38.2 C
Hyderabad
May 5, 2024 19: 24 PM
Slider ముఖ్యంశాలు

ఆరోగ్య ఆంధ్ర‌ప్ర‌దేశే ల‌క్ష్యంగా వైద్య రంగంలో సంస్క‌ర‌ణ‌లు

#vidudalarajini

ఆరోగ్య ఆంధ్ర‌ప్ర‌దేశే ల‌క్ష్యంగా రాష్ట్రంలో వైద్య రంగంలో భారీ సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చామ‌ని దాని ఫ‌లితంగానే పేద పిల్ల‌ల‌కు అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో కూడిన వైద్య విద్య సుల‌భంగా చేరువ‌వుతోంద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చొర‌వ‌తో రాష్ట్రంలో 1850 కోట్ల‌తో 17 వైద్య క‌ళాశాల‌లు ఏర్పాటు అవుతున్నాయ‌ని వాటిలో నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేసుకున్న ఐదు క‌ళాశాల‌లు ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి అందుబాటులోకి వ‌స్తున్నాయ‌ని చెప్పారు.

వాటిలో సెప్టెంబ‌ర్ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయ‌ని తెలిపారు. ఉత్త‌రాంధ్ర‌కే త‌ల‌మానికంగా విజ‌య‌న‌గ‌రం వైద్య క‌ళాశాల నిలవ‌నుంద‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాసరావు, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ శ్రీధ‌ర్ రెడ్డి, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి వైద్యారోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ  వైద్య క‌ళాశాల నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. స్కిల్ ల్యాబ్‌, ప్ర‌ధాన క‌ళాశాల భ‌వ‌నం, అడ్మినిస్ట్రేష‌న్ బ్లాక్, స‌మావేశ మందిరాల‌ను ప‌రిశీలించిన మంత్రి రజనీ సంతృప్తి వ్య‌క్తం చేశారు. ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా స్థానిక వైద్యులు, విలేక‌రుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. గ‌త నాలుగేళ్ల‌లో వైద్య రంగంలో తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. పేద‌లకు ఆధునిక స‌దుపాయాల‌తో కూడిన వైద్యం, పేద పిల్ల‌ల‌కు అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో కూడిన వైద్య విద్య‌ను అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంద‌ని దానిలో భాగంగానే రాష్ట్రంలో 17 వైద్య క‌ళాశాల‌లు ఏర్పాటు చేస్తున్నామ‌ని వివ‌రించారు. తొలి విడ‌త‌లో ఈ విద్యా సంవ‌త్సరం నుంచి ఐదు క‌ళాశాల‌ల‌ను అందుబాటులోకి తీసుకురానున్నామ‌ని పేర్కొన్నారు.

విజ‌య‌న‌గ‌రం మెడిక‌ల్ కాలేజీతో పాటు మిగిలిన నాలుగు క‌ళాశాల‌ల‌ను విజ‌య‌న‌గ‌రం వేదిక‌గా సీఎం జగీ ప్రారంభించ‌నున్నార‌ని మంత్రి  రజని వెల్ల‌డించారు. ఈ ఐదు క‌ళాశాల‌ల్లో 750 సీట్ల‌ను భ‌ర్తీ చేయనున్నామని తెలిపారు. జీరో వేకెన్సీ పాల‌సీలో భాగంగా వైద్య రంగంలో 50 వేల‌కు పైగా ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టామ‌ని మంత్రి వివ‌రించారు.సీఎం జగన్ విజ‌న్ వ‌ల్ల రాష్ట్రంలో వైద్యారోగ్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చామ‌ని దానిలో భాగంగానే ఆరోగ్య శ్రీ‌లో 3,257 ర‌కాల రోగాల‌కు సేవ‌లందిస్తున్నామ‌ని, వైఎస్సార్ క్లీనిక్లు, ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని, 16 వేల కోట్ల‌తో నాడు నేడు ప‌నులు చేప‌ట్టామ‌ని వెల్ల‌డించారు.

తండ్రీ కొడుకుల కృషి వ‌ల్ల 19 వైద్య క‌ళాశాల‌లు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ హ‌యాంలో రెండు వైద్య క‌ళాశాల‌లు వచ్చాయ‌ని, సీఎం జగన్ హయాంలో మ‌రో 17 క‌ళాశాల‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. తండ్రీ కొడుకుల కృషి ఫ‌లితంగానే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు 19 వైద్య క‌ళాశాల‌లు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని గుర్తు చేశారు. విజ‌య‌న‌గ‌రం కేంద్రంగా చేప‌ట్టిన వైద్య క‌ళాశాల ప‌నులు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ వ‌ల్లే ఇంత త్వ‌ర‌గా పూర్త‌య్యాయని, వ‌చ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయిలో అయిపోతాయ‌ని పేర్కొన్నారు.

ప‌నుల పూర్తికావటంలో జిల్లా యంత్రాంగం మంచి చొర‌వ‌ క‌న‌బ‌రిచింద‌ని కితాబిచ్చారు. గిట్ట‌ని వాళ్లు చెబుతున్న‌ట్లు రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ‌కు గానీ, పేద విద్యార్థుల‌కు గానీ ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని, పార‌ద‌ర్శ‌కంగా సీట్ల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను చేప‌డ‌తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, సంక్షేమం విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏ విధంగానూ రాజీప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని మంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా వైద్య క‌ళాశాల ప్రారంభోత్స‌వంతో పాటు, గిరిజ‌న యూనివ‌ర్శిటీ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయనున్నామ‌ని మంత్రి వివ‌రించారు.

పేద‌ల‌కు సూప‌ర్ స్పెషాలిటీ వైద్య సేవ‌లు

విజ‌య‌న‌గ‌రం కేంద్రంగా నిర్మిత‌మవుతున్న వైద్య క‌ళాశాల అందుబాటులోకి వ‌స్తే ఉపాధి, ఉద్యోగాలు పెర‌గ‌టంతో పాటు ఉమ్మ‌డి జిల్లా ప్ర‌జ‌ల‌కు సూప‌ర్ స్పెషాలిటీ వైద్య సేవ‌లు అందుతాయ‌ని డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి ఆశాభావం వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి దూర‌దృష్టితో ప్ర‌తి జిల్లాకూ వైద్య క‌ళాశాల వ‌స్తోంద‌ని, ఫ‌లితంగా వైద్య సేవ‌లు పేద విద్యార్థుల‌కు, పేద ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌వుతాయ‌ని పేర్కొన్నారు.

జిల్లా ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ నెర‌వేరుతుంద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల ఆధ్వ‌ర్యంలో జిల్లాకు ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఒన‌గూరాయ‌ని గుర్తు చేసుకున్నారు. విజ‌య‌న‌గ‌రం వైద్య క‌ళాశాల రాక‌తో పేద ప్ర‌జ‌ల ఆరోగ్యానికి పూర్తి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని డిప్యూటీ స్పీక‌ర్ అన్నారు.ఈకార్య‌క్ర‌మంలో జిల్లా పరిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మయూర్ అశోక్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ శ్రీ‌ధ‌ర్ రెడ్డి, వైద్య క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. ప‌ద్మ‌లీల‌, డీఎంహెచ్వో డా. భాస్క‌రరావు, వివిధ విభాగాల అధిప‌తులు, వైద్యులు, విద్యార్థులు త‌దితరులు పాల్గొన్నారు.

Related posts

హుజురాబాద్ లో మోడీ ఫోటో దాచిపెట్టి ఈటల ప్రచారం

Satyam NEWS

వనపర్తి నమ్మ చెరువు కట్ట ఆక్రమణకు  గురి కాకుండా కాపాడాలి 

Bhavani

అధికారంలోకి వచ్చేది మేమే… పోలీసులూ జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment