31.7 C
Hyderabad
May 2, 2024 10: 26 AM
Slider హైదరాబాద్

సమాజ శ్రేయస్సు పరమావధి కావాలి

Venkayya Naidu

సమాజంలోని వివిధ వర్గాల ప్రజల శ్రేయస్సు, జాతీయవాదం, దేశ సంక్షేమమే ప్రసార మాధ్యమాల పరమావధి కావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. జరుగుతున్నవాస్తవాలను యధావిధిగా ప్రజలకు అందించి, ఆలోచింపజేసేలా చైతన్య పరచాల్సిన బాధ్యత మీడియాపై ఉందని ఆయన పేర్కొన్నారు. వార్తలను అందజేసే ప్రక్రియలో వ్యక్తిగత అభిప్రాయాలను జోడించకుండా, ఉన్నది ఉన్నట్లుగా చేరవేయాలని సూచించారు.

మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ (ఎం.ఎ.హెచ్.ఈ) ఆధ్వర్యంలో అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి, ‘జర్నలిజం: గతం, వర్తమానం, భవిష్యత్’ అనే అంశంపై మాధవ్ విఠల్ కామత్ 6వ స్మారకోపన్యాసం చేశారు.

యాత్రికుల ద్వారా స‌మాచార మార్పిడి

ప్రాచీన కాలంలో సమాచార మార్పిడి వేర్వేరు ప్రాంతాలనుంచి వచ్చే యాత్రికుల వల్ల జరిగేదని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, ప్రచురణ అందుబాటులోకి వచ్చిన తర్వాత పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఆ తర్వాత రేడియో, టీవీ, అంతర్జాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ పత్రికలపై మక్కువ తగ్గలేదన్నారు.

ప‌త్రిక‌ల పాత్ర నిరూప‌మానం

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందునుంచి నేటి వరకు పత్రికలు పోషిస్తున్నపాత్ర నిరుపమానమైనదని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, పరాయి పాలన కాలంలో ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించడంలో పత్రికలు కీలకభూమిక పోషించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత కూడా ప్రజలను వివిధ అంశాలపై చైతన్య పరచడంతోపాటు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీడియా చేస్తున్న కృషిని అభినందించారు.

దేహ‌హితం దిశ‌గా మీడియా ప్రాధాన్య‌త తీసుకోవాలి

అయితే ఈ దిశగా మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందన్న ఆయన, ప్రజాసంక్షేమం, సమాజంలోని అన్నివర్గాలకు సమాన అవకాశాలు కల్పించేలా చొరవ తీసుకోవడంతో పాటు దేశహితం, జాతి నిర్మాణం, దేశ ప్రయోజనాలను కాపాడటాన్ని మీడియా ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు.

స‌మాచారం అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన శ‌క్తి

‘ఇది సమాచార యుగం. ప్రతి అంశంపై వివిధ కోణాలనుంచి సమాచారం అవసరమవుతోంది. తద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం.. చైతన్యం పొందడం ఇలా ప్రతి పనికీ సమాచారం తప్పనిసరైంది. ఒక రకంగా చెప్పాలంటే సమాచారం అత్యంత ప్రభావవంతమైన శక్తిగా మారింది. ఇంతటి కీలకమైన సమాచారాన్నిచేరవేయడంలో మీడియా ప్రధాన సాధికార మాధ్యమంగా విరాజిల్లుతోంది. ఈ సమాచార యుగంలో భిన్నకోణాలు, భిన్న ఆలోచనలకు ప్రచార, ప్రసార మాధ్యమాలు వేదికలుగా మారాయి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

స‌రికొత్త పుంత‌లు తొక్కుతున్న స‌మాచార మార్పిడి

శాటిలైట్ కమ్యూనికేషన్ రాకతో 21వ శతాబ్దంలో సమాచార మార్పిడి సరికొత్త పుంతలు తొక్కుతోందన్న ఉపరాష్ట్రపతి, ఈ నేపథ్యంలో మీడియా బాధ్యత మరింతగా పెరిగిందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ‘ఇన్‌స్టంట్ జర్నలిజం’ రూపంలో వస్తున్న వార్తలు వేగంగా ప్రజలకు చేరుతున్నప్పటికీ, అందులో చాలా మేరకు వార్తలు సత్య దూరాలుగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తల ద్వారా ప్రజల్లో ఆందోళన రేకెత్తకుండా వాస్తవాలకు, అసత్య కథనాలకు మధ్య తేడాను ప్రజలకు తెలియజేసి వారిలో చైతన్యాన్నికలిగించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని తెలిపారు.

వ్య‌క్తిగ‌త వేదిక‌లుగా మారోద్దు

ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ కీలకమైనదన్నఉపరాష్ట్రపతి, భావప్రకటనా స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని మీడియాకు సూచించారు. ఈ హక్కును అడ్డు పెట్టుకుని సంచనల వార్తలను, విలువల్లేని పద్ధతులను, వ్యక్తిగత అభిప్రాయాలను జోడించే వార్తలను అందించే వేదికలుగా మారొద్దని హితవు పలికారు. చందాదారులను పెంచుకునేందుకో, ప్రకటనలను ఆకర్షించేందుకో విలువలకు తిలోదకాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు. ప్రధానంగా మీడియాలో వ్యాపారధోరణి పెరగడం కారణంగా కొంతకాలంగా కొన్నిచోట్ల ఈ మార్పులు కనబడుతున్నాయన్నఉపరాష్ట్రపతి, సమాజ సేవ, దీనజనోద్ధరణే పత్రికల ప్రాధాన్యత కావాలన్నమహాత్ముని మాటలను గుర్తు చేశారు.

స్వీయ నియంత్ర‌ణ ద్వారానే విశ్వ‌స‌నీయ‌త‌

స్వీయ నియంత్రణ ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవడానికి పత్రికలు ప్రయత్నించాలన్నఉపరాష్ట్రపతి, సామాజిక సమరసత, సామాన్యుల గొంతుగా నిలవడం, అక్షరాస్యతను పెంచడం, లింగ వివక్షను రూపుమాపడం, శాంతి, సామరస్యం, జాతీయ భద్రత వంటి అంశాల్లో రాజీ పడొద్దని సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చడంలో మీడియా పాత్రను అభినందించిన ఆయన, మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, హరిత భవనాల నిర్మాణం వంటి అంశాలను కూడా ప్రజాఉద్యమాలుగా మార్చి భవిష్యత్ తరాలకు ఓ చక్కటి సమాజాన్నిఅందించడంలో మీడియా మరింత చొరవ తీసుకోవాలని సూచించారు.

రైతుల సాధికార‌త‌కు పట్టం క‌ట్టాలి

వ్యవసాయరంగ ప్రగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నకార్యక్రమాలు, అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు చేరవేయడం, అన్నదాతల్లో నూతన పరిశోధనలపై చైతన్యం తీసుకురావడంపైనా పత్రికలు ప్రత్యేక దృష్టి సారించాలన్న ఉపరాష్ట్రపతి, రైతుల సాధికారతకు పట్టం కట్టాలన్నారు.

సృజనాత్మకతను అల‌వ‌ర్చుకోవాలి

పత్రికారంగంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న విస్తృత అవకాశాల నేపథ్యంలో యువత ఈ రంగంపై దృష్టిసారించాలన్న ఉపరాష్ట్రపతి, సీనియర్ జర్నలిస్టుల వ్యాసాలు, రిపోర్టింగ్ తదితర అంశాలను అధ్యయనం చేయడంతోపాటు సృజనాత్మకతను అలవర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ప్రాణాలు కోల్పోయిన జ‌ర్న‌లిస్టుల‌కు నివాళులు

కరోనా సమయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించడంలో మీడియా చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులతోపాటు కరోనా మొదటి వరుస యోధులుగా జర్నలిస్టులు తమసేవలు అందించారని తెలిపారు. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు.

జ‌ర్న‌లిజానికి ఆద్యుడు మాధ‌వ్ విఠ‌ల్ కామ‌త్‌

సమయానుగుణంగా సంక్లిష్టమైన అంశాలపైనా చక్కటి విశ్లేషణలతో ప్రజలను, సమాజంలోని వివిధ వర్గాలను, మేధావులను ఆలోచింపజేసే రచనలతో కొన్నిదశాబ్దాల పాటు మీడియా ప్రపంచంలో మాధవ్ విఠల్ కామత్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. కామత్ పాత్రికేయ రంగం మీద తనదైన ముద్ర వేశారన్న ఆయన.. సమన్వయంతో పాటు సూచనలు చేసేలా ఉండే వారి వ్యాసాల్లోని విమర్శలను సైతం ప్రభుత్వాలు సానుకూలంగా స్వాగతించేవని తెలిపారు. ప్రసారభారతి మొట్టమొదటి చైర్మన్‌ బాధ్యతల్లోనూ వారి పాత్ర చిరస్మరణీయమన్నారు. అంతటి మహనీయుని శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సంవత్సరంలో ‘జర్నలిజం: గతం, వర్తమానం, భవిష్యత్తు’ అంశంపై స్మారకోపన్యాసాన్ని ఏర్పాటు చేయడం సందర్భోచితం, సముచితం అని నిర్వాహకులకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. విలువలను, సంప్రదాయాలను కాపాడుతూ కొంగొత్త ఆలోచనలు కల్పించిన ఆదర్శవంతమైన జర్నలిస్టు కామత్ అని ఉపరాష్ట్రపతి కొనియాడారు. నేటితరం జర్నలిస్టులు ఆయన రచనా పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎం.ఎ.హెచ్.ఈ. ప్రో-ఛాన్సలర్ డాక్టర్ హెచ్.ఎస్. భల్లాల్, ఉపకులపతి లెఫ్టినెంట్ జనరల్ ఎం.డి. వెంకటేశ్, మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ డాక్టర్ పద్మారాణి, అకాడమీ అధ్యాపకులు, విద్యార్థులు, పలువురు పత్రికారంగ ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Related posts

ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టు తప్పులు లేకుండా రూపొందించాలి

Satyam NEWS

మంత్రి కేటీఆర్ ను అడ్డుకున్న బిజెపి: ఎదురుదాడి చేసిన టీఆర్ఎస్

Satyam NEWS

సాయిబాబా ఆలయానికి ‌ఐఎస్ఓ సర్టిఫికేట్

Sub Editor

Leave a Comment