38.2 C
Hyderabad
April 29, 2024 21: 36 PM
Slider ముఖ్యంశాలు

పులిలా వేటాడి కేసీఆర్ ను ఒడిస్తా: రేవంత్ రెడ్డి

#revanthreddy

భూములు అమ్ముకోవడానికి కామారెడ్డికి వస్తున్న కేసీఆర్ ను పులిలా వెంటాడి, వేటాడి ఒడిస్తానని టీపీసీసీ చీఫ్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ఉమ్మడి మాచారెడ్డి మండలం రెడ్డిపేట, ఇసాయిపేట, ఫరీద్ పేట, చుక్కాపూర్, మాచారెడ్డి గ్రామాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డికి బోనాలు, గజమాలలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యాయన్నారు.

రాష్ట్రంలో పరీక్షలు రద్దయితే విద్యార్థులు చనిపోతే ఒక్కసారి కూడా కెసిఆర్ పరామర్శకు వెళ్లలేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అటువైపుగా కన్నెత్తి చూడలేదన్నారు. గజ్వేల్ లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ అక్కడి భూములన్నీ అమ్ముకుని పచ్చగా ఉన్న కామారెడ్డి భూముల వైపు వస్తున్నారన్నారు. ఇక్కడి రైతులు మాస్టర్ ప్లాన్ తో ఓసారి కేసీఆర్ కు తమ సత్తా చూపారని, మరోసారి భూముల జోలికి వస్తున్న కేసీఆర్ నీ గెట్టు దాకా కూడా రానివ్వకుండా తరిమికొట్టాలన్నారు. మృగాన్ని వేటాడే సింహంలా తాను కేసీఆర్ ను వెంటాడి వేటాడే పులిలా కామారెడ్డికి వేస్తున్నానని, కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించి తీరతానన్నారు.

కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న ఉద్యోగాలు ఊడితే తప్ప రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని తెలిపారు. మనిషి రక్తం మరిగిన వ్యక్తికి కరెంట్ తీగతో చుట్టి షాకివ్వాలన్నారు. కరెంటుపై బీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని, అసలు ఉచిత కరెంట్ విదానాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు పింఛన్లు ఎటు పోవన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు కింద ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు 12 వేలు ఇస్తామన్నారు. రైతుల వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తామని, గృహ అవసరాలకు ఉచిత కరెంట్ అందిస్తామన్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తామని, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని తెలిపారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కేసీఆర్ ఉంటే కేవలం 2 వేల పింఛన్ మాత్రమే వస్తుందని తాము అధికారంలోకి వస్తే వచ్చే నెల నుంచే 4 వేల పింఛన్ ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడం కోసం 5 లక్షకు అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. ఇదంతా జరగాలి అంటే కేసీఆర్ ను కామారెడ్డి నుంచి తరిమికొట్టి కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజి ఎమ్మెల్యే యూసుఫ్ అలీ, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, అద్దంకి దయాకర్, డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

మెదక్ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు

Bhavani

మత మార్పిడి చట్టంపై జబల్ పూర్ హైకోర్టు కీలక తీర్పు

Satyam NEWS

Leave a Comment