండే వేరే మతానికి చెందిన వారు షెడ్యూల్డ్ కులం నుంచి వైదొలగినట్లే భావించాలి అని ఉన్నదని సంతోష్ చెబుతున్నారు. క్రైస్తవ మతంలోకి మారిన దళితులను బిసి సి గా మాత్రమే గుర్తిస్తారు. ఈ పరిస్థితుల్లో ఎల్ వి సుబ్రహ్మణ్యం వాస్తవ పరిస్థితుల ఆధారంగా రిపోర్టు పంపితే రాజకీయంగా సమస్యలు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. మరో ఏడు గురు ఎస్ సి ఎంఎల్ ఏల పై కూడా ఇదే తరహా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతర చిన్న చిన్న వివాదాలతో పాటు ఇది పెద్ద వివాదం కావడంతో ఎల్ విని అకస్మాత్తుగా బదిలీ చేశారనే వాదన బలంగా వినిపిస్తున్నది.

Related posts

మూడు రాజధానుల కోసం 101 టెంకాయలు కొట్టి పూజలు

Satyam NEWS

పోడు పట్టాల పంపిణీలో అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి

Murali Krishna

మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో దొరికింది ఎంతో తెలుసా?

Satyam NEWS

Leave a Comment