37.2 C
Hyderabad
April 30, 2024 13: 06 PM
Slider మహబూబ్ నగర్

ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోండి

#jupalli

యావత్ తెలంగాణ ప్రజలు సంఘటితమై ఉద్యమించడం వల్ల , అమరుల త్యాగాల పునాదులపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందనీ,  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఉదయం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్  సముదాయంలో  ప్రభుత్వ శాఖలపై  మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, వనపర్తి శాసన సభ్యుడు తూడి మేఘా రెడ్డి, మక్తల్ శాసన సభ్యుడు వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ శాంతి యుతంగా ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించుకుని ప్రపంచానికి, దేశానికి  తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదర్శంగా నిలిచారని కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో  గత పదేండ్లలో అనుకున్న ప్రగతిని సాధించలేక పోయామన్నారు. అన్ని రంగాల్లో పురోగతి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగలేదు కాబట్టి   తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో  ప్రజా సమస్యల పరిష్కారంలో,  ఆలోచన విధానంలో, పని విధానంలో, భాద్యతలు నిర్వర్తించడంలో స్పష్టమైన మార్పు కనబడే  విధంగా అధికారులు ప్రజలకు గౌరవం, ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయం చేకూర్చాలని  జిల్లా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రజా సేవకులం మాత్రమే అనే విషయాన్ని గుర్తించాలన్నారు. సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలతో మర్యాదగా మసలుకోవాలని హితవు పలికారు.

అంతిమంగా ప్రజల చేత శేభాష్ అనిపించుకునేలా అధికారులు పని తీరు ఉండాలని చెప్పారు. కబ్జా అయిన భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ పై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగాలన్నారు. అధికారులు ఇస్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న లెక్కలకు పొంతన లేదని, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదన్నారు. 

ఏజెన్సీకి మిషన్ భగీరథ  బిల్లులు ఇచ్చేముందు పంచాయతీ సెక్రటరీ లు, సర్పంచ్ ల సంతకాలు మాత్రమే కాకుండా గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులతో సైతం సంతకాలు తీసుకోవాలని సూచించారు.  మరో పది రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని ఆలోగా తప్పుడు నివేదికలు కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవిక నివేదికలు తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం రెవెన్యూ అంశాల పై చర్చ నిర్వహించగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ నివేదికను వినిపించారు. ధరణిలో ఇప్పటి వరకు 26900 దరఖాస్తులు వచ్చాయని అందులో ఇప్పటి వరకు  23 వేల పై చిలుకు దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందన్నారు.  మరో 3500 దరఖాస్తులు ఆయా కారణాల వల్ల పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా  గనులు మరియు భూగర్భ  శాఖకు సంబంధించి జిల్లాలో ఎన్ని మైన్స్ లు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఖనిజాలు ఎక్కడ వినియోగించారు, వచ్చిన ఆదాయం ఎంత, ఆదాయం ఎక్కడ వినియోగించారు అనే పూర్తి నివేదికను వాస్తవికతతో  తయారు  చేసి ఇవ్వాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న వనపర్తి శాసన సభ్యుడు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అన్ని రకాల పనులను తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబధిత శాఖల అధికారులను ఆదేశించారు.  పనులు ప్రారంభం కానీ వాటి గురించి పక్కన పెడితే నిర్మాణ పురోభివృద్ధి లో ఉన్న పనులను కాంట్రాక్టర్లు ఆపేయడం సమంజసం కాదన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మారిందని, కొన్ని శాఖల్లో ఇంకా మాజీ ముఖ్యమంత్రి చిత్ర పటాలు వేసుకొని ఉన్నారని, వాటిని మార్చల్సిందిగా సూచించారు.

మక్తల్ శాసన సభ్యుడు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జూరాల నుండి కుడి కాలువ ద్వారా యదావిధిగా నీరు పారుతుందని, ఎడమ కాలువకు మాత్రం ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.  మక్తల్ నియోజక వర్గంలో  ప్రస్తుత పంటకు  కనీసం రెండు తడులకు సాగు నీరు అందించే విధంగా అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరారు.  ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు.

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ అధికారులు తమ నివేదికలను వాస్తవిక దృక్పథం తో రూపొందించి ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ తిరుపతి రావు, అడిషనల్ ఎస్పీ తేజావత్ రాందాస్, ఆర్డీవో పద్మావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

లాక్ డౌన్ హెల్ప్: పేద కుటుంబాలకు రూ.5వేలు ఇవ్వాలి

Satyam NEWS

తెలంగాణ ఉద్యమ నేత జూపల్లి మరో ఉద్యమానికి సిద్ధం?

Satyam NEWS

రెండో సారి ఎన్నికై రికార్డు సృష్టించిన ఏలూరు మేయర్ నూర్జహాన్

Satyam NEWS

Leave a Comment