28.7 C
Hyderabad
May 6, 2024 08: 24 AM
Slider ప్రత్యేకం

మాజీ పోలీస్ అధికారి సహకారంతో ఇసుక అక్రమ రవాణా

#nenusaitam

వనపర్తి జిల్లా ఘనపురం మండలంలో ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి సహకారంతో ఇసుక మాఫియా కోట్లాది రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సామాజిక కార్యకర్త,న్యాయవాది, జర్నలిస్ట్ దిడ్డి ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇసుక మాఫియా రెచ్చిపోతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని, వనపర్తి జిల్లా ఘణపురం మండలం అంతాయపల్లి గ్రామ శివారులో వాగు నుండి ప్రతిరోజు 50 నుంచి 60 భారత్ బెంజ్ లతో కనీసం రెండు నుంచి మూడు ట్రిప్పులు నేపథ్యంలో 100 నుంచి 200 లారీల ఇసుకను అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కోట్లాది రూపాయల విలువల చేసే ఖనిజ సంపద ఇసుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది లారీలతో ఇతర జిల్లాలకు తరలిస్తున్నా అటువైపు రెవెన్యూ, పోలీస్, మైనింగ్ ఇతర శాఖల అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం విడ్డురంగా ఉందన్నారు. ఇక్కడ ఇసుక మాఫియా చెప్పిందే చట్టం, చేసిందే న్యాయం అన్న చందంగా మాఫియా నీడలో మామూళ్ళ మత్తులో కొందరు పోలీస్, రెవెన్యూ అధికారులు తూగుతుంటే మొద్దు నిద్రలో మైనింగ్ శాఖ ఉండడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై ఘణపూర్ తహసిల్దార్, మైనింగ్ శాఖ ఏడీలకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన వారు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా మాఫియా ఏ ఒక్క అధికారికి భయపడకుండా గ్రామ శివారుల నుండి పట్టపగలు ఇసుకను అంతాయపల్లి, గుంపోలు గుట్ట, కమాజీపూర్, తిరుమలయపల్లి, పాత మోల్గర, కొత్త మోల్గర, గోపులాపూర్ మీదుగా భూత్పూర్,  మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్  ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని విమర్శించారు. దాదాపు 50 నుండి 60 లారీల ఇసుకను అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటి ఇతర జిల్లాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నా కొందరు రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం చూస్తే వారి చిత్తశుద్ది ఏ మాత్రం ఉందో స్పష్టమవుతుందన్నారు.

ఇకనైనా వెంటనే ఘణపూర్ మండలంలోని అంతయాపల్లి గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు వందలాది ట్రిప్పుల ఇసుకను వెంటనే రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటి చేస్తూ పక్క జిల్లాలకు తరలిస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులపై  వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నేనుసైతం స్వచ్చంద సంస్ధ ఆధ్వర్యంలో ఉధ్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కలెక్టర్ కు ” నేనుసైతం ” ఫిర్యాదు

వనపర్తి జిల్లా ఘణపురం మండలం అంతాయపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక రవాణా నిర్వహిస్తున్నారని వనపర్తి జిల్లా కలెక్టర్ యస్మిన్ భాషాకు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ద అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సాక్షాదారులతో ఫిర్యాదు చేయాలని, చేస్తే ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటానని, అంతేకాకుండా ఈ విషయమై ఎస్పీతో మాట్లాడి ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు.

హైదరాబాద్ కు చెందిన ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి పేరు చెప్పుకొని అంతయాపల్లిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, కలెక్టర్ జోక్యంతోనైన వనపర్తి జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టాలని  సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ద అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇకనైన వనపర్తి జిల్లా కలెక్టర్ యస్మిన్ భాషా స్పందించి, ఇసుక మాఫియాను, మాఫియాకు సహకరిస్తున్న సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులను కట్టడి చేయకపోతే, మరో సారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. అడవి ప్రాంతంలో, ఇసుక వాగులు ఉన్న దగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, వనపర్తి వస్తున్న ఇసుక వాహనాలను తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

అకాల వర్షాలతో తాలు గింజలతో పంట నష్టం

Bhavani

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు

Satyam NEWS

టిఆర్ఎస్ కు బ్రాహ్మణుల మద్దతు

Sub Editor

Leave a Comment