37.2 C
Hyderabad
May 6, 2024 12: 04 PM
Slider సంపాదకీయం

కాంట్రవర్సీ: నేలవిడిచి సాముచేస్తున్న వైసీపీ నేతలు

jagan 21

ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్ నుంచి రాష్ట్ర మంత్రులు కింది స్థాయి నాయకుల వరకూ తనను హెచ్చరిస్తూ, బెదిరిస్తూ తనపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నందున తనకు రక్షణ లేదని కేంద్ర హోం శాఖ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసిన లేఖ నిజమైనదా కాదా?

యల్లో మీడియా సృష్టించి ప్రచారం చేసినదా అనే సందేహం అధికార వైసీపీ నాయకులకు ఇప్పటికైనా తీరి ఉంటుందని భావించాలి. ఆ లేఖ బయటకు రాగానే ఆ లేఖలోని అంశాలు పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపట్టి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగి ఉండేది.

ఆ లేఖలో ఏమి ఉన్నది అనే అంశంపై కాకుండా ఎందుకు రాశారు అనే ప్రశ్న వద్దే అధికార పార్టీ ఆగిపోవడంతో విషయం రచ్చ రచ్చ అయింది. ఎన్నికల కమిషనర్ రాసిన లేఖ విషయం కన్నా వైసీపీ నాయకులు చేసిన రాద్ధాంతం పెద్దగా కనిపించింది.

ఈ లేఖ ఎన్నికల కమిషనర్ రాసిందా కాదా అనే విషయంపై దర్యాప్తు జరపాలని కోరడంతో అధికారంలో ఉన్న పార్టీ పరువు కాస్తా పోయింది. లేఖ విషయంపై ఒక్క రోజు మౌనంగా ఉన్నా అధికార పార్టీ పరువు నిలిచి ఉండేది. అలా కాకుండా ఎంతో తొందరపాటును ప్రదర్శించారు. అధికారంలో ఉండి ఆ లేఖ నిజమైనదా కాదా అని తెలుసుకోలేక అభాసుపాలయ్యారంటే పాపం అనుకోక తప్పదు.

పైగా కేంద్ర హోం శాఖ తో తమ అధికారులు మాట్లాడారని, వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈమెయిల్ నుంచే వచ్చినట్లుగా ఉంది, మేం కూడా ఖరారు చేసుకోవాలి అని చెప్పినట్లు వైసీపీ నేతలు అన్నారు. అప్పటికీ వారు ఆగకుండా ఎన్నికల కమిషనర్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మతి భ్రమించిందని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ మైలేజీని ఇస్తాయేమో కానీ అధికార పార్టీకి హుందాతనాన్ని ఇవ్వవు. అధికారం కోల్పోయినా అంతా చంద్రబాబే చేయిస్తుంటే మీరు ఇక అధికారంలో ఉండి ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న ఇప్పటి వరకూ ప్రజలు వేయడం లేదు కానీ ఇదే వైఖరిని అధికార పార్టీ కొనసాగిస్తే మాత్రం ఆ ప్రశ్న వస్తుంది.

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిమ్మగడ్డ లేఖ పై స్పందిస్తే లేఖ నిజమైనదో కాదో తెలుసుకోకుండానే స్పందించడం అవివేకమని ఆయనను కూడా ఆడిపోసుకున్నారు. బోగస్ లేఖగా వైసీపీ నేతలు చెప్పిన ఆ లేఖలో ప్రస్తావించిన విధంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ హైదరాబాద్ నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించారు.

ఈ ఒక్క చర్యతో రాష్ట్రం పరువు గంగలో కలిసినట్లయింది. ఆవేశంతోనే రాజకీయ ప్రేరణ తోనో ఉండేవారికి ఇది పెద్ద విషయంగా కనిపించకపోవచ్చు. పైగా ఎన్నికల అధికారిని రాష్ట్రం నుండి తరిమి కొట్టాం అని విజయ గర్వం కూడా ఉంటే ఉండవచ్చు కానీ పాలనా పరంగా ఇది అత్యంత దారుణ వైఫల్యం.

రాష్ట్రంలో ఏకగ్రీవ ఎన్నికలపై ఆ లేఖలో పేర్కొన్న విషయాలను ప్రస్తావిస్తూ 151 స్థానాలు వచ్చిన మాకు ఆ స్థాయిలో ఏకగ్రీవాలు కావా? అంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా అలాగే జరుగుతుంది అని చెప్పేందుకు వీలు ఉండదు.

ఢిల్లీ పార్లమెంటు ఎన్నికలలో ఏడుకు ఏడు స్థానాలు గెలుపొందిన బిజెపి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 70 స్థానాలకు గాను 7 స్థానాలలో గెలిచింది. అందువల్ల ఓటరు తీర్పు టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా ఉండదు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు 90 శాతం మేరకు  అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. అందులో సందేహం లేదు.

అయితే ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన తీరును ప్రస్తావిస్తూ ఎన్నికల కమిషనర్ తన లేఖలో పేర్కొన్నారు. లేఖలో ఉన్న అంశాలను విశ్లేషించుకుని ఆలోచిస్తే వైసీపీ రాబోయే రోజుల్లో మరింత పకడ్బందిగా ఎన్నికల ప్రణాళిక గానీ మరొకటి గానే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎన్నికల కమిషనర్ లేఖ రాయగానే కంగారుపడిపోయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిట్టడం, చంద్రబాబునాయుడిని తిట్టడం, ఇద్దర్నీ కలేసి కులంతో తిట్టడం మొదలు పెడితే దీర్ఘ కాలంలో నష్టం జరిగేది వైసీపీకే. జరిగిన తప్పులపై దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా చంద్రబాబునాయుడిని తిట్టి కమ్మేతర కులాల్లో ఆవేశం రెచ్చగొట్టి కాలం గడపుదామనుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా దీర్ఘకాలిక వ్యూహం కాజాలదు.

Related posts

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

కోనసీమ రాజకీయాలతో జగన్ రెడ్డి కుయ్యో.. మొర్రో..

Satyam NEWS

దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్న వైసీపీ

Bhavani

Leave a Comment