37.2 C
Hyderabad
May 2, 2024 11: 36 AM
Slider సంపాదకీయం

న్యాయవ్యవస్థతో ఘర్షణ నివారణకు మోదీ చర్యలు

#Kiran Rijiju

న్యాయ వ్యవస్థతో తరచూ ఘర్షణకు దిగుతున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజును ఆ శాఖ నుంచి తప్పించడం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సముచిత నిర్ణయమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. కిరన్ రిజిజు చాలా కాలంగా న్యాయవ్యవస్థ స్వతంత్రతపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే కాకుండా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించడంలో జాప్యం చేయడం, కొన్ని సందర్భాలలో వాటిని తిప్పి పంపడం లాంటి చర్యలకు ఆయన పాల్పడుతున్నారు.

ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థతో తరచూ సంఘర్షణాత్మక వాతావరణ ఏర్పడుతున్నది. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తరచూ తీర్పులు చెప్పడం వల్లే న్యాయ శాఖ మంత్రి ఇలా వ్యవహరిస్తున్నారని అందరూ అనుకునే పరిస్థితి ఏర్పడింది. కొలీజియం సిఫార్సులను మంత్రి ఆమోదించకపోవడం కూడా ఇందుకేననే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి.

ఈ నేపథ్యంలో అటు న్యాయవ్యవస్థకు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తరచూ పరువుకు భంగం కలుగుతున్నది. ఇలాంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు. అయితే తాము వ్యతిరేక తీర్పులు ఇవ్వడం వల్లే కేంద్రం ఇలా ప్రవర్తిస్తున్నదని సుప్రీంకోర్టు బాధ్యులు, తాము కొలీజియం నిర్ణయాలకు అడ్డు చెప్పడం వల్లే తమకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ బాధ్యులు భావించడం జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా చివరకు కేంద్ర ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుంది.

ఇప్పటికే ఈ పరిస్థితి దాపురించడంతో ప్రధాని ఏదోఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ప్రవర్తించడం కరెక్టు కాదని ఆయన కూడా భావించినందునే న్యాయ శాఖ నుంచి కిరన్ రిజిజును అకస్మాత్తుగా తొలగించారని అంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవ్యవస్థతో ఘర్షణ వాతావరణం ఉండకూడదని ఆయన స్థిరంగా భావిస్తున్నట్లు కూడా ఈ నిర్ణయంతో వెల్లడి అవుతున్నది. కిరన్ రిజుజును న్యాయ శాఖ నుంచి తొలగించడం సముచిత నిర్ణయం అని చెప్పవచ్చు.

Related posts

భావ కవితలకు హైదరాబాద్ పాతనగర కవుల వేదిక ఆహ్వానం

Satyam NEWS

మద్యం దొరక్క మతి భ్రమించి దూకేశాడు

Satyam NEWS

ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో రూ.5 కోట్ల బంగారం స్మగ్లింగ్

Satyam NEWS

Leave a Comment