సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రీరామరక్ష అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన ప్రచారంలో మంత్రి అల్లోల పాల్గొన్నారు.
వెంకటాద్రిపేట, ఖురాన్ పేట్, ద్యాగవాడ, కజ్బా, కోలిబండ, నగరేశ్వర్ వాడ, బాగులవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తిరుగుతూ వివరించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సందర్బంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని నేడు దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రగతిపథంలో దూసుకుపోతోందని తెలిపారు.
నిర్మల్ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రాబోవు రోజుల్లో మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామని మంత్రి అల్లోల తెలిపారు. పల్లెప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల చారి, సత్యనారాయణ గౌడ్, గండ్రత్ ఈశ్వర్, రాంకిషన్ రెడ్డి, మారుగొండ రాము, ధర్మాజీ రాజేందర్, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, భూషణ్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి అయ్యన్నగారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.