27.7 C
Hyderabad
May 7, 2024 10: 01 AM
Slider ప్రత్యేకం

ఎనాలసిస్: మోదీనే భారత్, భారత్ అంటేనే మోడీ

#Narendra Modi New

(సత్యం న్యూస్. నెట్ ప్రత్యేకం)

ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు నరేంద్ర దామోదరదాస్ మోదీ.. భారతీయ జనతా పార్టీ శ్రేణులు, పార్టీ సానుభూతిపరులకు మోదీనే సర్వస్వం. మెజారిటీ ప్రజలు కూడా మోదీ అంటే ఇష్టంతోనే ఉన్నారు. మోదీ భారతప్రధానిగా ఉన్నకారణంగానే కరోనా సృష్టించిన విధ్వంసాన్ని విజయవంతంగా ఎదుర్కోగలిగామని ఎంతో మంది ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఆరెస్సెస్ పంచన పెరిగి… గుజరాత్ ర్రాష్టాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించి, అప్పటి యూపీఏ-2 ను గద్దెదించడానికి ధీటైన నాయకుడిగా బీజేపీ గుర్తించడానికి మోదీ విలక్షణ శైలి మొదటి కారణం. నేటితరం నాయకులలో లేని వాక్పటిమతో, రాజకీయ చతురతతో జనరంజక పాలన ఒక్క మోదీతోనే సాధ్యం కాగలదని అంచనా వేసిన బీజేపీ పార్టీ కలనిజమైంది.

తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన మోదీ

తిరుగులేని మెజారిటీ తో పార్టీని సైతం శాసించే స్థాయికి మోదీ ఎదిగిన వాస్తవాన్ని అధిష్టానం గుర్తించేనాటికి ఆయన ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. కేంద్రంలో ఉన్నది బీజేపీలో నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమన్న నిజం దాదాపు కనుమరుగై పోయింది. మీడియా సైతం ‘ మోదీ ప్రభుత్వం’ అనివ్యవహరించే  స్థాయిని అంతలా పెంచుకున్నారు.

ఒకప్పుడు ఇందిరాగాంధీ… కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన పరిధులను, పరిమితులను తుడిచేసి అంతాతానై నడిపించిన తీరును మళ్ళీ మోదీ అనుసరిస్తున్నట్లు ఉందని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఇందిరాగాంధీ బడుగు, బలహీన వర్గాలపై  పట్టు సంపాదించిన పంథాలోనే మోదీ అడుగులు పడుతున్నట్లు ఎన్డీయే -2 తొలినాళ్ళలోనే పరిశీలకులు పసిగట్టారు.

సమస్యల పరిష్కారంలో చాకచక్యం

నియంతృత్వ పోకడలు పైకి కనిపించకుండా తనదైన విలక్షణ శైలిలో పావులు కదుపుతున్న వైఖరి బీజేపీ పార్టీ పెద్దలను ఆశ్చర్యపరుస్తోంది. సబ్ కా సాథ్…సబ్ కావికాస్.. సబ్ కా విశ్వాస్ అన్న స్ఫూర్తి దాయక నినాదం దేశ ప్రజల్లో నూతనోత్సాహం నింపింది.

చాలా కాలం నుంచి వేధిస్తున్న  సమస్యలను చాకచక్యంగా పరిష్కరించి ఇటు ప్రభుత్వం లో…అటు పార్టీలో తనకు తిరుగులేదని వెల్లడించారు. వివాదాస్పమైన ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళ లకు ఊరటనిచ్చే  త్రిపుల్ తలాక్ చట్టం వంటి సాహసోపేత నిర్ణయాలు మోదీ స్థాయిని అమాంతం పెంచేసాయి.

విదేశీ మాధ్యమాలు కూడా కీర్తిస్తున్నాయి

ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడానికి మోదీ తీసుకున్న పలు కార్యాచరణలను దేశీయ, అంతర్జాతీయ మాధ్యమాలు ప్రశంసించడం గమనార్హం. తన అనుంగు సహచరుడు, అత్యంత విశ్వసనీయుడైన అమిత్ షా కి కీలకమైన హోం మంత్రిత్వశాఖను కట్టబెట్టి మిత్రధర్మాన్ని నిలబెట్టడం సాహస చర్యగా పార్టీ అభివర్ణించింది.

 అప్పటినుంచి మిత్ర ద్వయం నిర్ణీత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తున్న తీరు ప్రతిపక్షాలను సైతం నివ్వెరపరుస్తోంది. మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడి పోయినా, విభజించు…పాలించు సూత్రం ప్రయోగించి కొన్ని రాష్ట్రాలలో అధికారం చేపట్టడం బీజేపీ లోని కొందరు సీనియర్ నాయకులకు నచ్చలేదు. ఐనా…. మోదీ తన పట్టుదలను విడిచిపెట్టలేదు.

అంతర్జాతీయ స్థాయిలో కూడా సమ్మోహన శక్తి

మరోవైపు…..ఇరుగుపొరుగు దేశాతోనే గాక, అనేక చిన్నాపెద్దా దేశాలతో దేపాక్షిక సంబంధాలు పెంచుకోవడంలో కృతకృత్యులు కావడంతో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ప్రపంచస్థాయి నాయకులలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి స్థానములో ఉండగా, మోదీ రెండవ స్థానానికి చేరడం భారత దేశానికి లభించిన అరుదైన ,అద్భుతమైన గౌరవం. అయితే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం లక్షించిన రెండంకెల వృద్ధి రేటు కేవలం మాటలకే  పరిమితమైనట్లు ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.

కొన్ని రంగాలలో తప్పటడుగులు

 భారతదేశానికి వెన్నెముక గా అభివర్ణించిన వ్యవసాయ రంగం అన్ని రకాలుగా అన్యాయానికి గురవుతోందని వ్యవసాయరంగ విశ్లేషకులు మోదీ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ప్రముఖ నిపుణులు డా. స్వామినాథన్  చేసిన నిర్మాణాత్మక సూచనలు పట్టించుకుంటే అధికశాతం రైతాంగం వెతలు తీరగల అవకాశం ఉందని వారు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

రైతుల ఆత్మహత్యలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. నాసిరకం విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు, పండించిన పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించకపోవడం తో భారతీయ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు భీమా పథకం, బ్యాంకులద్వారా లభించా ల్సిన రుణ సదుపాయాలకు అర్ధం లేని నిబంధనలు రైతు కుటుంబాలకు క్షోభను కలి గిస్తున్నాయి..

ఆశించిన స్థాయిలో ఫలితాలు అంద కపోవడంతో చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలు పల్లెలను విడిచి నగరాలకు చేరుకుని వలసకార్మికులుగా దుర్భర జీవితం అనుభవిస్తున్న దృశ్యాలు మోదీ బృందానికి కనిపించకపోవడం దారుణమంటున్నారు రాజకీయ విమర్శకులు.

మోదీకి చెడ్డపేరు తెచ్చిన వలసకార్మికుల కష్టాలు

ప్రస్తుత కరోనా సంక్షోభం దాడి కి బలై ఇప్పటికీ సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి ముప్పుతిప్పలు పడుతున్న వలస కార్మికులలో అధికశాతం వ్యవసాయ కార్మికులే కావడం గమనార్హం. సకాలంలో సరైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోని కారణంగా లక్షలాది వలస జీవుల బతుకులు వీధుల పాలైనట్లు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

మోదీ ప్రభుత్వం సాధారణ ప్రజలను గాలికి వదిలేసిందన్న అప్రతిష్ట ను మూటగట్టుకోవడం పెద్ద దెబ్బగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా సంక్షోభానికి పూర్వకాలంలో మోదీ ప్రభుత్వానికి పలు కోణాలలో సెగలు తగిలాయి. వాటిలో అత్యంత కీలకమైనది జాతీయ పౌరసత్వ చట్టం సవరణ(సీ ఏ ఏ) కు నిరసనగా దేశవ్యాప్తంగా రాజుకున్న వ్యతిరేక ఉద్యమం. అతి సున్నితమైన, మత పరమైన అంశాన్ని ప్రజల లోకి సానుకూలంగా తీసుకు వెళ్లాల్సిన ప్రభుత్వం సీ ఏ ఏ విషయంలో ఘోరంగా విఫలమైందని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

అంతే కాక, కొన్ని రాష్టాలలో పెరుగుతున్న ప్రత్యేక హోదా ఆశిస్తూ చేస్తున్న పోరాటాలు విషయం లో కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తుందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని పశ్చిమ బెంగాల్, తెలంగాణా వంటి బలమైన రాష్టాలు బహిరంగంగా విమర్శిస్తున్నాయి.

అతలాకుతలమైన ఆర్ధికాన్ని బాగు చేయాలి

కరోనా దెబ్బకు అతలా కుతలమైన ఆర్థిక వ్యవస్థ లకు జవజీవాలు అందించాల్సిన  క్లిష్టదశలో కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే వెంపర్లాడడం సహేతుకం కాదని విమర్శలు వచ్చిపడుతున్నాయి.

ఆత్మ నిర్భర్ పేరుతో ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల భారీప్యాకేజీ దేశంలో ఉన్న ఏఏ రంగాలను ఏఏ స్థాయు ల్లో స్వయం ఉద్ధరణకు ఉద్దీపన చేసిందో కొద్దికాలం లో తేలనుంది. హిందుత్వ అజెండా అంతర్లీనంగా ప్రతిబింబిచేలా మోదీ ప్రభుత్వం ప్రతి ప్రణాళిక అమలుకు పథకరచన చేస్తుందన్న బలమైన ఆరోపణలు నిజం కాదని 130 కోట్ల భారత ప్రజానీకానికి చెప్పాల్సిన బాధ్యతను మోదీ ప్రభుత్వం స్వీకరించి, సర్వజనరంజక  పాలనలో భాగంగా సంస్కరణలకు సిద్ధం కావాలని వస్తున్న సూచనలను పరిగణిస్తే మంచిది.

మోదీ వ్యక్తిగత ఆకర్షణ ఒక్కటే సువిశాల భారత దేశాన్ని ఒక్కటిగా ఉంచజాలదని ఎన్ డీ ఏ  ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య రాజకీయ పార్టీలు కూడా గ్రహిస్తే సంకీర్ణ ధర్మం ఆశించిన స్థాయిలో నెరవేరుతుంది.

కృష్ణారావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కారు విఫలం

Satyam NEWS

మునిసిపాలిటీ ఆస్తులను అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలి

Satyam NEWS

నాలుగో విడ‌త‌లో 13,830 మందికి వాహ‌న‌మిత్ర ఆర్ధిక‌ స‌హాయం

Satyam NEWS

Leave a Comment