31.2 C
Hyderabad
May 3, 2024 02: 12 AM
Slider సంపాదకీయం

జనాభా లెక్కలకు అడ్డు చెప్పడమా? ఇదేంటి?

Y S Jagan NPR

అనుభవ రాహిత్యమో, అవగాహనా రాహిత్యమో తెలియదు కానీ నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్ పి ఆర్) ను ప్రస్తుత పద్ధతిలో అమలు చేయరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. ఎన్ పి ఆర్ అనేది జనాభా లెక్కలు మాత్రమే అనే విషయాన్ని మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పలువురిని ఆశ్చర్య పరుస్తున్నది.

 ఎన్ పి ఆర్ లో సాధారణ విషయాలు తప్ప మతానికి సంబంధించిన అంశాలు ఉండవు. పైగా ఎలాంటి ధృవపత్రాలు అడగరు. ఎన్ పి ఆర్ తో ఒక వ్యక్తి మతాన్ని నిర్ధారించే అవకాశం లేదు. ఇది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ మాత్రమే.

అలాంటి ఎన్ పి ఆర్ ను 2010 ప్రశ్నావళి ప్రకారం మాత్రమే చేపట్టాలని లేకపోతే తాము తిరస్కరిస్తామని మంత్రివర్గం తీర్మానించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఎన్ పి ఆర్ ప్రశ్నావళిని మార్చే వరకూ రాష్ట్రంలో ఆ ప్రక్రియను నిలిపివేయాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు.

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది 1955 భారత పౌరసత్వ చట్టం ప్రకారం నిర్వహిస్తారు. ఎన్ పి ఆర్ లో నమోదు చేసుకోవాల్సిన బాధ్యత 2003 పౌరసత్వ నిబంధనల ప్రకారం తప్పని సరి. దీన్ని ఏ పౌరుడు తిరస్కరించే వీలే ఉండదు. అలాంటిది రాష్ట్ర మంత్రి వర్గం తిస్కరించడం అవగాహనా రాహిత్యమేనని రాజ్యాంగ నిపుణులు సత్యం న్యూస్ కు తెలిపారు.

దేశంలో ఎన్ పి ఆర్ అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.3941.35 కోట్లు కేటాయించింది. రాష్ట్రాలలో ఎన్నికల సంఘం తన అధికారులను నియమించుకున్నట్లు ఎన్ పి ఆర్ అమలు కోసం ఆయా రాష్ట్రాల క్యాడర్ కు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసుకుంటుంది.

దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు ముగ్గురు అధికారుల ప్యానెల్ పంపడం వరకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్ పి ఆర్ అసోం లో తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తారు. ఎన్ పి ఆర్ ను ప్రతి పది సంవత్సరాలకు ఒక సారి అమలు చేస్తారు. ఈ సర్వే ద్వారా దేశంలో పేదరికాన్ని అంచనా వేస్తారు.

చదువుకున్న వారి సంఖ్య తదితర వివరాలు తెలుస్తాయి. అక్షరాశ్యత తక్కువ ఉన్న రాష్ట్రాలు పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు గుర్తిస్తారు. అందుకు అనుగుణంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. ఎన్ పి ఆర్ ను తిరస్కరించడం ద్వారా రాష్ట్రంలోని పేదల డేటా కేంద్రానికి అందకుండా పోతుంది.

దీనివల్ల రాష్ట్రానికి మరెంతో నష్టం వాటిల్లుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో బయోమెట్రిక్ వివరాలను సేకరించరు.  అందువల్ల ఏ మతం వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2010 లో జరిగిన జనాభా లెక్కలలో 15 ప్రశ్నలు అడగగా ఈ సారి వాటి సంఖ్య 21కి చేరింది.

ఎలాంటి ధృవపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేని ఈ జనాభా లెక్కలను రాజకీయాలకు వాడుకోవడం ఎంత వరకూ సబబో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్ డాట్ నెట్

Related posts

నిమ్మగడ్డ కోసం అసెంబ్లీ ప్రవిలేజ్ కమిటీ ప్రత్యేక భేటీ

Satyam NEWS

హుజూర్ నగర్ లో 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక

Satyam NEWS

చేతబడి చేశారంటూ దంపతులను చెట్టుకు వేలాడదీసి కొట్టిన గ్రామస్తులు

Bhavani

Leave a Comment