రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కేంద్రానికి సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు: కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా బసవన్న కుంట గ్రామానికి చెందిన ఆలీ కుటుంబ సభ్యులు మొత్తం 12 మంది KA 34 P 7323 గల ఏర్టిగా కార్ వాహనంలో హైదరాబాద్ కు బయలుదేరారు. మార్గమధ్యంలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో కొత్తకోట బైపాస్ సమీపంలో టెక్కలి దర్గా వద్ద డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడిపి చెట్టుకు ఢీ కొట్టాడంతో అక్కడికక్కడే 5 గురు మృతి చెందగా మిగతావారు గాయపడ్డారు.
ఫాతిమా బి 85, అబ్దుల్ రహమాన్ 65, బస్ర 2, మర్యాబి 5 సంవత్సరాలు కాగా వసిత రఫిల్ 7 నెలల పాప అక్కడికక్కడే మృతి చెందారు. కాగా షాజహాన్ బేగం, అబిబ్ హసన్, హుస్సేన్ అని, ఖురిమున్నిస, షఫీ వాహనం నడుపుతున్న ఆలీకి తీవ్రగాయాలు కాగా మరొకరు ప్రమాదం నుండి బయటపడ్డారు. సమాచారం అందుకున్న కొత్తకోట పోలీస్ లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితులు విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పెళ్లిచూపులు సోమవారం హైదరాబాదులో జరగవలసి ఉండటంతో వారు తమ యొక్క వాహనంలో బయలుదేరి మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు.
ఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి
ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను సంఘట స్థలానికి వెళ్లి డీఎస్పీ, సీఐలతో కలిసి అన్ని కోణాలలో విచారించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఇప్పటికే పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్