40.2 C
Hyderabad
April 29, 2024 15: 44 PM
Slider చిత్తూరు

తిరుపతిలో రోజు రోజుకూ మారుతున్న రాజకీయం

#Politics

ప్రముఖ పుణ్యక్షేత్రం, నూతన జిల్లా కేంద్రం అయిన తిరుపతి ఎమ్మెల్యే స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం తిరుపతి MLA కు అందరికన్నా ఎక్కువగా ఉంటుంది.

తిరుపతి ఎమ్మెల్యే అని చెప్పుకోవడం కూడా హుందాగా ఉంటుంది. అందుకే ఎవరు కొత్తగా పార్టీ ప్రారంభించినా, తిరుపతి నుండి పోటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ ఆవిర్భావంలో పార్టీ అధినేత NTR తిరుపతి నుంచి పోటీచేసి విజయం సాధించారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ ప్రకటన కూడా తిరుపతిలోనే జరిగింది. ఆ పార్టీ అధినేత చిరంజీవి కూడా తిరుపతి నుండి పోటీ చేసి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి నుండి ప్రారంభించి, తిరిగి తిరుపతిలోనే ముగించడం ఆనవాయితీగా వస్తోంది.

ఎంతో ప్రాముఖ్యత కలిగిన తిరుపతి అసెంబ్లీ స్థానం మీద అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా దృష్టిని సరిస్తున్నాయి. YCP తరఫున ఈ పర్యాయం ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు, తిరుపతి కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. రానున్న ఎన్నికలలో టీడీపీ, భాజాపా, జనసేన కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. రెండు రోజుల కిందట రాష్ట్రంలో పర్యటించిన భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు ఈ విషయంలో కలిసి పోటీ చేయడం మీద స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

2019 ఎన్నికల్లో YCP గాలిలో కూడా తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 708 ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. కావున ఈ పర్యాయం టీడీపీ అభ్యర్థి పోటీ చేయాలని తెలుగు తమ్ముళ్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. అలా కాని పక్షంలో పార్టీకి రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధం అవుతున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా తిరుపతి సీటు తమదేనని, అభ్యర్థి ఎంపికలో జనసేన నేతలు తలమునకలై ఉన్నారు. ఇక పొత్తులో భాగంగా తిరుపతి సీటును భాజపాకు ఇవ్వడానికి చంద్రబాబు ఢిల్లీలో ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆధ్యాత్మిక నగరిలో మనుగడ చాటుకోవలని బీజేపీ భావిస్తోంది.

తిరుపతి స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇలా నాలుగు పార్టీలు తిరుపతి అసెంబ్లీ సీటు మీద కన్ను వేశాయి. ఉన్న స్థానాన్ని నిలుపు కోవాలని వైసిపి, తిరిగి పట్టు సాధించాలని టిడిపి పట్టుదలతో ఉన్నాయి. పొత్తు ఖరారు అయితే సీటు తమదేనని జనసేన భావిస్తుండగా బిజెపి కూడా ఆశ పెట్టుకున్నది.

ఇక్కడ ప్రధానంగా కులాల ఆధారంగానే అభ్యర్ధుల ఎంపిక జరుగుతుందని తేలిపోయింది. ఈ నేపథ్యంలో నాలుగు పార్టీల నేతలు తమకు అనుకూలంగా విశ్లేషణలు చేసి వాదనలు వినిపిస్తున్నారు. ఎవరు ఎన్ని వాదనలు వినిపించినా కులం చుట్టూ తిరుపతి ఎన్నికలు తిరుగుతున్నాయి.

1952 లో ఏర్పడిన నియోజక వర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు సాధారణ, మూడు సార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. మొత్తం 17 సార్లు జరిగిన ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసిపి, ఒకసారి స్వతంత్ర పార్టీ( తరువాత కాంగ్రెస్ లో కలసి పోయారు) అభ్యర్ధులు గెలిచారు. ఆరు సార్లు టిడిపి, ఒక సారి పీఆర్పీ అభ్యర్గి విజయం సాధించారు. కులాల వారీగా చూస్తే రెడ్లు, బలిజ సామాజిక వర్గీయులు చెరి ఏడు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. బ్రాహ్మణ, ఎస్సీ, కమ్మ వారు ఒక్కొక్క సారి విజయం సాధించారు.

నియోజక వర్గం పునర్విభజన జరిగిన తరువాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పీఆర్పీ అధినేత చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి పై 15,930 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కందాటి శంకర్ రెడ్డికి 21,307 ఓట్లు వచ్చాయి. ఇద్దరు రెడ్లు పోటీ పడటం వల్ల కాపు (బలిజ) సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి గెలిచారని పరిశీలకులు భావిస్తున్నారు.

చిరంజీవి రాజీనామా వల్ల 2012లో జరిగిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఎం వెంకట్రమణ పై 17,975 ఓట్ల మెజారిటీ సాధించారు. టిడిపి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి 30,452 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఇద్దరు బలిజ సామాజిక వర్గం అభ్యర్ధులు పోటీ చేయడంతో రెడ్డి విజయం సాధించారని అంటున్నారు.

2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వెంకట్రమణ వైసిపి అభ్యర్థి కరుణాకర్ రెడ్డిపై 41,539 ఓట్ల మెజారిటీ సాధించారు. వెంకట్రమణ మరణంతో 2015 జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య సుగుణమ్మ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవిపై 116,524 ఓట్ల భారీ మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. ఆ ఎన్నికల్లో సానుభూతితో వైసిపి పోటీ చేయలేదు.

2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి కరుణాకర్ రెడ్డి, టిడిపి అభ్యర్థి సుగుణమ్మ పై 708 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. జనసేన అభ్యర్ధి చదలవాడ కృష్ణమూర్తికి 12,315 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పోటీ చేయడం వల్ల రెడ్డికి లాభం చేకూరిందని భావిస్తున్నారు.

ఈ లెక్కలు కట్టడం వల్లనే కరుణాకర్ రెడ్డి యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శిరీష యాదవ్ కు నగర మేయర్ గా అవకాశం కల్పించారు. అలాగే బలిజ సామాజిక వర్గానికి చెందిన ముద్ర నారాయణను డిప్యూటీ మేయర్ చేశారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు అభినయ రెడ్డిని వైసిపి అభ్యర్ధిగా పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది.

ఇదిలా ఉండగా టిడిపి టిక్కెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ భావిస్తున్నారు. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన ఊకా విజయకుమార్, జె బి శ్రీనివాస్ తో పాటు పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ టిడిపి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఒక వేళ రెడ్డిని రంగంలో దింపాలని భావిస్తే రాష్ట్ర నేతలు సూరా సుధాకర్ రెడ్డి, మబ్బు దేవ నారాయణ రెడ్డి, ఎన్ బి సుధాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

పొత్తులో భాగంగా జిల్లాకు ఒక స్థానం ఇచ్చినా తిరుపతి జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక వేళ రెడ్డికి ఇవ్వాల్సి వస్తే టిడిపి రాష్ట్ర నాయకులలో ఒకరిని పార్టీలో చేర్పించికుని టిక్కెట్టు కేటాయించి అవకాశం ఉందని సమాచారం.

కాగా బిజెపి నేత టిటిడి పాలకమండలి మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి కూడా టిక్కెట్టు ఆశిస్తున్నానని తెలిసింది. ప్రతి పక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా రెడ్డిని పోటీ పెడితే సులభంగా వైసిపి అభ్యర్థిని ఓడించి వచ్చని ఆ సామాజిక వర్గం నేతలు అంటున్నారు. బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున తమకే టిక్కెట్టు ఇవ్వాలని ఆ వర్గం వారు పట్టుబడుతున్నారు. ఏ పార్టీ తిరుపతి అసెంబ్లీ సీటు దక్కించుకుంటుందో, ఎవరు విజయం సాధిస్తారో వేచిచూద్దాం.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్ట్, చిత్తూరు

Related posts

ఆస్రా పోస్టర్ ఆవిష్కరించిన న్యాయమూర్తి

Satyam NEWS

అవసరమైన ప్రత్తి మిరప పంటలకు విత్తనాలు సిద్ధం చేయాలి

Satyam NEWS

ఘనంగా సంక్రాంతి పండగ ముగ్గుల పోటీలు

Bhavani

Leave a Comment