మేడారం మహాజాతర హుండీల్లోని కానుకల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క, సారాలమ్మ మహాజాతర వైభవంగా జరిగింది.ఈ నేపథ్యంలో వనదేవతల గద్దెల ప్రాంగణంలో దేవాదాయ శాఖ మొత్తం 494 హుండీలను ఏర్పాటు చేసింది. సమ్మక్క గద్దె వద్ద 202, సారలమ్మ గద్దె వద్ద 202, గోవిందరాజు గద్దె వద్ద 25, పగిడిగిద్దరాజు గద్దె వద్ద 28 హుండీలతోపాటు, 38 క్లాత్, రెండు బియ్యం హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు.
జాతర అనంతరం భక్తులు సమర్పించుకున్న కానుకలు హుండీల్లో నిండడంతో వీటిని మూడు రోజుల క్రితం హన్మకొండలోని టీటీడీ కల్యాణమండపంలో భద్రపరిచారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కానుకలను లెక్కిస్తున్నారు. తొలిరోజు 64 హుండీల లెక్కింపు పూర్తయ్యే సమయానికి రూ.కోటి ఒక లక్షా 50 వేల ఆదాయం లభించగా రెండో రోజు 65 హుండీలను లెక్కించారు.
ఇందులో రూ. ఒక తొంబై ఒక లక్ష ఇరువై ఆరు వేలు ఆదాయం గా లభించింది. రెండు రోజులుగా రెండు కోట్ల తొంబై రెండు లక్షల డెబ్భై ఆరు వేల రూపాయల ఆదాయం లభించినట్లు దేవాదాయశాఖ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, మేడారం ఈవో రాజేంద్ర తెలిపారు.కట్టుదిట్టమైన భద్రతకు తోడు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మేడారం హుండీలను 200 మంది సిబ్బంది లెక్కించనున్నట్లు వారు పేర్కొన్నారు.