29.7 C
Hyderabad
May 2, 2024 06: 30 AM
Slider ప్రత్యేకం

అంతర్గత కుమ్ములాటలతో సక్రమంగా సాగని ‘కారు’

#jupally

కొల్లాపూర్ లో రాజకీయ రణరంగం: రాష్ట్రం మొత్తం ఇదే తతంగం

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో అధికార టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ముఠా తగాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొల్లాపూర్ రాజకీయం వెల్లడి చేస్తున్నది.

కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వలస వచ్చిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మంత్రిగా పని చేసి తెలంగాణ ఉద్యమంలోకి దూకిన జూపల్లి కృష్ణారావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది.

ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు టీఆర్ఎస్ పార్టీ పరువు ప్రతిష్టల్ని మంటగలుపుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడుగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న జూపల్లి కృష్ణారావుకే రాజకీయ భవిష్యత్తు లేకపోతే మన పరిస్థితి ఏమిటని టీఆర్ఎస్ లోని దాదాపు అందరు నాయకులు ఆలోచిస్తున్నారు.

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాటి నుంచి ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉన్న జూపల్లి కృష్ణారావు గత కొద్ది కాలంగా కొల్లాపూర్ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలను కూడా కొల్లాపూర్ ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు.

క్రమంగా జూపల్లికి పెరుగుతున్న ప్రజాదరణ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి కంటగింపుగా మారాయి. దాంతో ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు సోషల్ మీడియలో జూపల్లికి వ్యతిరేకంగా తీవ్రమైన దుష్ర్పచారాన్ని చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు జూపల్లి వర్గీయులు ఖండిస్తున్నా బీరం ప్రచారం మితిమీరిపోతున్నదని జూపల్లి వర్గీయులు అంటున్నారు.

మునిసిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య తీవ్ర పోటీ కనిపించింది. ఈ ఇద్దరి పంచాయితీ ప్రగతి భవన్ వరకూ చేరింది. అయితే ఇద్దరి మధ్య రాజీ కుదర్చడం కానీ, ఎవరోఒకరికి పూర్తి బాధ్యతలుగానీ అప్పగించడం చేయలేదు.

ఇద్దరికి రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా చేయకపోవడంతో రెండు వర్గాలూ ఎవరికి వారుగా అభ్యర్ధులను నిలబెట్టుకున్నారు. సింహం గుర్తుతో జూపల్లి వర్గీయులు తమ సత్తాను నిరూపించుకున్నారు. దాంతో కొల్లాపూర్ రాజకీయాలు వేడెక్కాయి.

అప్పటి నుంచి టీఆర్ఎస్ అధిష్టాన వర్గం వీరిద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నం చేయకపోవడంతో ఎవరి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోయింది. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కొల్లాపూర్ పర్యటనకు వచ్చారు. ఆ కార్యక్రమాన్ని జూపల్లి బహిష్కరించారు.

అయితే కేటీఆర్ తన పర్యటనలో భాగంగా జూపల్లి ఇంటికి వెళ్లి పలుకరించి వచ్చారు. ఇది బీరం వర్గీయులకు మరింత అభద్రతాభావాన్ని పెంచింది. జూపల్లిపై మరింత విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఆరోపణలే ప్రత్యారోపణలతో కొల్లాపూర్ వేడెక్కింది.

జూపల్లి ఎమ్మెల్యే ను బహిరంగ చర్చకు ఆహ్వానించారు. బహిరంగ చర్చ ఎందుకు నేను నీ ఇంటికే వస్తాను అంటూ బీరం సవాల్ చేశారు. మరింత వేడి పెరిగింది. జూపల్లి కృష్ణారావు మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చేసిన అకృత్యాలు వెల్లడించారు.

ఆయన తండ్రి చేయని పనికి ప్రభుత్వం నుంచి ఎలా డబ్బులు తీసుకున్నారు అనే సందర్భం నుంచి నీటి పారుదల ప్రాజెక్టులను కోర్టు ద్వారా బీరం ఎలా అడ్డుకున్నారు అనే అంశం వరకూ వివరించి చెప్పారు.

అనుచరుల కోసం ప్రాణం ఇచ్చే జూపల్లిని ఎమ్మెల్యే బీరం రాంగ్ సైడ్ లో కెలికారు. తన అనుచరులపై ఎమ్మెల్యే జోక్యంతో పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని జూపల్లి ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. కొల్లాపూర్ లో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసుకువచ్చిన జర్నలిస్టు అవుట రాజశేఖర్ ను పోలీసులు లాకప్ లో చిత్ర హింసలకు గురి చేశారు.

ఇలాంటి విషయాల పై కూడా జూపల్లి స్పందించారు. నియోజకవర్గంలో జూపల్లి అనుచరులపై, ప్రశ్నించిన వారిపై  పెడుతున్న  అక్రమ కేసులపై, చేస్తున్న దాడులపై,రైతుల సమస్యలపై, పాలమూరు-రంగారెడ్డి బాధితుల అంశాలపై గత కొన్ని రోజుల క్రితం జూపల్లి కేటీఆర్ దృష్టికి తీసుకు పోయారు.

అంతేకాదు జూపల్లి ప్రగతిభవన్ లో సుమారు అర్ధగంట పైగానే చర్చలు జరిపినట్లు కూడా తెలిసింది. ఇవన్నీ ఫలితాలను ఇవ్వకపోవడంతోనే నేడు జూపల్లి బయటకు వచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పరిణామాలు టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పార్టీ అంతర్గత కుమ్ములాటలకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఎవరి మీదా చర్యలు తీసుకోవడం లేదు. దాంతో ఇవి మరింత పెచ్చరిల్లిపోతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పరువుపోతున్నది.

Related posts

పిడమర్తి రవిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి

Satyam NEWS

కళకళలాడిన అమరావతి నిస్తేజంగా ఉండడం బాధ కలిగిస్తోంది

Satyam NEWS

వచ్చే నెల 15 నుంచి సినిమా ధియేటర్లు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment