31.2 C
Hyderabad
May 2, 2024 23: 29 PM
Slider సినిమా

ఈ విజయం నా ఒక్కడిదే కాదు “కొరమీను” కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిది

ఫుల్ బాటిల్ ఎంటర్టెన్మెంట్ బ్యానర్ పై మ్యాగో రామ్ సమర్పణలో… “ఏ స్టోరీ ఆఫ్ ఇగొస్” అనే ట్యాగ్ లైన్ తో… శ్రీపతి కర్రి దర్శకత్వంలో రూపొంది, గతవారం (2022, డిసెంబర్ 31న) విడుదలైన “కొరమీను” చిత్రానికి “కర్త (కథ), కర్మ (స్క్రీన్ ప్లే మరియు సంభాషణలు), క్రియ” (కథానాయకుడు మరియు నిర్మాణ భాగస్వామి) ఆనంద్ రవి కావడం గమనార్హం!!

“కల్ట్ ఫిల్మ్”గా కొనియాడబడుతూనే… కమర్షియల్ గానూ “కొరమీను” సాధిస్తున్న ఘన విజయంలో ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ భాగస్వాములే అంటాడు ‘బహుముఖ ప్రతిభాశాలి’ గా పేర్కొనదగ్గ ఆనంద్ రవి!!

లక్ష మందిలో ఉన్నా తన ఉనికిని ఘనంగా ప్రకటించుకోగలగాలనే స్థిర లక్ష్యంతో.. ఏరికోరి సినిమా రంగాన్ని ఎంచుకున్న ఈ ఉత్తరాంధ్ర కుర్రాడు… 2002లో హైదరాబాద్ వచ్చి… స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగాడు. ఎగువ మధ్య తరగతి కుటుంబంలో- శ్రీకాకుళంలో పుట్టి, విజయనగరంలో విద్యనభ్యసించి, వైజాగ్ లో కెరీర్ బిగిన్ చేసిన రవి… హైదరాబాద్ రావడానికి మునుపే… “విజయం” పేరుతో గంట నిడివి గల ఇండిపెండెంట్ ఫిల్మ్ తీశాడు. ఆ సినిమా చూడడానికి వచ్చిన తనకు తెలిసినవాళ్ళు… పూర్తిగా చూడలేక మధ్యలోనే వెళ్లిపోతుంటే… “సినిమా అంటే ఇలా తీయకూడదన్నమాట” అనుకున్నాడే తప్ప… ఆ “అపజయం”… సినిమా ఫీల్డ్ కి వెళ్ళాలన్న తన కృత నిశ్చయాన్ని ఎంతమాత్రం ప్రభావితం చేయనివ్వలేదు!!

నీటిలో దూకాక ఈత నేర్చుకున్నట్లుగా… ముక్కూమొహం తెలియని సినిమా రంగంలో నేరుగా దూకేసి… మెల్లగా ఈ రంగాన్ని ఆకళింపు చేసుకుంటూ వచ్చాడు. తానొక గెజిటెడ్ ఆఫీసర్ కొడుకుననే వాస్తవాన్ని తనలోనే దాచుకుని… “డిగ్నిటీ ఆఫ్ లేబర్” సిద్ధాంతంతో “తప్పుడు పని కాకపోతే చాలు” అనుకుంటూ దొరికిన పని చేసుకుంటూ ముందుకు సాగాడు. అప్పటి తన రూమ్మేట్, ఇప్పటి నటుడు అల్లు రమేష్ తో కలిసి… ఓ ప్రముఖ షాప్ ముందు “జోకర్” వేషం వేసుకుని నిలబడిన రోజుల గురించి సైతం చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించని ఆనంద్ రవి… ఒక టివి ఛానల్ కోసం తీసిన “టెంపుల్స్ ఆఫ్ ఇండియా” అనే డాక్యుమెంటరీకి కెమెరామన్ గా మొదలుకుని అనేక రకాల పనులు చేశాడు!!

2005లో శేఖర్ కమ్ములకు శిష్యుడిగా మారడం… రాళ్లు రప్పల మధ్య పిల్ల కాలువలో చేస్తున్న ఒడుదుడుకుల ప్రయాణం… నదీ ప్రవాహంలోకి మారినట్లయ్యింది రవికి. “గోదావరి” చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసే అవకాశం రావడం… అప్పటికి మూడేళ్లుగా పడుతున్న కష్టాలకు తగ్గ ఫలితంగా నిలిచింది. డైరెక్షన్ కు మాత్రమే పరిమితం కాకుండా… ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చక్కబెడుతూ సాగిన “గోదావరి” ప్రయాణం నుంచి తాను ఏం నేర్చుకున్నానో తెలుసుకోవడం కోసం… “చికెన్ హార్ట్” అనే షార్ట్ ఫిల్మ్ తీసి, తనకుతాను పరీక్ష పెట్టుకున్నాడు ఈ శ్రీకాకుళం చిన్నోడు!!

శేఖర్ కమ్ముల “హ్యాపీ డేస్”లోనూ పాలుపంచుకున్న ఆనంద్… ఆ చిత్ర హీరోల్లో ఒకడైన వంశీ చాగంటి “హీరో కమ్ ప్రొడ్యూసర్”గా “పేరెంట్స్” చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ మూవీ చూసిన ఓ ఇద్దరు ప్రముఖ నిర్మాతలు అడ్వాన్సులు ఇవ్వడం… రవి ప్రతిభకు నిదర్శనంగా నిలిచినా… కారణాంతరాల వలన “పేరెంట్స్” చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు!!

ఫిల్మ్ మేకింగ్ లోనైనా, రియల్ లైఫ్ లోనైనా “ఎథిక్స్” పాటించాల్సిందేనని పట్టుబట్టే రవి… వాటికి కట్టుబడే, తాను అడ్వాన్స్ తీసుకున్న ఓ నిర్మాత దగ్గర తన ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆలస్యమవుతున్న తరుణంలో- ఓ ప్రముఖ హీరో తన కథ మెచ్చి, డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినా… దాన్ని సున్నితంగా తిరస్కరించి, తన మిత్రుడు ప్రశాంత్ కు అవకాశం ఇచ్చి తాను “రచయిత పాత్ర”కు పరిమితమయ్యాడు. ఆనంద్ రవి కథ – మాటలతో తెరకెక్కి… “ఎవరు ఈ ఆనంద్ రవి?” అని ఆరాలు తీసేలా చేసిన ఆ చిత్రమే… నారా రోహిత్ టైటిల్ రోల్ ప్లే చేసిన “ప్రతినిధి”. “టి.కృష్ణ మళ్లీ పుట్టాడా?” అని ప్రశంసలు అందుకునేలా చేసిన “ప్రతినిధి” చిత్రం రవి కెరీర్ కి తిరుగులేని పునాది వేసింది!!

“ప్రతినిధి” చిత్రానికి తనకు అందిన పారితోషికానికి…రైటర్ గా రీమేక్ రైట్స్ రూపంలో ముట్టిన భారీ మొత్తాన్ని జత చేసి… తన మిత్రుడు భోగేంద్ర గుప్తాతో కలిసి… “రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ పార్టనర్ కమ్ హీరో”గా “నెపోలియన్” రూపొందించాడు. “నా నీడ పోయింది” అనె ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే!!

ఈ చిత్రం అనంతరం “జిందాబాద్” పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని రవి చేసిన ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. అనంతరం… తమ పదేళ్ల ఫ్రెండ్షిప్ ను పార్టనర్షిప్ గా మార్చుకుని… తన మిత్రుడు సమన్య రెడ్డితో కలిసి “ఫుల్ బాటిల్ ఎంటర్టెన్మెంట్” స్టార్ట్ చేసి, “కొరమీను” చిత్రానికి “కొబ్బరికాయ” కొట్టారు. కానీ గుమ్మడికాయ కొట్టడానికి (షూటింగ్ పూర్తి చేయడానికి) ఈ చిత్రానికి కరోనా రూపంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. వాటన్నిటినీ అధిగమించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన “కొరమీను” చిత్రం అందరికీ పసందైన రుచిని అందిస్తూ… మరోసారి ఆనంద్ రవి పేరు మారుమోగేలా చేస్తోంది!!

“నెపోలియన్” సూపర్ హిట్టయినా… నేనే యాక్ట్ చేసి, నేనే కట్ చెప్పుకోవడం నాకు నచ్చలేదు. మరొక సమర్థుడు డైరెక్టర్ సీట్ లో ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అందుకే… “పేరెంట్స్” చిత్రానికి నాతోపాటు పని చేసి… అప్పటి నుంచి నాతో ట్రావెల్ చేస్తున్న “శ్రీపతి కర్రి”ని కొరమీను చిత్రానికి దర్శకుడుగా తీసుకున్నాం అంటాడు రవి. “శ్రీపతిది కూడా వైజాగ్ కావడం, జాలర్ల బ్యాక్ డ్రాప్ లో అతను ఓ సబ్జెక్ట్ చేసుకుని ఉండడం… “కొరమీను” చిత్రానికి కలిసొచ్చింది” అంటాడు ఈ ఆల్ రౌండర్!!

“మన ఇంట్లో ఎలక్ట్రీషియన్ లేదా ప్లంబర్ ను పిలిచి… ఉచితంగా పని చేయించుకోవాలనుకోవడం… ఎంత అవివేకమో… మన సినిమాకు ఎవరితోనైనా “ఫ్రీ”గా పని చేయించుకోవడం… లేదా పని చేయించుకోవాలని చూడడం అంతకు మించిన అరాచకంగా పేర్కొనే ఆనంద్ రవి – తమ సంస్థలో పని చేసే ప్రతి ఒక్కరికీ ఠంచనుగా జీతాలు/పారితోషికాలు అందేలా చూస్తాడు!!

సినిమా రంగంలోకి రావాలనుకునేవారికి… రాణిoచాలనుకునేవారికి మీరిచ్చే సలహా, సూచన ఏమిటని అడిగితే… సృజనాత్మకతతోపాటు కొండంత సహనం, అంకితభావం, క్రమశిక్షణ కలిగినవారిని మాత్రమే ఇక్కడ సక్సెస్ వరిస్తుందని తేల్చి చెబుతాడు. తన విజయంలో అర్ధభాగం కంటే ఎక్కువ క్రెడిట్ తన అర్ధాంగికి చెందుతుందని చెప్పే రవి.. కరోనా కారణంగా తన తల్లిని కోల్పోవడం తీరని లోటని చెబుతాడు. తన సక్సెస్ లో తన నాన్న, అన్న, అక్క కూడా భాగస్వాములే అని చెప్పే రవి… భవిష్యత్ లో తెలుగు సినిమా స్థాయిని పెంచే మరిన్ని సినిమాలు చేస్తాడని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు!!

ధీరజ అప్పాజీ

Related posts

ముస్లిం సోదరులకు ఉత్తమ్ బక్రీద్ శుభాకాంక్షలు

Satyam NEWS

రిటర్నింగ్ అధికారిని చంపుతామని బిజెపి భయపెట్టింది

Satyam NEWS

వెంకటాపూర్ లో 20 మందికి బిసి బందు చెక్కుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment