ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా నేపథ్యంలో ఒకే రోజులో అతి పెద్ద తప్పులు అలవోకగా, ఆవేశంలో ఆలోచన లేకుండా జరిగిపోయాయి. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు అతి పెద్ద తప్పులు చేయగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐదు తప్పులు చేశారు.
ముందుగా జగన్ చేసిన అతి పెద్ద తప్పు 1.రాష్ట్ర ఎన్నికల అధికారిని బహిరంగంగా విమర్శించడం: రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని చులకన చేసి మాట్లాడటం. ముఖ్యమంత్రి పదవిలో ఉండి రాజ్యాంగ వ్యవస్థల్ని చులకన చేసి మాట్లాడటం విపరీత పరిణామాలకు దారితీస్తుంది.
2. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి కులం గురించి మాట్లాడటం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కులం పేరుతో దూషించడం ఇప్పటి వరకూ జరగలేదు. ఇది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఏ వ్యక్తీ ఫలానా కులంలో పుట్టాలని కోరుకుని పుట్టడు.
రాజ్యాంగ స్థానంలో ఉండి కులం గురించి చులకనగా మాట్లాడటం రాజకీయ మైలేజీని ఇవ్వవచ్చేమోగానీ సభ్య సమాజం మాత్రం హర్షించదు. ఇప్పటికే కులాల కుంపటిగా తయారైన ఆంధ్రప్రదేశ్, ఈ పరిణామంతో మరింత దరిద్రంగా తయారవుతుంది.
ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన తప్పుల విషయానికి వస్తే 1. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కాన్ఫిడెన్సులోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం. కరోనా సాకు చూపించిన సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి నివేదిక తీసుకోవడంగానీ, వారితో సమీక్ష జరపడం కానీ చేసి ఒక నిర్ణయానికి రావాలి.
2. ముందు రాష్ట్ర గవర్నర్ ను వ్యక్తిగతంగా కలిసి నివేదిక సమర్పించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల అధికారి అంటే సర్వాధికారి కాదు.
3. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న విపరీత నిర్ణయం తీసుకునే ముందు అప్పటికి కరోనా కంట్రోలు అవుతుందా లేదా అప్పటికి కరోనా అదుపులోకి రాకపోతే ఏం చేయాలి అనే రూట్ మ్యాప్ క్లియర్ గా ఉండాలి. ఆరు వారాల తర్వాత కరోనా అదుపులోకి రాకపోతే ఏం చేస్తారు?
4. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన సందర్భంలో ఎన్నికల కోడ్ ను తక్షణమే ఎత్తివేయాలి. నిరవధికంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండకూడదు. ప్రభుత్వ విధులకు ఇది ఆటంకంగా మారుతుంది.
5. ఎన్నికలను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత అధికారులను సస్పెండ్ చేయడమో, బదిలీ చేయడమో హేతుబద్ధంగా లేదు.
సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్
1 comment
5 వ పాయింటు : ఎన్నికలు వాయిదా పడ్డాయి కాబట్టి
దౌర్జన్న్యాలు దాడులు చేసిన వారిని కళ్ళప్పగించి చూసిన శాఖల అధిపతులను వెదిలెయ్యాలా? వారిపై చర్యల అవసరం లేదా
తప్పులపై చర్యల కు హేతుబద్ధత ఏంటండీ
(అసలు తప్పులే జరగలేదని డబాయిస్తే అది వేరే విషయం)