38.2 C
Hyderabad
April 29, 2024 22: 46 PM
Slider సంపాదకీయం

గ్రూపు రాజకీయాల నుంచి కాంగ్రెస్ గట్టెక్కేనా

#revanthreddy

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియమితులైన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నాయకులందరూ కలిసి పని చేయాల్సి ఉండగా సీనియర్ల పేరుతో పార్టీని కుళ్లబొడిచే బ్యాచ్ తయారైంది.

తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లమైన తమపై పెత్తనం చేయడం ఏమిటని సీనియర్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. కొందరైతే బహిరంగంగా విమర్శలు చేస్తూ పార్టీని నాశనం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ లో ఏర్పాటు చేసిన ఏ బహిరంగ సభ కూడా ఫ్లాప్ కాలేదు. దాదాపుగా అన్ని బహిరంగ సభలకు జనం విరగబడి వచ్చారు.

స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించకపోయినా కూడా ప్రజలు తరలి రావడంతో రేవంత్ రెడ్డి ప్రభావం ఏమిటో కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గానికి అర్ధం అయింది. అయితే రేవంత్ రెడ్డి ప్రాభవాన్ని సహించలేని కాంగ్రెస్ నాయకులు కొందరు కుట్రలు ప్రారంభించారు. జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో తరచూ తలెత్తుతున్న అసమ్మతిని రేవంత్ రెడ్డి తనకున్న ప్రజాబలంతో అడ్డుకుంటున్న నేపథ్యంలో సూపర్ సీనియర్లు రంగంలో దిగారు.

ఈ సూపర్ సీనియర్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించాలని పైకి చెబుతూ రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా గ్రూపులను బలోపేతం చేసే కార్యక్రమంలో ఉన్నారు. సూపర్ సీనియర్ల పేరుతో ఇప్పుడు రంగంలో దిగిన ఏ ఒక్కరూ కూడా ప్రజా క్షేత్రంలో లేరు. ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచిన వారు కాదు. అలాంటి వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గంతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారు.

ఈ సూపర్ సీనియర్ల ముఠాకు ఆంధ్రాకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు నేతృత్వం వహిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ నాయకులతో విస్త్రత సంబంధాలు ఉన్న ఈ సూపర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని పొందాలంటే అందరూ కలిసి ఉండాలని పైకి చెబుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు కాంగ్రెస్ నాయకులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాహుల్ గాంధీ తన పూర్తి మద్దతును రేవంత్ రెడ్డికే ప్రకటిస్తూ వస్తున్నారు. సూపర్ సీనియర్లు అందరూ కలిసి రాహుల్ గాంధీ మనసు మార్చాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఒక పక్కా ప్రణాళిక కూడా రూపొందించినట్లు చెబుతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి ఆ తర్వాత రేవంత్ రెడ్డి పని పట్టాలని వారు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సూపర్ సీనియర్లు కూడా తమ వంతు ప్రయత్నాలు ప్రారంభిచారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ముందు పెట్టి రేవంత్ రెడ్డిని చావుదెబ్బ తీయాలని సూపర్ సీనియర్లు వ్యూహం రూపొందించారు. మునుగోడులో తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని బీజేపీ పక్షాన  గెలిపించుకోవడానికి కృతనిశ్చయంతో ఉన్న వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ప్రభావం చూపించకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉన్నా కూడా సూపర్ సీనియర్ల పేరుతో కొందరు నాయకులు చేస్తున్న ప్రయత్నాలతో పార్టీ పూర్తి అయోమయ పరిస్థితిలోకి వెళ్లిపోతున్నది. పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా రేవంత్ రెడ్డి చాలా శక్తులతో పోరాటం చేయాల్సి వస్తున్నది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేసేందుకే రేవంత్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. సీనియర్లు, సూపర్ సీనియర్లు చేస్తున్న కుట్రలను గమనిస్తూనే క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపే నాయకులను కలుపుకుని ఆయన వెళుతున్నారు.

Related posts

కాశ్మీర్ అమరవీరుల దినోత్సవాన్ని భగ్నం చేసే యత్నం

Satyam NEWS

ఎగ్జామ్ టైమ్: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

Satyam NEWS

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం

Satyam NEWS

Leave a Comment