39.2 C
Hyderabad
May 3, 2024 13: 42 PM
Slider సంపాదకీయం

కొరకరాని కొయ్య: జగన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ గా మారిన కోటంరెడ్డి

#jaganreddy

నిన్నమొన్నటి వరకూ అత్యంత విధేయుడుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన తిరుగుబాటు వైసీపీ పెద్దలకు నిద్ర పట్టకుండా చేస్తున్నది. 151 మంది ఎమ్మెల్యేలతో అత్యంత బలంగా ఉండాల్సిన వైసీపీకి ఒక్కొక్కటిగా చిల్లులు పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి విపరీతమైన ఆదరణ కనిపిస్తున్నది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా మరో ముగ్గురు ముఠా కలహాలలో మునిగితేలుతున్నారు. వైసీపీ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న రెడ్డి కులం నుంచే ముసలం పుట్టడం తో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ పుట్టి మునిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. రెడ్డి కులానికి చెందిన వారే కాకుండా రాజకీయంగా కాకలుతీరిన యోధుడు ఆనం రామనారాయణ రెడ్డికి ఎంతో విశ్వసనీయత ఉంది.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి కలబడే నైజం ఉంది. గౌరవ ప్రదమైన మేకపాటి కుటుంబం నుంచి వచ్చిన చంద్రశేఖరరెడ్డి మాటకు విలువ ఉంటుంది. ఈ ముగ్గురిని ‘‘అతి తెలివి’’ తో వైసీపీ దూరం చేసుకున్నది. మధ్యలో వచ్చిన వారు చేసే రాజకీయంతో వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుదేలైపోయింది. తొలి మంత్రి వర్గంలో అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రిగా స్థానం కల్పించిన నాడే నెల్లురు రెడ్డి కులస్తులలో తీవ్ర అలజడి చెలరేగింది. మంత్రి పదవి దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్ పెద్దలను గౌరవించకపోగా నెల్లూరు రెడ్లను తీవ్రంగా అవమానాల పాలు చేశారు.

తన పదవే శాశ్వతం అనుకున్న అనిల్ కుమార్ యాదవ్ రెడ్లను తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభించారు. ఆ నాటి నుంచి నెల్లూరు జిల్లా రెడ్లలో జగన్ రెడ్డిపై వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తూ వచ్చింది. ఇది ఇప్పుడు పార్టీలో తిరుగుబాట్లకు తావిచ్చింది. పటిష్టంగా ఉన్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ ముగ్గురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగానే అల్లాడిపోతున్నది.

అందులోనూ కోటంరెడ్డి విసురుతున్న సవాళ్లకు చిగురుటాకులా వణికిపోతున్నది. అవమానాలను తట్టుకోలేక మర్యాదగా పార్టీ నుంచి వెళ్లిపోదామనుకున్న కోటంరెడ్డిని కెలికి రచ్చ చేసుకున్నారు. కోటంరెడ్డి లేవనెత్తిన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత తీవ్రమైనది. ఆ వ్యవహారాన్ని అధికారికంగా ఇప్పటి వరకూ ప్రభుత్వం ఖండించలేదు. పార్టీకి చెందిన ఒకరిద్దరు టెలిఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడినా అది ఎవరూ విశ్వసించలేదు.

తిరుగుబాటు చేసిన కోటంరెడ్డిని, ఆనం ను సముదాయించాల్సింది పోయి వైసీపీ పెద్దలు అహంభావంతో వ్యవహరించడం మరొక కారణంగా చెబుతున్నారు. దాంతో ఈ ఇద్దరు నాయకులు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరి ఆగ్రహం ఉమ్మడి జిల్లాలో వైసీపీకి పెను శాపంగా మారబోతున్నది. వైసీపీకి చెందిన పెద్దల ఆశీస్సులతో ఎందరినో బెదిరిస్తున్న సోషల్ మీడియా టైగర్లు కోటంరెడ్డి విషయంలోనూ అదే విధంగా చేశారు.

ఈడ్చుకువెళ్లి కొడతా అనే బెదిరింపులతో కోటంరెడ్డి మరింత బిగుసుకుపోయారు. దానితో బాటు పోలీసులపై వత్తిడి తెచ్చి కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసును నమోదు చేశారు. పోలీసుల నుంచి, వైసీపీ ప్రయివేటు సైన్యం నుంచి, వైసీపీ అగ్ర నాయకుల నుంచి ఈ విధంగా బెదిరింపులు వస్తే మరో నాయకుడైతే రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయేవాడు. అయితే అన్నింటికి తెగించిన కోటంరెడ్డి మరింత స్థిరంగా జగన్ కు సవాల్ విసురుతున్నారు.

కోటంరెడ్డి విసురుతున్న సవాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వైపు బలంగా ఉన్న రెడ్డి కులస్తులను పునరాలోచింపచేస్తున్నాయి. ఏరి కోరి తెచ్చుకున్న రెడ్డి నాయకుడు రెడ్లనే ఈ విధంగా బెదిరిస్తుంటే రెడ్డి కులస్తులు భరించలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నత స్థాయిలో ఉన్న రెడ్లను ఆలోచనలో పడేస్తే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సాధారణ స్థాయిలో ఉన్న రెడ్లను తీవ్రంగా ప్రభావితులను చేస్తున్నారు. దాంతో వైసీపీ కి రెడ్డి గ్రౌండ్ కదలిపోతున్నది. ఈ పరిస్థితుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వైసీపీ నాయకులు చేరిపోయారు.

Related posts

పానుగంటి రత్నమ్మకు నివాళి అర్పించిన రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS

విలాసాలకు మరిగిన యువకులు చోరీలు చేస్తూ…

Satyam NEWS

2000 నోటు ఇక కనుమరుగు

Bhavani

Leave a Comment