అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా మండే అగ్నిగోళం సూర్యుడి ధృవాల చిత్రాలను బందించి మానవాళికి అందించటానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)లు సంయుక్తంగా తయారు చేసిన సోలార్ ఆర్బిటర్ అంతరిక్ష నౌక సోమవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు రూ.10 వేల కోట్ల ఖర్చుతో రూపొందించిన ఈ అంతరిక్ష నౌకను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అలియన్స్ అట్లాస్–వీ రాకెట్ సాయంతో నింగిలోకి పంపినట్లు నాసా తెలిపింది.
ఈ ప్రయోగం విజయవంతమైన సంకేతాలు జర్మనీలోని యురోపియన్ స్పేస్ సెంటర్‌కు అంతరిక్ష నౌక నుంచి వచ్చినట్లు నాసా తెలిపింది. ప్రయోగించిన రెండు రోజుల తర్వాత ఈ సోలార్ ఆర్బిటార్ భూమి మీదకు సమాచారాన్ని చేరవేసేందుకు ఆంటెన్నాలు అంతరిక్షంలో విచ్చుకుంటాయి. బుధగ్రహం కక్ష్యలో తిరగుతూ సూర్యుడి ధృవాల చిత్రాలను తీసి స్పేస్ సెంటర్ కు అందించనుంది.