28.7 C
Hyderabad
May 6, 2024 02: 46 AM
Slider సంపాదకీయం

జాతీయ కూటముల్లో కేసీఆర్ స్థానం ఎక్కడో….?

#KCR

ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం తమ తమ కూటములతో సమావేశాలు జరుపుతున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ కూటములను బలోపేతం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించి ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో దేశంలో రాజకీయ ముఖ చిత్రం మారిపోతున్నది. ముందుగా కాంగ్రెస్ పార్టీ తన కూటమిని బలోపేతం చేసేందుకు నడుంకట్టగా ఇప్పుడు బీజేపీ అదే పని మొదలు పెట్టింది. ఢిల్లీలో జరుగుతున్న ఎన్‌డిఎ సమావేశంలో తమ భాగస్వామ్య పక్షాలైన 38 పార్టీలు పాల్గొంటున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నిన్న ప్రకటించారు. బెంగళూరులో ప్రారంభమైన రెండు రోజుల ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 26 రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి.

మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న మనకే కాదు. కేసీఆర్ కు కూడా అర్ధం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చి దేశంలోని వ్యవస్థలను మారుస్తానని కేసీఆర్ ప్రకటించారు. వ్యవస్థల్ని మార్చేందుకు తనకు మద్దతు ఇవ్వాలని ఆయన చాలా పార్టీలను కోరారు. కర్నాటకలోని ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ కేసీఆర్ తో కలిసి వచ్చింది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నుంచి చాలా కాలం కేసీఆర్ తోనే ఉండిపోయింది. కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ చతికిల పడటంతో కేసీఆరే వదిలేశారో… జేడీఎస్ వదిలేసిందో తెలియదు కానీ రెండు పార్టీలూ మళ్లీ మాట్లాడుకోలేదు.

మహారాష్ట్ర వెళ్లి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఎంతో ప్రయత్నం చేశారు. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి బోణీ కొట్టారని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు కూడా. ఆంధ్రా వాళ్లు వచ్చి తెలంగాణ లో ప్రచారం చేస్తే ఎలా ఊరుకుంటాం అని గతంలో ప్రశ్నించిన కేసీఆర్ ఉదాహరణ చెబుతూ…. మేం వెళ్లి మహారాష్ట్రలో ప్రచారం చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించిన కొద్ది కాలానికే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వీడియో తెలుగులోనే కాకుండా మరాఠాలో కూడా తర్జుమా చేసి మరీ అక్కడి రాజకీయ పార్టీలు వైరల్ చేశాయి. ఈ విధంగా సెల్ఫ్ గోల్ కొట్టుకున్న కేసీఆర్ ఈ మధ్య జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం లేదు.

బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొత్తలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇలా కొందర్ని కలిసి వచ్చారు కేసీఆర్. ఉత్తరప్రదేశ్ కు చెందిన అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అయితే నేరుగా ఆయన ప్రగతి భవన్ కే పిలిపించుకున్నారు. ఈ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నించిన కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఆయనకే అర్ధం కావడం లేదు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలూ దాదాపుగా బీజేపీ గ్రూప్ లోనో, కాంగ్రెస్ గ్రూప్ లోనో చేరిపోయాయి. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరేందుకు దేశంలో ఏ పార్టీ మిగల్లేదంటే అతిశయోక్తి కాదు.

బీఆర్ఎస్ లో కొత్త పార్టీలు చేరడం అటుంచి కేసీఆర్ ను రెండు మూడు సార్లు కలిసిన అఖిలేష్ యాదవ్ వెళ్లి కాంగ్రెస్ పార్టీ కూటమిలో కూర్చున్నారు. అదే విధంగా కేసీఆర్ తో అంటకాగిన జేడీఎస్ నేత కుమారస్వామి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. అంటే కేసీఆర్ పార్టీలో కొత్త పార్టీలు చేరడం అటుంచి ఉన్న పార్టీలు కూడా ఊడిపోయాయన్నమాట. కేసీఆర్ పార్టీని బీజేపీకి బీ టీమ్ అని సీనియర్ నాయకుడు శరద్ పవర్ వ్యాఖ్యానించిన నాటి నుంచి కేసీఆర్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దానికితోడు బీజేపీ పెద్దలు తమ శత్రువులపై ప్రయోగించే ఈడీని, సీబీఐ ని కేసీఆర్ పరివారం పై ఉన్న కేసుల నుంచి ఉపసంహరించినట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కేసీఆర్ సూచన మేరకే బండి సంజయ్ ని తీసేసి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేశారని పెద్ద ఎత్తు ఆరోపణలు వెల్లువెత్తాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సారిగా ఊపందుకోవడంతో రంగం నుంచి బీజేపీ తప్పుకుని కేసీఆర్ కు అవకాశం ఇస్తున్నదని, తద్వారా కాంగ్రెస్ ను తెలంగాణలో అడ్డుకోవాలని బీజేపీ ప్లాన్ చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సూచించిన వ్యక్తికి బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టి తెలంగాణ లో బీజేపీని పడుకోబెట్టారని కూడా వార్తలు వెలువడ్డాయి.

ఈ విధంగా బీజేపీకి బీఆర్ ఎస్ బీ టీమ్ అన్న శరద్ పవర్ మాటల్ని అటు కేసీఆర్ ఇటు బీజేపీ కూడా నిజం చేశాయి. అయితే బీజేపీకి బీటీమ్ గా ఉన్న బీఆర్ ఎస్ ను ఎన్ డి ఏ సమావేశానికి ఆహ్వానించలేదు. అంటే కేసీఆర్ ను గుప్త మిత్రుడిగానే బీజేపీ చూస్తున్నదన్నమాట. ఇటా అటూ ఇటూ కాకుండా గుప్తంగా మిగిలిపోవడంతో బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఎదగాలనుకునే ఆశలు చల్లారిపోయినట్లేనని అంటున్నారు.  

Related posts

విశ్లేషణ: అంతులేని కథ గా మారుతున్న లాక్ డౌన్

Satyam NEWS

జానారెడ్డిని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదు

Satyam NEWS

నిన్న ఉత్తమ ఉద్యోగి – నేడు లంచగొండి

Satyam NEWS

Leave a Comment