కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జనతా కర్ఫ్యూను పాటించారు. మంత్రి అల్లోల గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జనతా కర్ఫ్యూను పాటించారు.
మనుమరాలు, మనవడితో కలిసి కాసేపు మొక్కలకు నీళ్లు పట్టారు. సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులు, కాలనీ వాసులతో కలిసి చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోదీ, సీయం కేసీఆర్ ఇచ్చిన పిలుపు పాటిస్తూ ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తూచా తప్పకుండా పాటించి మనల్ని మనం కాపాడుకుందామని మంత్రి అల్లోల పిలుపునిచ్చారు. వైద్య సిబ్బందికి, పోలీసు యంత్రాంగానికి, ఇతర సిబ్బందికి మంత్రి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.