29.7 C
Hyderabad
May 4, 2024 03: 25 AM
Slider సంపాదకీయం

ఇన్ సైడర్ ట్రేడింగ్: ఆగుతారా… మరో కొత్త ఆలోచనతో కేసులు పెడతారా?

#insider trading

అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో కుట్రకోణం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆరోపణలను ఎంతో మంది ప్రజలు నమ్మారు. కమ్మ కులానికి చెందిన వారు అక్కడ భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా, అనధికారికంగా కూడా అధికార మీడియాతో బాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

అధికారంలోకి రాగానే తాము అందరిపైనా చర్యలు తీసుకుంటామని కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పారు. జరిగిన ఈ ప్రచారాన్ని నమ్మిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు కట్టబెట్టారు. ‘‘ఇన్ సైడర్ ట్రేడింగ్’’ పై ఆధారాలు లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతారని పలువురు అప్పటిలో ప్రశ్నించి తెలుగుదేశం పార్టీ పై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. ముందు చెప్పినట్లుగానే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కేసులు పెట్టారు.

అయితే ఆ కేసులు విచారణ స్థాయిలోనే కోర్టుల్లో వీగిపోయాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా కేసును కొట్టేసింది. ఇక ఇప్పుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లు ఉన్నా చేయగలిగింది ఏమీ లేదు. వేరే విధంగా కేసులు పెట్టవచ్చు కానీ ఇక ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో కేసులు పెట్టే అవకాశం లేదు. సుప్రీంకోర్టు తుది తీర్పును పరిశీలిస్తే కొనుగోలుదారులు మోసం చేశారన్న వాదనలకు తావులేదని స్పష్టంగా చెప్పింది.

ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు కావడంతో అవినీతి నిరోధక చట్టం కింద ప్రభుత్వాధికారులపై కేసులు పెట్టే వీలు లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమ్మకందారుల ప్రయోజనాలు కాపాడేందుకు కొనుగోలుదారులతో వారికి న్యాయపరమైన సంబంధమేమీ లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వాస్తవాలను పరిశీలించిన తర్వాతే ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసిందని, పిటిషన్‌లను స్వీకరించి తీర్పు ఇవ్వటంలో హైకోర్టు చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదని కూడా సుప్రీంకోర్టు చెప్పడం ఇక్కడ గమనార్హం. రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు అద్దంపడుతున్నది.

న్యాయస్థానాలను గౌరవించకపోవడం, తీర్పులను పట్టించుకోకపోవడం, తీర్పులకు అనుగుణంగా నిర్ణయాలను సవరించుకోవడం లాంటి అంశాలు పదే పదే జరుగుతున్నప్పుడు దాన్ని ఎవరూ పొరబాటుగా పరిగణించరు.

కావాలని చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నది. చట్టాలు చేసేది మేమే కాబట్టి చట్టంలో లేకపోయినా మేం చేస్తాం అంటే న్యాయస్థానాలు అంగీకరించవు. చట్టాలను మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం అన్నా కూడా న్యాయశాస్త్రం అంగీకరించదు. రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాలకు భిన్నంగా చట్టాలు ఉంటే వాటిని కొట్టివేసే అధికారం ఉన్నత న్యాయస్థానాలకు ఉంటుంది. ఇలాంటి ప్రాధమిక అంశాలను తెలుసుకుని పరిపాలన చేస్తే కోర్టుల నుంచి ప్రతిఘటన తగ్గుతుంది.

అలా కాకుండా కోర్టులకు, అవి ఇచ్చే తీర్పులకు ఇంకా.. ఇంకా… దురుద్దేశాలు ఆపాదిస్తూ… కొందరు వ్యక్తులు మేనేజ్ చేయడం వల్లే ఇలాంటి తీర్పులు వస్తున్నాయని చెప్పుకుంటూ కాలం గడుపుతామంటే ఇక చెప్పేది ఏమీ ఉండదు. న్యాయస్థానాలు మాత్రం చట్టాలను పరిరక్షిస్తూనే ఉంటాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు వెలువడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక బాధ్యతలు మోసే వ్యక్తులు న్యాయస్థానాలపై తీవ్రమైన ఆక్షేపణలు చేశారు.

పోలీసులు పెట్టిన కేసులు న్యాయపరిధిలో లేవని ఎవరు వాదిస్తే వారిని చంద్రబాబు మనుషులు అని ముద్రవేశారు తప్ప తమ తప్పును సరిదిద్దుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ‘‘తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు’’ అని వాదిస్తుంటే….. చేసేది ఏమి ఉంటుంది……?

Related posts

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

పూతలపట్టు పాల డైరీలో అమ్మోనియా లీక్

Satyam NEWS

కోటి బతుకమ్మ  చీరలు పంపిణీకి సిద్ధం

Satyam NEWS

Leave a Comment