మాల్యా ఆస్తులన్నీ బ్యాంకులపరం కావడం తో ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నవిజయ్ మాల్యా ఓ ఫ్రెంచ్ దీవిలో కొనుగోలు చేసిన అత్యంత విలాసవంతమైన భవనం ఇప్పుడు అమ్మకానికి పెట్టాడు.12 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ కు చెందిన ఇలీ సెయింటీ మార్గరెట్ దీవిలో ఉన్న లీ గ్రాండ్ జార్డైన్ అనే భవంతిని మాల్యా కొనుగోలు చేశాడు. ఈ భవనం కొనడానికి గిజ్మో ఇన్వెస్ట్ కంపెనీ పేరుతో ఖతార్ నేషనల్ బ్యాంక్ అన్స్ బాచర్ అండ్ కో యూనిట్ నుంచి 30 మిలియన్ డాలర్ల మేర రుణం తీసుకున్నాడు.
అందుకోసం ఇంగ్లాండ్ లో ఉన్న లగ్జరీ బోటును ష్యూరిటీగా పెట్టాడు. ఆ తర్వాత కాలంలో దివాలా తీసిన ఈ మాజీ లిక్కర్ కింగ్ రుణ కాలపరిమితి పెంచాలని బ్యాంకును కోరాడు.
మాల్యా పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నించిన ఖతార్ బ్యాంకు వర్గాలు లీ గ్రాండ్ జార్డైన్ భవంతిని తనిఖీ చేశాయి. అప్పటికే ఆ భవనం శిథిలావస్థకు దగ్గరవుతుండడంతో బ్యాంకు మాల్యాపై దావా వేసింది. మాల్యా లగ్జరీ బోటును అమ్మేందుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరింది. అప్పటికీ రుణం తీరే పరిస్థితి కనిపించకపోవడంతో తాజాగా లీ గ్రాండ్ జార్డైన్ భవనాన్ని అమ్మకానికి పెడుతున్నట్టు ఖతార్ బ్యాంకు వెల్లడించింది.
కాగా, ఈ భవనంలో 17 బెడ్ రూములు, ఓ సినిమా థియేటర్, నైట్ క్లబ్, హెలిప్యాడ్ ఉన్నాయి. చాలాకాలంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో దెబ్బతిన్నట్టు ఖతార్ బ్యాంకు అధికారుల పరిశీలనలో తేలింది.కాగా ఒకప్పుడు లిక్కర్ సామ్రాజ్యాన్ని శాసించినఆయన ఇప్పుడు పరాయి పంచన బతుకుతున్నాడు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వ్యవహారంలో బ్రిటన్ పారిపోయిన మాల్యా లండన్ లో తలదాచుకున్నాడు.