26.7 C
Hyderabad
May 3, 2024 09: 47 AM
Slider జాతీయం

ప్రేమతోనా….? ప్రత్యామ్నాయం లేకనా…??

#NarendraModi

(సత్యంన్యూస్ ప్రత్యేకం)

తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో భాజపా విజయం  2024 పార్లమెంట్ ఎన్నికలకు భావి సూచిక అని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే… 2024 నాటికి రాజకీయ పరిస్థితుల్ని ఇప్పుడే ఊహించడం కష్టం. ఎందుకంటే… బలమైన  కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు అనే భావన ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే అంశం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై జాతీయ స్థాయి చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో బహుళ పార్టీల వ్యవస్థ ఉండడం అతి సహజం. భారత ఎన్నికల సంఘం – సెప్టెంబర్ 2021 పబ్లికేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో భారత  జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, బీ ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్ పీ పీ, ఎన్ సీ పీ వంటి 8 జాతీయ పార్టీలతో పాటు 54 రాష్ట్రస్థాయి పార్టీలు, 2797 గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆయా రాష్ట్రాల స్థానిక సమస్యలు, ప్రభుత్వాల పనితీరు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపర నిర్ణయాలు వాటి అమలు తీరు వంటి అనేక అంశాల ప్రాతిపదికగా ఆయా పార్టీల మధ్య ఓట్ల విభజన జరుగుతుంది. కొన్ని సందర్భాలలో అధికార పార్టీపై అసంతృప్తి ఉన్నా ప్రత్యామ్నాయం లేని కారణంగా ఓటర్లు అదే పార్టీకి మద్దతు ఇవ్వడం విశేషం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో అదే జరిగిందని విశ్లేషకుల అభిప్రాయం. 

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రాబట్టుకోవడంలో ఈ రాష్ట్రాలలో ప్రతిపక్షాల వ్యూహాలు ఫలించలేదు. ఇక పంజాబ్ విషయంలో  అధికారపక్షం కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భాజపా వరుస విజయాల పై చోటుచేసుకుంటున్న పలు రాజకీయ విశ్లేషణలలో అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి.

ప్రత్యామ్నాయం లేకనే ఇంత వైభవమా?

భాజపా ఏక పక్ష గెలుపుకు ప్రధాని మోదీ వ్యక్తిగత ఆకర్షణ, హిందుత్వ భావజాలం, సంక్షేమ పథకాలు, జాతీయత… అన్నిటికంటే భాజపా కు ధీటైన  ప్రత్యామ్నాయం లేకపోవడం వంటివి ప్రధాన కారణాలు అని వాటి సారాంశం. ఈ వాదనలో కొంత మేర నిజం లేకపోలేదు. కానీ …. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా 2024 ఎన్నికల ఫలితాలు అంచనా వేయడం సమర్థనీయం కాదని ప్రముఖ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ జవసత్వాలు కూడగట్టుకుని బరిలో నిలబడితే ఓట్ల శాతంలో మార్పులు రావచ్చని ఆయన ఊహిస్తున్నట్లు మీడియాలో ఒక వర్గం అంటోంది. కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేతలతో కూడిన  జీ- 23 నేతల సూచనల మేరకు పార్టీ ప్రక్షాళన జరగాలని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అధిష్టానానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో… ఒకసారి గత మూడు లోక సభ ఎన్నికలలో కాంగ్రెస్, భాజపాలకు వచ్చిన ఓట్ల శాతం పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ in 29% , భాజపా 19% , 2014 లో భాజపా 31 % , కాంగ్రెస్ 20%, 2019 ఎన్నికలలో భాజపా 37% , కాంగ్రెస్ 29 % ఓట్లు దక్కించుకున్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం ప్రస్తుతం దేశంలోని మొత్తం 4123  అసెంబ్లీ స్థానాలలో భాజపా సుమారు 1376 చోట్ల ఎమ్ ఎల్ ఏ లను కలిగి ఉంది.

కమలనాథుల స్పీడును ఆపేశక్తి ఎవరికీ లేదు…..

అంటే…మెజారిటీ స్థానాలు మిగిలిన రాజకీయ పార్టీల చేతిలో ఉన్నాయి. అయితే… 2024 లో భాజపా గెలుపును నిరోధించే శక్తి గానీ,పటిష్ట యంత్రాంగం గానీ కాంగ్రెస్ తో సహా వేరే ఏ పార్టీకీ లేవన్నది నిర్వివాదాంశం. భాజపా వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలప్రదం కాగలవు అనేది వాటి మధ్య సఖ్యత, పరస్పర అవగాహన పై ఆధారపడి ఉంటాయి. కాంగ్రెస్ లేని కూటమి ప్రయత్నం అసాధ్యమని ఇటీవల మహారాష్ట్రకు  చెందిన ఎంపీ అన్నారు.

కానీ.. కార్యాచరణ ప్రక్రియలో కాంగ్రెస్ మిత్ర పక్షాల తో ఉదారంగా వ్యవహిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఒక వేళ భాజపా వ్యతిరేక కూటమి ఏర్పడితే దానికి నేతృత్వం వహించాల్సిన విషయంలో ఏకాభిప్రాయం కుదరడం అసాధ్యమని రాజకీయ పరిశీలకుల భావన. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో భాజపా ఎత్తుగడ మరోలా ఉంటుంది. భాజపా ఉనికి ఉన్న రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయడానికి కసరత్తు ప్రారంభిస్తుంది

.ప్రధానంగా దక్షిణాది  రాష్ట్రాలలో తన ఎజెండా అమలుపరచే అవకాశం ఉన్న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ భాజపా రాబోయే కాలంలో చురుగ్గా పనిచేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని సుస్థిరం చేసేందుకు పలు వ్యూహాలు రచిస్తోంది. అధికార పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తోంది. 2024 ఎన్నికల నాటికి బలమైన ప్రాంతీయ పార్టీల నాయకులను భాజపాలో చేర్చుకుంటే అత్యధిక పార్లమెంట్ స్థానాలు సాధించడం కష్టతరమే కానీ అసాధ్యం మాత్రం కాదని రాజకీయ పరిశీలకుల అంచనా.

ఒక్క విషయం మాత్రం అంగీకరించాలి. మిగిలిన రాజకీయ పార్టీలు ఎన్నికలకు కొద్ది నెలల ముందు మాత్రమే ప్రజల్లోకి వెళ్లి ప్రచార సభలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తాయి. కానీ భాజపా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలతో ఏదో ఒక రూపంలో సంబంధాలు కలిగి ఉంటుందని అంటున్న రాజకీయ నిపుణుల మాటలు నూరు శాతం యదార్థం.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ విశ్లేషకుడు

Related posts

కరోనా బ్రీడింగ్ సెంటర్ గా మారిన ఏపి సెక్రటేరియేట్

Satyam NEWS

వరద ఉధృతి ఎక్కువగా ఉంది… గోదావరి లోకి వెళ్లద్దు

Satyam NEWS

కోలుకుంటున్న ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ

Satyam NEWS

Leave a Comment