కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయం చెప్పలేదని, ఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ పార్లమెంటు సభ్యులు ఉన్నారా? లేరా? అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ నీళ్ల మూటలేనని ఆయన అన్నారు. ఏపీ పార్లమెంట్ సభ్యులు ఇంట్లో పులులు ఢిల్లీలో పిల్లులుగా మారారని ఆయన విమర్శించారు.
దేనికోసం వైసిపి ఎంపిలు ఈ విధంగా బీజేపి సర్కార్ కు భయపడుతున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ పథకం ప్రకారం భారత దేశ ప్రజల సంపదగా భావించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను, అనుబంధ సంస్థలను ఒక్కొకటిగా ప్రైవేట్ పరం చేయడం దేశ భవిష్యత్తు కు అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వేస్, బిఎస్ఎన్ఎల్, పోస్టల్ లలో నష్టాలను బూచిగా చూపి ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహిస్తున్నారని ఇప్పుడు ఎల్ఐసి ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
ఎల్ఐసి ప్రైవేట్ పరం చేస్తే లక్షల కోట్లు పెట్టుబడులు,షేర్లు,డిపాజిట్లు పెట్టుబడిగా పెట్టిన సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు భరోసా ఎవరు కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆదాయపు పన్ను మినహాయింపు స్లాబ్ లలో సైతం మెలికలు పెట్టిన బిజెపి ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.