35.2 C
Hyderabad
May 1, 2024 01: 06 AM
Slider గుంటూరు

గూండాల రాజ్యంలో మానవ హక్కులు ఉండవు

#Yalamanchili Prasad

పాఠశాల దశలోనే తామంతా గాంధీజీ పిలుపు ను అందుకొని బ్రిటిష్ రాజ్ డౌన్ డౌన్ అంటూ పోరాడామని, భయపడలేదని, ఇప్పుడు ఏపీలో గూండా రాజ్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని యలమంచిలి ప్రసాద్ (చికాగో)అన్నారు. 23వ తానా తెలుగు మహాసభలను పురస్కరించుకొని గురువారం సేవ్ ఆంధ్ర ఎన్నారై వారు ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కుల ఉల్లంఘన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు అన్న అంశంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా ప్రసాద్ మాట్లాడుతూ నాలుగేళ్ళలో తెలుగు రాష్ట్రం అన్ని రంగాలలో కుదేలు అవ్వటాన్ని చూస్తుంటే, కన్నీళ్ళు వస్తున్నాయి అని చెప్పారు.

రాజధాని కొరకు భూములు ఇచ్చిన మహిళల కష్టాలు చూసి 83 ఏళ్ళ వయసులోనూ రక్తం మరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ పై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు దేనికి నిదర్శనం? అని ప్రశ్నించారు.మనిషికి జీవించే స్వేచ్ఛ లేనప్పుడు ప్రభుత్వాలు ఉండి ప్రయోజనం ఏమిటి? అన్నారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన, రాజధాని వంటి అంశాలను తెలుగు మహాసభలలో తీర్మానాలను చేయించబోతున్నట్లు పేర్కొన్నారు.

సిపిఐ కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో పలు సంఘటనలు జరుగుతుంటాయని, కానీ ప్రభుత్వ ప్రోత్సాహంతో బడుగులపై దారుణాలు జరగటం మహా హేయమని పేర్కొన్నారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను,మాస్క్ పెట్టుకోనందుకు చీరాల కిరణ్ బాబు ను హత్య చేశారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను చంపి,తన కారులో శవాన్ని తీసుకెళ్లటం ప్రేరేపిత రాజ్యహింసలో భాగమే అన్నారు.

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ చలనం లేని సమాజం నిర్జీవంతో సమానమని, ఏపీలో జరుగుతున్న దాష్టీకాలపై ఎన్నారైలు స్పందించాలని కోరారు. ప్రశ్నించే మెదళ్ళే సమాజాన్ని నడిపిస్తాయని హితవు పలికారు.ప్రజల్ని భయపెట్టి పాలన చేయాలనుకునే ప్రభుత్వాలు చరిత్రలో బతికి బట్ట కట్టలేదన్నారు. దశాబ్దాలుగా పరదేశాల్లో ఉంటున్నా, స్వదేశంపై, సొంత గడ్డపై ఎన్నారైలు చూపుతున్న మమతానురాగాలను అభినందించారు.

ప్రత్యేక హోదా ఉద్యమ నాయకులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పూర్తిగా మోసం చేసిందన్నారు. రాజధాని, హోదా, పోలవరం వంటి అంశాలను గాలికి వదిలేసిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పద్మశేఖరావు మాట్లాడుతూ చేసిన అరాచకాల వలన అధికారం పోతుందన్న భయంతో ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఊపిరి వంటిది అని తెలిపారు.

పారిశ్రామిక వేత్త వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై మేధావులు స్పందించాలని కోరారు. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అయితే, ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని స్పష్టం చేశారు. ముప్పాళ్ళ జోస్న (కువైట్) మాట్లాడుతూ అమరావతి కోసం జరిగిన రెండు పాదయాత్ర లలోనూ, స్వయంగా పాల్గొన్నట్లు తెలిపారు. మహిళల కన్నీళ్ళు రాష్ట్రానికి క్షేమం కాదన్నారు.

ఆడిటర్ పరంధామయ్య మాట్లాడుతూ దళిత ఉద్యమానికి అండగా ఉండాలని, ఉద్యమకారులను బతకనివ్వాలని కోరారు. ఎన్నారై వేనుగుంట రాజేష్ సమన్వయపరిచిన ఈ జూమ్ మీటింగ్ లో ఎన్నారైలు శ్యామ్, రత్నం, పలువురు ఎన్ఆర్ఐ లతో పాటు బాలాంతపు కమలేష్ ,వజ్రాల రవిశంకర్ పాల్గొని మాట్లాడారు.

Related posts

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

Bhavani

పడిగరాయి గుట్ట శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహ స్వామికి విశేష పూజలు

Satyam NEWS

సమస్యలు పరిష్కరించి మహిళల అభిమానాన్ని సంపాదించాలి

Satyam NEWS

Leave a Comment