33.7 C
Hyderabad
April 29, 2024 03: 01 AM
Slider సంపాదకీయం

తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఎందుకింత కక్ష?

#films

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమపై ఎందుకు ఇంత కక్ష ప్రదర్శిస్తున్నది? తెలుగు అగ్ర హీరోలలో సగం మంది జగన్ ముందు మోకరిల్లారు. అయినా సరే ఆయన కనికరించడం లేదు. పెద్ద సినిమాలు విడుదల సమయం చూసి టిక్కెట్ రేట్లు తగ్గించడం నుంచి షో లను అదుపు చేయడం తో మొదలైన ఈ కక్ష సాధింపు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా అడ్డుకునే స్థాయికి వచ్చేసింది.

నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రాలపట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. కొందరు అగ్ర హీరోల చిత్రాలు విడుదల అవుతున్నాయి అంటేనే ప్రభుత్వం ఎలర్ట్ అయిపోతున్నది. ఆ చిత్రాన్ని ఎలా అడ్డుకోవాలా అనే ఆలోచిస్తున్నది.

అగ్ర హీరోల చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల కోసం పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ల కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకోవడం, వేచి చూడటం, ఆఖరు నిమిషంలో అమలు చేయలేని షరతులు పెట్టడం పోలీసులకు ఆనవాయితీగా మారింది. పై నుంచి ఏం ఆదేశాలు వస్తాయో అని కింది స్థాయి పోలీసులు ఎదురు చూస్తూ ఆఖరు నిమిషం వరకూ ఆగుతున్నారు.

గతంలోనే పరిస్థితి దారుణంగా ఉంది అనుకుంటే ఇటీవల వచ్చిన నెంబర్ వన్ జీవో మరింతగా పరిస్థితి దిగజారింది. పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినప్పుడు కూడా ఎంతో లాభం ఉంటుంది. పెద్ద సినిమాల నిర్మాణం లో పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది. ఆ సినిమా రూపొందే సమయం నుంచి విడుదల వరకూ ఎంతో మంది ఉపాధి పొందుతారు.

చిత్ర నిర్మాణ సమయంలో షూటింగ్ లను ప్రోత్సహిస్తే ఆయా ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సినిమా విడుదల అయిన తర్వాత పెద్ద ఎత్తున వినోదపు పన్ను వసూలు అవుతుంది. ఈ లాభాలనన్నింటిని కాదని జగన్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను అణచివేస్తున్న తీరు చూస్తుంటే సినీ పెద్దలే ఆశ్చర్య పోతున్నారు. ఏ హీరో చిత్రం విడుదలకు అడ్డంకులు ఏర్పడితే ఆ సినిమా హీరో మాత్రమే మాట్లాడే అలవాటు తెలుగు పరిశ్రమలో ఉంది.

మిగిలిన హీరోలు ఎవరూ కూడా అదేమని అడగరు. ఈ లోపాన్ని ఆసరాగా తీసుకునే ప్రభుత్వాలు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని పలువురు నిర్మాతలు అంటున్నారు. చిత్ర పరిశ్రమలోని కొందరికి పదవులు ఇవ్వడం ద్వారా వారితో హీరోలపై ఆరోపణలు చేయించడం కూడా పరిపాటిగా మారిపోయింది. ఇలా పవన్ కల్యాణ్ పై దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఇప్పుడు సినిమా ఛాన్సులు రావడం ఆగిపోయింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో విభజన తీసుకువచ్చి కాలం గడుపుదామనే ఆలోచనే తప్పు అని కొందరు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అతి పెద్ద ఆదాయమార్గం అయిన చిత్ర పరిశ్రమను అణగదొక్కడం లేదా విభజించడం కరెక్టు కాదనే వాదనా వినిపిస్తున్నది. సినీ పెద్దలు ఒక తాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయం తీసుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరువు ఏమౌతుందని కూడా ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా టిక్కెట్ల రేట్లు, షో లపై పరిమితి, ప్రీ రిలీజ్ ఈవెంట్లపై ఆంక్షలు పెడుతుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లు నిలిపివేసే పరిస్థితి వస్తుందని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.  

Related posts

పీస్ ఫుల్: ప్రశాంతంగా ముగిసిన పుర ఎన్నికలు

Satyam NEWS

కలెక్టరేట్ ముందు వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు

Satyam NEWS

నీతులు చెప్పే చిదంబరం ఏం చేశాడు?

Satyam NEWS

Leave a Comment