29.7 C
Hyderabad
May 4, 2024 05: 49 AM
Slider ముఖ్యంశాలు

ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు లేవు: హరీష్ రావు

#harishrao

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు ఒక్కటి చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. 2001 లో పార్టీ పెట్టాక 6 నెలల్లో జడ్పీ స్థానం కైవసం చేసుకున్న మొదటి ఉమ్మడి జిల్లా నిజామాబాద్ అని, గులాబీ జెండాకు జీవం పోసింది కామారెడ్డి అని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపాలన్నారు. 40 రోజులు కష్టపడదాం.. పార్టీకి పూర్వ వైభవం తెద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఊదరగొట్టారని, ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్లు పంచారు.. అప్పటికి నమ్మకపోతే ఇది సోనియాగాంధీ మాట అని నమ్మించారన్నారు.

100 రోజుల తన పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హామీలు అమలు చేయకున్నా ప్రజలు ఓటేశారు అంటే ఏం చేయగలమని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా ప్రభుత్వం పడిపోదన్నారు. ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తూ ఒక్కొక్క హామిపై ప్రశ్నించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినా అమలు చేయలేదని, రైతుల వద్దకు బ్యాంకర్లు వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

వరికి 500 బోనస్, క్వింటాలు వరి 2500 లకు కొంటామని హామీ ఇచ్చారని, బోనస్ ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని ప్రశ్నించారు. ప్రతి నెల ఆడబిడ్డ అకౌంట్లో 2500 వేస్తామన్నారని, నాలుగు నెలల్లో ప్రతి ఆడబిడ్డకు ఈ ప్రభుత్వం 10 వేలు బకాయి పడ్డదన్నారు. ఎక్సైజ్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో 19 వేల కోట్ల ఆదాయం వస్తే బడ్జెట్లో మాత్రం 25 వేల కోట్ల ఆదాయమని చూపించారని, అంటే బెల్టు షాపులను పెంచి పోషిస్తారా అని నిలదీశారు. డిసెంబర్ 9 నుంచి 2 వేల పింఛన్ 4 వేలకు పెంచి ఇస్తామన్నారని, రాష్ట్రంలో 42లక్షల 80 వేల మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారని, ఒక్కొక్కలబ్దిదారునికి 8 వేలు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు.

బీడీ కార్మికులకు దేశంలోనే పింఛన్ ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి ద్వారా 2500 ఇస్తామని చెప్పి మొదటి హామినే నిలబెట్టుకోలేకపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతుక ఉండాలి.. నిలదీసే నాయకులను కాపాడుకోవాలన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో 11 విడతల్లో 75 వేల కోట్ల రైతుబందు ఇచ్చామని, కాంగ్రెస్ పార్టీ రైతుబంధు 15 వేలు ఇస్తామన్నారని, కౌలు రైతులు, రైతు కూలీలకు 12 వేలు ఇస్తామని రైతులను మోసం చేశారన్నారు.

ప్రభుత్వానికి బడా కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ బక్కచిక్కిన రైతు మీద లేదన్నారు. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు బంద్ అయ్యాయని,  కన్నీళ్లు ఎక్కువయ్యాయని, కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందన్నారు. 100 రోజుల్లో 280 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయని తెలిపారు. 100 రోజుల్లో ఉద్దెర పనులు తప్ప ఉద్ధరించే పని ఒక్కటి చేయలేదని, ప్రొద్దున లేస్తే లీకులు, ఫేక్ వార్తలు, సోషల్ మీడియాలో గాసిప్పులుప్ ప్రచారం చేస్తున్నారన్నారు. తమ నాయకులను కొంటారేమో కానీ కరుడుగట్టిన కార్యకర్తలను కొనలేరన్నారు. పేగులు మెడలో వేసుకుని తిరిగేది మనుషులా.. రాక్షసులా అని ప్రశ్నించారు. మాట్లాడితే మానవబాంబు అవుతా అంటున్నాడని, ఎవరు కమ్మని చెప్పారన్నారు.

సీఎం, మంత్రులు పరామర్శించారా..?

ఆటో కార్మికుల అర్థనాదం ప్రభుత్వానికి వినపడటం లేదని రాష్ట్రంలో 38 మంది ఆటో కార్మికులు చనిపోయారని, 200 పైగా రైతులు చనిపోయారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు ఒక్క రైతునైనా పరామర్శించారా..? పంటలను పరిశీలించారా.. ? ఒక్క ఆటో కార్మికుని కుటుంబానికైనా భరోసా ఇచ్చారా.. ? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉరుక్కుంటు పోయారని విమర్శించారు.

బీజేపీకి ఎందుకు ఓటయ్యాలి

బీజేపీ ఎంపీ అభ్యర్థి బిబిపాటిల్ పార్టీ మారి కన్నతల్లికి ద్రోహం చేశారని, 2 సార్లు టికెట్ ఇస్తే రాత్రికిరాత్రి జంప్ అయ్యారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనం బయటకు తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని ఎద్దేవా చేసారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీకి ఎందుకు ఓటయ్యాలని ప్రశ్నించిన ఆయన మెడికల్ కళాశాలలు ఇవ్వనందుకా.. నవోదయ ఇవ్వనందుకా.. నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకున్నందుకా.. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుకా.. సమాధానం చెప్పాలన్నారు.

రూపాయి విలువ పడిపోయిందని, ఆకలి పెరిగిందని,  నిరుద్యోగం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటు వేస్తే భవిష్యత్తు ఉండదన్నారు. రాముడు అందరి వాడని, ప్రతి ఒక్కరు రాముని పూజిస్తారన్నారు. కేసీఆర్ యాదాద్రి కట్టలేదా.. కేసీఆర్ మాదిరిగా యజ్ఞాలు, యాగాలు చేసినవారు లేరన్నారు. దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు.

33 జిల్లాలను తగ్గిస్తారట

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలు 17 జిల్లాలుగా మారుస్తారట అని హరీష్ రావు అన్నారు. జిల్లాల పునర్విభజనతో ప్రజల వద్దకు పరిపాలన వచ్చిందన్నారు. ప్రజలకు పనులన్నీ ఒకేచోట అవుతున్నాయని తెలిపారు. జిల్లాలను తగ్గించి పార్లమెంట్ స్థానాలకు మాత్రమే జిల్లాలను పరిమితం చేస్తామని వార్తలు వస్తున్నాయన్నారు. ఇలా అయితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోరా అని ప్రశ్నించారు.

జై తెలంగాణా అన్నావా

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే మంచి పనులు చేసి చూపించాలని హరీష్ రావు అన్నారు. తమ  నాయకులపై కక్ష కట్టడం, కేసీఆర్ పై బురద చల్లడం మానుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి.. ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్నావా అని ప్రశ్నించారు. ఉద్యమకారుల పైకి నాడు రేవంత్ రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టారని గుర్తు చేశారు. ఒక్కనాడైనా అమరవీరుల స్తూపం వద్ద రెండు పువ్వులు పెట్టావా.. జోహార్లు చెప్పావా.. శ్రద్ధాంజలి ఘటించావా.. అని ప్రశ్నించారు.

భవిష్యత్తు మనదే.. అధైర్యపడొద్దు

పార్టీలో జరిగిన తప్పిదాలపై పార్టీ సమీక్షించుకుంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రలోభాలకు గురై పార్టీ మారిన వారిని భవిష్యత్తులో పార్టీలోకి తీసుకోదన్నారు. కార్యకర్తల నుంచి నాయకులను తయారు చేసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదన్నారు. రాజస్థాన్ లో ఓడింది.. హిమాచల్ ప్రదేశ్ లో 6 నెలలకే పడిపోయేలా ఉంది.. కర్ణాటక పరిస్థితి అంతంత మాత్రమేనన్నారు. భవిష్యత్తు మనదే.. అధైర్య పడొద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

కామారెడ్డిలో నయీములు, గియూములు ఇబ్బందులు పెడితే మేము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే ఢిల్లీలో గులంగిరి చేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. గతం గురించి బాధ పడొద్దు.. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

దుమ్ము, ధూళితో అనారోగ్యంపాల‌వుతున్నప్ర‌జ‌లు

Sub Editor

ఆకాశంలో ఆవిష్కృతమైన మహాద్భుతం

Satyam NEWS

టీఆర్ఎస్ లో చేరిన బిజెపి కార్పొరేటర్లు

Satyam NEWS

Leave a Comment