29.7 C
Hyderabad
May 4, 2024 04: 20 AM
Slider సంపాదకీయం

తెలంగాణ లో బెడిసికొడుతున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు

#prashanthkishore

ఉద్యోగ నియామకాల భర్తీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రకటన తర్వాత వస్తున్న స్పందన ఏమిటి? ఈ ప్రశ్న సహజమైన రాజకీయ ఆసక్తి ఉన్నవారెవరికైనా కలుగుతుంది. వాస్తవానికి కేసీఆర్ ఈ ఖాళీల భర్తీపై ప్రకటించిన తర్వాత తెలంగాణ సమాజం మొత్తంగా సంతోషించి ఉండాల్సింది.

అయితే అలా జరగలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. తెలంగాణ రాజకీయాలలో బీహార్ కు చెందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోక్యం చేసుకుంటున్నారని…. లేదు తెలంగాణ రాష్ట్ర సమితి ఆయనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను అప్పగించిందని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ కు బాధ్యతలు అప్పగిస్తే అది పార్టీ అంతర్గత విషయంగా చూడాలి. అయితే తెలంగాణ సమాజంలో ప్రశాంత్ కిషోర్ కు కేసీఆర్ బాధ్యతలు అప్పగించడంపై సంచలనం కలిగింది. తెలంగాణ లో ఏ మనిషి ఎలా ప్రవర్తిస్తాడో, ఏ కులం ఏ రీతిన స్పందిస్తుందో, ఏ జిల్లాలోని వారి మనోభావాలు ఎలా ఉంటాయో క్షుణ్ణంగా తెలిసిన కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇస్తాడా? అనేది ప్రధాన ప్రశ్నగా మారడంతోనే ఈ చర్చ ఎక్కువ జరిగింది.

ఆంధ్రాలో అయితే జగన్ రాజకీయాలకు కొత్తవాడు. పైగా కులాలపై అంతగా పట్టు ఆయనకు ఉండే అవకాశం లేదు. పైగా చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడిని ఎదుర్కొవాలి… ఈ కారణాలతో ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకున్నారు. మరి కేసీఆర్ కు ఏం అవసరం వచ్చింది? అనేది ప్రధాన ప్రశ్న.

ముందే చెప్పినట్లు ప్రశాంత్ కిషోర్ కు బాధ్యతలు అప్పగించారని విస్తృతంగా ప్రచారం జరగడం, వెనువెంటనే కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులను పనికి మాలిన వాళ్లు, కుక్కలు అంటూ తిట్టడం జరిగిపోయింది. కేసీఆర్ ప్రధానిని, బిజెపిని ఈ స్థాయిలో తిట్టడం ప్రశాంత్ కిషోర్ వ్యూహమే అనే ఆలోచన అందరికి కలిగింది. కేసీఆర్ ప్రధానిని, బిజెపిని తిట్టడమే కాకుండా రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రకటించడంతో రాష్ట్రంలోని ఎస్ సి వర్గాలన్నీ భగ్గుమన్నాయి.

అంబేద్కర్ కు కేసీఆర్ చేస్తున్న అన్యాయంగా దళిత వర్గాలు భావించాయి. ఊరూరా ఉద్యమించాయి. అయితే దళితుల ఉద్యమానికి ఊపిరి అందించేవారు లేకపోవడంతో గ్రామ స్థాయిలోనే ఆ ఉద్యమం ఆగిపోయింది. అయితే దళితుల మనసులో మాత్రం కేసీఆర్ పట్ల ఒక రకమైన కోపం ఆరంభం అయింది. ఇలాంటి సంఘటన నేపథ్యంలో ఉద్యోగ ప్రకటన చేయడంతో తెలంగాణ సమాజం నుంచి ఆశించిన స్పందన రాలేదు.

పైగా ఇది కేవలం ఎన్నికల కోసం కేసీఆర్ చేస్తున్న వాగ్దానమని కూడా ఎక్కువ మంది నమ్ముతున్నారు. దాంతో కేసీఆర్ ఉద్యోగ నియామకాల ప్రకటన పై భిన్నవాదనలు రావడం ప్రారంభం అయింది. ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనే ప్రకటన కేసీఆర్ స్వయానా చేసింది కాదని, ఇది కేవలం ప్రశాంత్ కిషోర్ వ్యూహం మాత్రమేనని మరింత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గడువు కన్నా ముందుగానే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నారని అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ ఈ ప్రకటన చేయమని సలహా ఇచ్చారని కూడా ఎంతో మంది భావించారు.

ఎన్నికల కోసం కాదు… చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకే కేసీఆర్ ఈ ప్రయత్నం చేస్తున్నారు…. అని టీఆర్ఎస్ నాయకులు చెప్పడంలో విఫలం అయ్యారు. టీఆర్ఎస్ ఈ అంశాన్ని పాజిటీవ్ గా మార్చుకోవడానికి ఎంతగా విఫలం అయింది అంటే ‘‘ఇష్టం లేని వాళ్లు మోడీ ఇచ్చే ఉద్యోగాలకు అప్లై చేసుకోండి… మా ఉద్యోగాలు తీసుకోవద్దు’’ అని చెప్పే స్థాయికి వెళ్లింది.

అంటే సమాజంలో తలెత్తిన అపోహలు తీర్చడం మానేసి నిరుద్యోగులకు బెదరింపులు ఇచ్చే తీరుగా టీఆర్ఎస్ వాదనలు సాగడం కూడా చర్చనీయాంశం అయింది. తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేసినా ప్రజలు భరిస్తారు… సహిస్తారు… ఆయనను నమ్ముతారు. కానీ మధ్యలో ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వచ్చి చెప్పడం వల్ల కేసీఆర్ చేస్తున్నారు అనే వాదన రావడంతో కేసీఆర్ ప్రకటనకు రావాల్సిన పాజిటీవ్ స్పందన రావడం లేదు.

ప్రశాంత్ కిషోర్ వ్యూహం వల్లే కేసీఆర్ ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారు అనేది ఎక్కువ మంది నమ్ముతుండటంతో టీఆర్ఎస్ కు చిక్కులు మొదలవుతున్నాయి. కేసీఆర్ పై ఇంత కాలం గుడ్డి ప్రేమ పెట్టుకున్న వారంతా కూడా గతంలో కేసీఆర్ ఏం చేసినా, ఏం చెప్పినా వినేవారు పాటించేవారు. అయితే ఇప్పుడు కేసీఆర్ చెబుతున్నది, చేస్తున్నది ప్రశాంత్ కిషోర్ గైడ్ లైన్స్ తోనే అనేది విస్తృతంగా ప్రచారం కావడంతో కేసీఆర్ మాటకు విలువ తగ్గింది. ప్రశాంత్ కిషోర్ రాకతో కేసీఆర్, వ్యూహకర్త స్థానం నుంచి సాధారణ రాజకీయ నాయకుడి స్థాయికి పడిపోయారు.  

Related posts

పాక్ సీజేగా మహిళా జస్టిస్‌ అయేషా మాలిక్‌

Sub Editor

దళిత కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

పోలీసు నిబంధనలపై సోషల్ మీడియాలో అవాకులుచవాకులు

Satyam NEWS

Leave a Comment