37.2 C
Hyderabad
May 2, 2024 14: 24 PM
Slider నల్గొండ

గైనకాలజీ డాక్టర్ లేక గర్భిణీ స్త్రీలకు ఇక్కట్లు

#HujurnagarHospital

డాక్టర్లు లేక గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం త్వరితగతిన డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, మెరుగైన వైద్యం  అందించడం కోసం అన్ని రకాల వైద్య పరికరాలను ఏర్పాటు చేయాలని టి.పి.సి.సి జాయింట్ సెక్రెటరీ ఎండీ అజీజ్ పాషా కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  ప్రాంతీయ ఏరియా వైద్యశాలలో ఖాళీగా ఉన్న  గైనకాలజీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి, అనంతరం హాస్పిటల్ సూపరిండెంట్ కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా టి.పి.సి.సి జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో సుమారు మూడు నెలలుగా గైనకాలజీ పోస్ట్ భర్తీ చేయకపోవటంతో  వైద్య నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు.

గతంలో ఉన్న గైనకాలజిస్టు దీర్ఘకాలిక సెలవులో ఉన్నందున 100 పడకల వైద్యశాలలో  గర్భిణీలను వైద్యం నిమిత్తం వేరే ప్రాంతాలకు రిఫర్  చేస్తున్నారని, దూర ప్రాంతం వెళ్లాలంటే రవాణా ఖర్చుతో పాటు వైద్య ఖర్చులు ఆకాశాన్ని తాకే విధంగా ఉన్నాయని అన్నారు.

ప్రయివేటు ఆసుపత్రులకు వెళితే ఫీజుల మోత

ప్రైవేట్ వైద్యశాలకు వెళ్ళాలంటే ఇదే అదునుగా భావించి ముక్కుపిండి వేలాది రూపాయలు కడితేనే సిజేరియన్ ఆపరేషన్ చేస్తామని, ప్రైవేట్ వైద్యశాల డాక్టర్లు అంటున్నారని అన్నారు.

దీనితో  సామాన్య, మధ్యతరగతి పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు వేలాది రూపాయలు ఖర్చులు తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ప్రభుత్వం తక్షణమే సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని, కొంతమంది సిబ్బంది చిన్న చిన్న కేసులను కూడా సీరియస్ గా ఉందని అంటూ వేరే ప్రాంతాలకు లేదా హైదరాబాదుకు రిఫర్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దీనిపై తక్షణం ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ రావు మాట్లాడుతూ హాస్పటల్లో స్కానింగ్ సెంటర్ లేకపోవటం వలన  పేద ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్ళి వేల రూపాయలు ఖర్చులతో స్కానింగ్ రిపోర్టు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీనితో పేద ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు.

వంద పడకల వైద్యశాలలో  అత్యవసర వైద్య పరికరాలతో కూడిన ఐ.సి.యూ సెంటర్, రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు.మౌలిక వసతుల ఏర్పాటులో లోపం లేకుండా పరిష్కరించాలని కోరారు.

100 పడకల వైద్యశాలలో పరిష్కరించాల్సిన సమస్యలు

1.ఖాళీగా ఉన్న రెండు గైనకాలజీ పోస్టులను తక్షణమే భర్తీ చేయటం.

2.స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయటం.

3.రక్తనిధి (బ్లడ్ బ్యాంక్ సెంటర్) ఏర్పాటు చేయటం.

4.పూర్తి స్థాయిలో వైద్య పరికరాలతో కూడిన ఐ.సి.యు సెంటర్ తక్షణం ఏర్పాటు చేయటం.

5.వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు,వైద్య సిబ్బందిని నియామకాలు చేపట్టటం.

ఈ ప్రధాన అంశాపై  ప్రభుత్వ అధికారులు తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్  కస్తాల శ్రవణ్ కుమార్,టి.పి.సి.సి ఐటీ సెల్ ఉపాధ్యక్షుడు శివరాం యాదవ్, ములకలపల్లి రామగోపి, పొతుల జ్ఞానయ్య,బెల్లంకొండ గురవయ్య, మేళ్ళచెరువు ముక్కంటి, ఎస్.కె. సైదా మేస్త్రి,పెద్దబ్బాయి,సుదర్శన్, దొంగాని జగన్, ఆజూ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సత్యంన్యూస్ ఎఫెక్ట్: ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు గృహనిర్భంధం

Satyam NEWS

T20 ప్రపంచ ఛాంపియన్ గా ఇంగ్లాండ్

Satyam NEWS

Analysis: ఇండియా -పాకిస్తాన్ భాయీ భాయి

Satyam NEWS

Leave a Comment